కరీంనగర్ రేస్‌లో బండి, కారు జోరు, ఇంకా రంగంలోకి రాని హస్తం.
x
Karimnagar Candidates

కరీంనగర్ రేస్‌లో 'బండి', కారు జోరు, ఇంకా రంగంలోకి రాని హస్తం.

కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో రెండు పార్టీల కీలక అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ఇంకా ప్రకటించక పోవడంతో ప్రచారం ప్రారంభించలేదు.



కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండు ప్రధాన పార్టీల తరపున పాత ప్రత్యర్థులైన ఇద్దరు కీలక నేతలు తలపడుతున్నారు. కరీంనగర్ ప్రస్థుత సిట్టింగ్ ఎంపీ, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బరిలో రెండోసారి బరిలో నిలిచారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ అభ్యర్థి, కేసీఆర్ సమీప బంధువు బోయినపల్లి వినోద్ కుమార్ పాత ప్రత్యర్థితో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇంకా ప్రకటించలేదు. దీనితో కరీంనగర్ లో రేసులో సర్వత్రా కనిపిస్తున్నది బండి సంజయ్ , వినోద్ సందడియే. అభ్యర్థిని ఖరారు చేయకున్నా కరీంనగర్ పార్లమెంట్ ఇన్ చార్జీగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం సాగిస్తున్నారు.

తేలని కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక


కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక ఎంతకూ తేలడం లేదు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్, రుద్ర సంతోష్ కుమార్ పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానవర్గం పరిశీలిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ అసెంబ్లీ సీటును పొన్నం ప్రభాకర్ కు కేటాయించినపుడు ఎంపీ టికెట్ ప్రవీణ్ రెడ్డికి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం హామి ఇచ్చింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిటీ జాబితాలో ప్రవీణ్ రెడ్డి ఒక్క పేరునే కేంద్ర కమిటీకి పంపించింది. అయితే ఖమ్మం ఎంపీ అభ్యర్థి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఇక్కడ వెలమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికతో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ఎంపిక ముడిపడి ఉండటంతో రెండుస్థానాలను పెండింగులో ఉంచింది. ముందుగా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారంలో ముందుండగా కాంగ్రెస్ అభ్యర్థి తేలక పోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరుత్సాహంలో ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని సెంట్రల్ ఎన్నికల కమిటీ లేటుగా ప్రకటించినా లేటెస్టుగా ప్రజల ముందుకు వచ్చి విజయం సాధిస్తామని చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న గ్యారంటీల అమలును చూసి ఓటర్లు తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


కేసీఆర్ సొంత సీటులో...
కరీంనగర్ సీటు భారత రాష్ట్ర సమితికి ప్రతిష్టాకరమయింది.తెలంగాణ ఉద్యమం అనంతరం కరీంనగర్ లో గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వరుసగా 2004, 2006 ఉప ఎన్నికలు, 2008 ఉప ఎన్నికల్లో మూడుసార్లు విజయం సాధించి పార్లమెంట్ లో తెలంగాణ వాణిని వినిపించారు. కరీంనగర్ బిఆర్ ఎస్ పెట్టనికోట అనే పేరుండింది. అయితే, అనంతరం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనుహ్య పరిణామం బిఆర్ ఎస్ కు ఎదురయింది. పార్టీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కెసిఆర్ కు సమీప బంధువు అయిన బోయిన పల్లి వినోద్ కుమార్ ఓటమి చవి చూశారు. వరంగల్ జిల్లాకు చెందిన బోయిన్‌పల్లి వినోద్ కుమార్ గతంలో హన్మకొండ ఎంపీగా గెలిచారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్ విభజనలో భాగంగా హన్మకొండ రద్దు చేయడంతో తన అమ్మమ్మ సొంత జిల్లా అయిన కరీంనగర్‌ను ఎంచుకొని 2014 సంవత్సరంలో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అందువల్ల ఈ సీటును తిరిగి గెల్చుకోవడం బిఆర్ ఎస్ చాలా అవసరం. అదే విధంగా ఈ సీటును నిలుపుకోవడం బండి సంజయ్ కు అంతే ప్రతిష్టాకరం. ఈ మధ్య లో ఇపుడు కాంగ్రెస్ చొరబడే ప్రయత్నం చేస్తూఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెల్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ లో విజయోత్సాం కనపిస్తుంది. తన అసంబ్లీ గెలుపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొనసాగించలని కాంగ్రెస్ తాపత్రయం. ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు లోక్ సభస్థానాన్ని గెల్చుకోవడం చాలా అవసరం. పార్టీలో ఆయన ప్రాబల్యం పెరిగేందుకు అది దోహదం చేస్తుంది. ఈ ఉత్సాహం తో ఆయన క్యాంపెయిన కూడా చేస్తున్నారు. అయితే, పార్టీ యే ఇంకా అభ్యర్థిని ప్రకటించలేకపోతున్నది.

బండి సంజయ్ బ్యాక్ గ్రౌండ్

బండి సంజయ్ సరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్య అభ్యసించి ఆర్ఎస్ఎస్ ఘటన్ నాయక్ గా, ముఖ్య శిక్షక్ గా పనిచేశారు. ఏబీవీపీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా, బీజేవైఎంలోనూ పనిచేశారు. 1994-2003 వరకు కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1996లో మాజీ కేంద్ర మంత్రి ఎల్ కే అద్వానీ నిర్వహించిన రథయాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్వయం సేవకుడిగా పనిచేసిన బండి సంజయ్ కుమార్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి కరీంనగర్ కార్పొరేటరు అయ్యారు.2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2005 నుంచి 2019 వరకు బీజేపీ కార్పొరేటరుగా పనిచేసిన బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ అనూహ్యంగా 2019 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు.


బోయినపల్లి వినోద్ ఎవరు?

గతంలో వరంగల్ జిల్లాలో సీపీఐ కార్యదర్శిగా పనిచేసిన వినోద్ కుమార్ సీనియర్ న్యాయవాది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆరంభించిన ఉద్యమంలో వెంట నడుస్తూ గులాబీ పార్టీ అధినేతకు సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు సాగారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం అనూహ్యంగా వినోద్ కుమార్ హన్మకొండ పార్లమెంట్ నుంచి రెండు సార్లు 2004, 2008 ఉప ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. కేసీఆర్ కు సమీప బంధువుగా, సన్నిహితుడిగా బోయిన్‌పల్లి నిలిచారు. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందడంతో అతనికి కేసీఆర్ తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. రెండు సార్లు ఎంపీగా, టీఆర్ఎస్ పార్టీకి, గులాబీ బాస్ కేసీఆర్ కు సలహాదారుడిగా వినోద్ కుమార్ ఆ పార్టీలో కీలక నాయకుడు.

బండి ప్రజాహిత యాత్రలు
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రజాహిత యాత్రలతో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ బండి ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలతో సమావేశాలు, కులసంఘాలతో భేటీలు జరిపిన బండి సంజయ్ ఓట్ల వేటలో పడ్డారు. మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించిన బండి రూటు మార్చి అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలను ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరుగ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని సంజయ్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మహిళలకు నెలకు రూ.2,500 మంజూరు, రైతుల వరిపంటకు రూ.500 బోనస్, రైతుబంధు, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసాకార్డు, వృద్ధులకు రూ.4వేల పింఛన్, రైతుల రుణమాఫీ ఏమయ్యాయని ప్రశ్నిస్తూ ప్రచారం చేస్తున్నారు. మరో వైపు బరాబర్ ఎన్నికల్లో రాముడి పేరు చెప్పుకొని ప్రచారం చేస్తామని బండి సంజయ్ చెబుతూ సంచలనం రేపారు. జైశ్రీరాం అంటూ హిందువుల ఇంటింటికి అయోధ్య రాముడి చిత్రపటాలను పంపిణీ చేసి రాముడి సెంటిమెంటును రగిల్చి ఓట్లవేటకు బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు కూడా విసిరారు.

కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభతో ప్రచారం
కరీంనగర్ లో ప్రజా ఆశీర్వాద సభ తో వినోద్ ప్రచారం మొదలయింది.బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ను గెలిపించాలని స్వయంగా పార్టీ అధినేత కెసిఆర్ ఓటర్లను అభ్యర్థించారు. గతంలో తాను ఎంపీగా పదవీ కాలంలో కరీంనగర్ అభివృద్ధికి చేసిన కృషిని వినోద్ ఓటర్లకు వివరిస్తున్నారు. తాను ఎంపీగా పార్లమెంటులో తెలంగాణ గళాన్ని సమర్ధంగా వినిపించానని బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పార్లమెంటులో ప్రశ్నలు సంధించడంలో, అత్యధిక డిబేట్లలో పాల్గొని తెలంగాణ వాదనను వినిపించానన్నారు. ఎంపీగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ప్రజలకు తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓటేయాలని ఆయన అభ్యర్థించారు. ‘‘కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ పథకం నిబంధనల ప్రకారం కరీంనగర్ పట్టణానికి అర్హత లేకున్నా.. అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారిని ఒప్పించి కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చడం జరిగింది. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేసి నేతన్నలకు అన్నం పెట్టినం’’ అని వినోద్ కుమార్ చెప్పారు. సామాజిక న్యాయాన్ని పాటించే వ్యక్తి వినోదన్న అని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అభివృద్ధిలో ముందుండాలంటే ప్రశ్నించే గొంతుక వినోదన్న పార్లమెంటులో ఉండాలని ప్రవీణ్ కుమార్ కరీంనగర్ సభలో పేర్కొన్నారు. యువతరం మతోన్మాదం, కులాల వైపు కాకుండా అభివృద్ధి వైపు చూడాలని వినోద్ కుమార్ యువతను అభ్యర్థిస్తూ ప్రచారం సాగిస్తున్నారు.


అధికార కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేల బలం
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నలుగురు ఎమ్మెల్యేల బలం, కార్యకర్తల బలగం ఉందని కాంగ్రెస్ ధీమా గా ఉంది. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర మంత్రి పదవి పొందిన పొన్నం ప్రభాకర్ ఈ పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూర్), ఆది శ్రీనివాస్ (వేములవాడ), మేడిపల్లి సత్యం (చొప్పదండి) ల బలం కాంగ్రెస్ అభ్యర్థికి ప్లస్ పాయింట్ కానుంది. బీఆర్ఎస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. గంగుల కమలాకర్ (కరీంనగర్), కల్వకుంట్ల తారకరామారావు(సిరిసిల్ల), పాడి కౌశిక్ రెడ్డి (హుజురాబాద్) సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. కరీంనగర్ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని గులాబీ బాస్ కేసీఆర్, మరో వైపు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాలుగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికలను బట్టి మారిన పార్టీల బలాబలాలు
ఎన్నికలను బట్టి ప్రధాన పార్టీల బలాబలాలు మారాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 37.2 శాతం ఓట్లతో నాలుగు ఎమ్మెల్యే సీట్లు లభించాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి 37.6 శాతం ఓట్లతో మూడు స్థానాలు దక్కాయి. బీజేపీకి కేవలం 18.2 శాతం ఓట్లతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఒక్క స్థానం కూడా లభించలేదు. దీంతో పాటు ప్రస్థుత ఎంపీ అభ్యర్థి అయిన బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అదే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 43.7 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అనూహ్యంగా విజయం సాధించారు. అప్పట్లో బీఆర్ఎస్ 35.9 శాతం ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా 45 శాతం, 56 శాతం ఓట్లతో విజయదుందుభి మోగించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ 52.5 శాతం ఓట్లు సాధించగా 2009 పార్లమెంట్ ఎన్నికల్లో 26.2 శాతం ఓట్లతో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది.

వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో మూడు పార్టీలకు పట్టం
గత ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి వరుసగా మూడు ప్రధానపార్టీల ఎంపీలు ప్రాతినిథ్యం వహించారు. గతంలో మూడు వరుస ఎన్నికల్లో ఒకసారి గెలిచిన పార్టీ మళ్లీ గెలవలేదు. 2009వ సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విజయం సాధించారు. అనంతరం 2014 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోయినపల్లి వినోద్ కుమార్ ఘన విజయం సాధించారు. అనంతరం 2019 లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిగా అప్పటి కార్పొరేటర్ బండి సంజయ్ కుమార్ గెలిచి చరిత్ర సృష్టించారు. మరి ఈ సారి జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారనేది ఎన్నికల ఫలితం వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే.

పదిసార్లు కాంగ్రెస్ పార్టీ విజయం
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన 19 సార్లు జరిగిన ఎన్నికల్లో పది సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించడంతో ఈ సీటు ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఇక్కడి నుంచి మూడు సార్లు బీజేపీ, మూడు సార్లు బీఆర్ఎస్, ఒకసారి టీడీపీ అభ్యర్థి ఎంపీగా విజయం సాధించారు. కరీంనగర్ నియోజకవర్గంలో 1971వ సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచే తెలంగాణ వాదం ఆరంభమైంది. నాడు తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎం సత్యనారాయణరావు విజయం సాధించారు. అనంతరం మూడుసార్లు గులాబీ బాస్ అధినేత కేసీఆర్ విజయం సాధించడంతో కరీంనగర్ లో తెలంగాణ వాదం ఉందని మరోసారి రుజువైంది.

వెలమల కంచుకోట...కరీంనగర్
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం వెలమలకు కంచుకోటగా మారింది. 1952వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 16 సార్లు జనరల్ ఎన్నికలు, మూడు సార్లు ఉప ఎన్నికలు జరగ్గా 15 సార్లు వెలమ అభ్యర్థులే విజయం సాధించారు. ఇక్కడి నుంచి మూడు సార్లు బీసీ నాయకులు, కేవలం ఒక్కసారి రెడ్డి నేత, రెండుసార్లు ఎస్సీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన బోయిన్ పల్లి వినోద్ కుమార్, కేసీఆర్, జువ్వాడి చొక్కారావు, ఎం సత్యనారాయణరావు, జే రమాపతిరావు, చెన్నమనేని విద్యాసాగర్ రావు ఎంపీలుగా గెలిచారు. చెన్నమనేని విద్యాసాగర్ రావు కరీంనగర్ నుంచి మూడు సార్లు గెలిచి ఏకంగా కేంద్రమంత్రి కూడా అయ్యారు. ఆపై గవర్నరుగా పనిచేశారు.

ఎందరో ప్రముఖుల ప్రాతినిధ్యం...
కరీంనగర్ నుంచి ఎందరెందరో ప్రముఖ నేతలు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. నాడు 1952లో నాటి పీడీఎఫ్ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి, ఎంఆర్ కృష్ణలు ఎంపీలుగా పనిచేశారు. ఎం సత్యనారాయణరావు, జువ్వాది చొక్కారావు, చెన్నమనేని విద్యాసాగర్ రావు, కేసీఆర్ లాంటి ఉద్ధండులైన నేతలు కరీంనగర్ ఎంపీలుగా పనిచేశారు.


Read More
Next Story