తెలంగాణ సర్కార్ లో  వైశ్య స్వాతంత్య్ర యోధుడికి అవమానం అంటున్న బండి
x

తెలంగాణ సర్కార్ లో వైశ్య స్వాతంత్య్ర యోధుడికి అవమానం అంటున్న బండి

యూనివర్శిటీ నుంచి పొట్టి శ్రీరాములు పేరు ఎలా తీసేస్తారు? ఎన్టీఆర్, కోట్ల, నీలం, కాసు పేర్లను తొలగించే దమ్ముందా? : ముఖ్యమంత్రి రేవంత్ కు బండి సంజయ్ సవాల్


తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరామలు పేరును తొలగించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ‘‘పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేకసార్లు జైలుకు పోయినోడు. హరిజనులను ఆలయాల్లోకి ప్రవేశం కల్పించాలని ఉద్యమించి శాసనం చేయించినోడు. శ్రీరాములు లాంటోళ్లు 10 మంది ఉంటే ఎప్పుడో స్వాతంత్య్రం తెచ్చేటోడినని అన్నారంటే ఆయన గొప్పతనం అర్ధం చేసుకోవాలి. అట్లాంటి నేత పేరును తొలగించి అవమానిస్తారా?’’ అని మండి పడ్డారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. ‘‘ఆంధ్రా మూలాలున్నాయని పొట్టి శ్రీరామలు పేరు తొలగించారు. మరి ఆ మూలాలున్న ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మనందరెడ్డి పేరిట అనేకం ఉన్నాయి. వారి పేర్లను కూడా తొలగిస్తారా?’’అని సవాల్ విసిరారు. బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా రెడ్డబోయిన గోపీ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పట్టణ కేంద్రంలో ఆత్మీయ సమ్మేళం నిర్వహించారు. వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహంచారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బండి సంజయ్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ఏమన్నారంటే....

కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్యుల వ్యతిరేక పార్టీ. దళిత వ్యతిరేక పార్టీ. పొట్టి శ్రీరాములు జయంతి ఈరోజు. ఆయన గొప్ప దేశభక్తుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. హరిజనులకు దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని ఉద్యమించి శాసనం చేయించిన నాయకుడు. ఆంధ్ర రాష్ట్రం కోసమే కాదు.... దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొని అనేకసార్లు జైలుకు పోయిన నాయకుడు. పొట్టి శ్రీరాములు లాంటి వాళ్లు నా వెంట 10 మంది ఉంటే చాలు... దేశానికి ఎప్పుడో స్వాతంత్ర్యం తెచ్చేవాడనని మహాత్మాగాంధీయే చెప్పారంటే ఆయన గొప్పతనం అర్ధమవుతుంది. మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్రను వేరు చేయాలని ఉద్యమించారే తప్ప ఏనాడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదే.. అట్లాంటి మహనీయుడి పేరును తొలగించి తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలనుకోవడం దుర్మార్గం. సురవరం పట్ల మాకు అభ్యంతరం లేదు. గొప్ప వ్యక్తే. మంచి రచయిత. తెలుగు భాష ఉద్దరణ కోసం పాటుపడ్డారు. ఇయాళ ఆయన బతికుంటే సీఎం చేసిన పనికి బాధపడేవారు. ఆంధ్రా మూలాలున్నాయని పొట్టి శ్రీరాములు పేరును తీసేయడం దారుణం. అట్లయితే ఎన్టీఆర్ పేరును కూడా తీసేస్తారా? కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి పేర్లను తొలగిస్తారా? తొలగించే దమ్ముందా సీఎం గారు.. వాళ్లకు ఒక రూల్. పొట్టి శ్రీరాములకు ఇంకో రూలా? సీఎంకు దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలి.
మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్రను వేరు చేసి తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని మాత్రమే కోరిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. అంతే తప్ప తెలంగాణకు వ్యతిరేకం కాదే. అట్లాంటి వ్యక్తిని అవమానించడం ఎంత వరకు కరెక్ట్? ఆర్యవైశ్య సమాజమంతా ఆగ్రహంతో ఉంది. హిందూ సమాజమంతా ఆలోచించాలి. ఈ దేశం కోసం పోరాటాలు చేసిన వాళ్లను, త్యాగాలు చేసిన వాళ్లను స్మరించుకోవడం, వారి విగ్రహాలు పెట్టి గౌరవించుకోవడం మన సంస్కారం. వారి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి రాబోయే తరానికి స్పూర్తిగా నిలుపుతాం. అట్లా కాకుండా అవకాశవాద రాజకీయాలు చేస్తూ మహనీయులను అవమానించడం ఏమాత్రం సరికాదు. స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను తెరమరుగు చేయడం కరెక్ట్ కాదు. యధా రాజా...తథా ప్రజా. రాహుల్ గాంధీ తీరు కూడా అట్లనే ఉంది. ఆయన కూడా యూరప్ పోయి భారత దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని కోరి దేశం పరువు తీసిండు..


Read More
Next Story