
కాంగ్రెస్ ఇదే పాలన.. బండి చురకలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పినా తీరు మారకపోవడం బాధాకరం అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఇదేం పాలన కాంగ్రెస్ అంటూ ప్రశ్నించారు. పెంచాల్సిన వేతనాలను తగ్గించడమే ఇందిరమ్మ పాలనా? అని చురకలంటించారు. ఉద్యోగులకు డీఏలు ఇవ్వరు.. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచరు.. అంటూ మండిపడ్డారు బండిసంజయ్. ఉద్యోగులకు డీఏలివ్వరు....ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచరా? డ్రైవర్లు, వర్క్ ఇన్ స్పెక్టర్లకు 25 శాతానికిపైగా వేతనాలు తగ్గించడం దుర్మార్గం? ఇది కాంగ్రెస్ ప్రభుత్వ మతిలేని చర్య అని విమర్శలు గుప్పించారు. నాలుగేళ్లుగా ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు ఎందుకు పెంచడం లేదు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా తీరు మారదా? తక్షణమే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలను పెంచండి అని డిమాండ్ చేశారు.
‘‘రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం. పట్టణాల పరిశుభ్రతలో శానిటేషన్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకం. కరోనా మహమ్మారి కాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి అందించిన సేవలు మరువలేనివి. దురదద్రుష్టమేమిటంటే... ఆనాటి నుండి నేటి వరకు వేతనాలు పెంచాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. పైగా మున్సిపల్ డ్రైవర్లు, వర్క్ ఇన్సెక్టర్లకు చెల్లిస్తున్న వేతనాలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గం. భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ప్రతి ఏటా పెరిగే నిత్యావసర ధరలు, ఇతర ఖర్చులను ద్రుష్టిలో ఉంచుకుని ఉద్యోగుల జీత భత్యాలను పెంచడం పరిపాటి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు పెంచకపోగా ఉన్న వేతనాల్లో భారీగా కోత విధించడం ఎంత వరకు సమంజసం? ఇప్పటి వరకు శానిటరీ ఇన్ స్పెక్టర్లకు నెల వేతనం రూ.22 వేలు చెల్లిస్తుండగా, ఆ వేతనాన్ని రూ.16,600లకు తగ్గించడం దుర్మార్గం.
అట్లాగే డ్రైవర్లకు సైతం ఇదే విధంగా కోత విధించడం ఎంత వరకు న్యాయం? రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో 30 వేల 955 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. 2021 జూన్ 11న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ 30 శాతం మేరకు వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. నాటి నుండి నేటి వరకు అంటే గత నాలుగేళ్లుగా వేతనాల పెంపు ఊసే లేదు. పైగా దాదాపు 3 వేల మంది శానిటరీ ఇన్ స్పెక్టర్లు, డ్రైవర్ల వేతనాల్లో ఏకంగా 25 శాతానికిపైగా కోత విధించడం కాంగ్రెస్ ప్రభుత్వ మతిలేని చర్యగా భావిస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అందుకు భిన్నంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 5 డీఏలు పెండింగ్ లో ఉన్నప్పటికీ వాటిని చెల్లించడం లేదు. జీపీఎఫ్ లో దాచుకున్న సొమ్మును కూడా డ్రా చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఆఖరికి రిటైర్డ్ మెంట్ బెన్ ఫిట్స్ ఇవ్వకుండా కాళ్ల చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటూ ఉద్యోగులను వేధిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పినా తీరు మారకపోవడం బాధాకరం. నేడు మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ శానిటరీ ఇన్ స్పెక్టర్లు, డ్రైవర్ల వేతనాల్లో భారీగా కోత విధించడాన్ని చూస్తుంటే ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిపట్ల కాంగ్రెస్ కు ఉన్న వ్యతిరేక భావం అర్ధమవుతోంది. తెలంగాణ ప్రజలు విజ్ఝులు. అన్నీ గమనిస్తున్నారు. తక్షణమే చేసిన పొరపాటును సరిదిద్దుకుని మున్సిపల్ డ్రైవర్లు, శానిటేషన్ వర్క్ ఇన్ స్పెక్టర్ల వేతనాలను సరిచేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది అందరికీ వేతనాలను పెంచాలి’’ అని డిమాండ్ చేశారు.