
సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ రెండు గిన్నిస్ రికార్డులు
అతిపెద్ద జానపద నృత్యం, అతిపెద్ద బతుకమ్మ రికార్డులు స్వంతం
సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు కైవసం చేసుకుంది. అతిపెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా రికార్డులను స్వంతం చేసుకుంది. గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా సరూర్‌నగర్ స్టేడియంలో సోమవారం బతుకమ్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 63.5 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు. ఒకేసారి 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించడంతో ప్రతీ ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా ఆడారు. మంత్రి సీతక్క బతుకమ్మపాట పాడి అందరి దృష్టిని ఆకర్షించారు.
సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు.
ఇండోర్ స్టేడియంలో జరిగిన రిహార్సల్స్‌ను గత వారం రోజుల నుంచి టూరిజం ఎండీ వల్లూరి క్రాంతి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ పంకజ, ఇతర సీనియర్ అధికారులు పరిశీలించారు. గిన్నిస్ రికార్డును కైవసం చేసుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పదిరోజుల క్రితమే తెలంగాణ సాంస్కృతిక శాఖ బతుకమ్మ పాటను విడుదల చేసింది
ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను పున:ప్రారంభించిన సంగతి తెలిసిందే. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలకు గిన్నిస్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఫలితాలను ప్రకటించే ముందు వివరాలను అధికారికంగా రికార్డు చేశారు.
Next Story