
పంచాయితీల్లో సత్తాచాటిన బీసీలు
రిజర్వేషన్ల ద్వారా కేటాయించింది 848 పంచాయితీలే అయినా 916 జనరల్ సీట్లలో కూడా గెలిచి బీసీనేతలు తమసత్తా చాటారనే చెప్పాలి
పంచాయితీ ఎన్నికల్లో బీసీలు తమ సత్తాచాటారు. మొదటిదశ పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో బీసీ రిజర్వుడు స్ధానాలకు మించి బీసీ(BC Reservations) అభ్యర్ధులు గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా (Telangana)తెలంగాణలో బీసీ వాదన బలంగా వినబడుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించటమే కారణం. కాంగ్రెస్ అధికారంలోకి రావటమే కాకుండా రేవంత్ ముఖ్యమంత్రి అవటంతో వెంటన బీసీ వాదం ఉవ్వెతున ఎగిసింది. స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశం అనేక మలుపులు తిరిగింది. ఆసెంబ్లీలో తీర్మానాలు చేసినా ఉపయోగంలేకపోయింది. గవర్నర్, రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగులో ఉండిపోయాయి. ఆర్డినెన్స్ జారీచేసిన ఉపయోగంలేకపోయింది.
తర్వాత ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఇలాంటి అనేకకారణాలతో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధ్యంకాదని తేలిపోవటంతో బీసీ సంఘాలు, బీసీ సంఘాల్లోని మేథావులు మండిపోయారు. 42శాతం రిజర్వేషన్లు డిమాండ్లు చేస్తు బీసీ సంఘాల ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్ని ఆందోళనలు జరిగినా ఫలితం కనబడలేదు. ఇదేసమయంలో రేవంత్ మాట్లాడుతు చట్టపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధ్యంకానపుడు పార్టీపరంగా ఇస్తామని చేసిన ప్రకటనతో బీసీ నేతలు మరింతగా మండిపోయారు. ఎందుకంటే రిజర్వేషన్లు చట్టబద్దం కానపుడు పార్టీపరంగా ఇచ్చే రిజర్వేషన్లకు విలువ ఉండదు.
సరే, ఎవరి వాదన ఎలాగున్నా చివరకు పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అవటంతో పల్లెపోరు మొదలైపోయింది. ఒకసారి నామినేషన్ల ప్రక్రియ మొదలైపోయిన తర్వాత బీసీ రిజర్వేషన్ల డిమాండ్ వెనకబడిపోయింది. పంచాయితీలకు మూడుదశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటిదశ ఎన్నిక జరిగి ఫలితాలు కూడా వెలువడ్డాయి. మొదటిదశలో 4,230 సర్పంచ్ స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ప్రకారం ఖరారయ్యాయి. వీటిల్లో బీసీలకు 20శాతం సీట్లను కేటాయించింది ఎన్నికల కమిషన్. 4,230 సీట్లలో 20శాతం అంటే 848 సర్పంచ్ సీట్లు బీసీలకు రిజర్వయ్యాయి. జనరల్ సీట్లలో కూడా బీసీలు పోటీచేసి సత్తా చాటాలనే డిమాండ్లు బీసీ సామాజికవర్గాల్లో పెరిగిపోయాయి. డిమాండ్లు, సూచనలు వర్కవుటవ్వటంతో రిజర్వుడు స్ధానాలతో పాటు బీసీనేతలు జనరల్ సీట్లలో కూడా పోటీచేశారు. మొత్తంమీద రిజర్వుడు+జనరల్ 1,764 పంచాయితీలను బీసీ నేతలు గెలుచుకున్నారు.
రిజర్వేషన్ల ద్వారా కేటాయించింది 848 పంచాయితీలే అయినా 916 జనరల్ సీట్లలో కూడా గెలిచి మొత్తంమీద 1764 పంచాయితీలను గెలుచుకుని బీసీనేతలు తమసత్తాను చాటారనే చెప్పాలి. ముఖ్యంగా హనుమకొండ, పెద్దపల్లి జిల్లాల్లో అత్యధిక జనరల్ సీట్లలో బీసీలు గెలిచారు. హనుమకొండలో 69.6 శాతం పంచాయితీలను, 65.6 శాతం సీట్లలో బీసీలు గెలిచారు. శాతాలను పక్కనపెట్టి సీట్ల సంఖ్యను చూస్తే హనుమకొండ జిల్లాలో బీసీలకు రిజర్వయిన పంచాయితీలు 26 అయితే అదనంగా 22 జనరల్ పంచాయితీల్లో కూడా బీసీలు పోటీచేసి మొత్తం 48 పంచాయితీల్లో గెలిచారు. అలాగే పెద్దపల్లి జిల్లాలోని 99 జనరల్ పంచాయితీల్లో 38 చోట్ల, రిజర్వేషన్ల ద్వారా వచ్చిన 27 చోట్ల పోటీచేసి 65 పంచాయితీలను బీసీల అభ్యర్ధులు గెలుచుకున్నారు. గద్వాలలో 31 రిజర్వుడు సీట్లతో పాటు 38 జనరల్ స్ధానాల్లో పోటీచేసి 69 పంచాయితీల్లో బీసీలు గెలిచారు.
౩1 జిల్లాల్లో బీసీలు గెలిచారు
సిద్ధిపేట జిల్లాలో రిజర్వయిన 47 పంచాయితీలకు అదనంగా 55 జనరల్ సీట్లతో కలుపుకుని 102 పంచాయితీల్లో గెలిచారు. కరీంనగర్, నల్గొండ, కొత్తగూడెం, సూర్యాపేట, జనగామ, వరంగల్ లాంటి మొత్తం 31 జిల్లాల్లోని జనరల్ పంచాయితీల్లో గెలిచి బీసీనేతలు తమ సత్తాను చాటారు. రెండో దశలోని జనరల్ సీట్లలో ఎంతమంది పోటీచేస్తున్నారు, మూడోదశ ఎన్నికలోని జనరల్ పంచాయితీల్లో ఎంతమంది బీసీలు నామినేషన్లు వేస్తారన్నది చూడాలి. మొత్తంమీద రేవంత్ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లను చట్టబద్దంగా ఇవ్వకపోయినా, అనధికారికంగా పార్టీపరంగా పంచాయితీలు కేటాయించకపోయినా కేవలం బీసీవాదనను నిలబెట్టాలని, రిజర్వేషన్లకు చట్టబద్దత సాధించుకోవాలన్న పట్టుదలతోనే బీసీలు జనరల్ సీట్లలో కూడా పోటీచేసి గెలుస్తున్నారు. పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటుతున్న బీసీ సామాజికవర్గాల ప్రభావం తర్వాత జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏమేరకు వర్కవటవుతుందో చూడాలి.
బీసీ సత్తా చాటుతారు :పర్వతం
ప్రజల్లో బీసీ చైతన్యం పెరిగింది అనటానికి ఇదే నిదర్శనం అని అంబేద్కర్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లెక్షిరిర్, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ అని అభిప్రాయపడ్డారు. జనరల్ సీట్లలో గెలుపుపై తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘రిజర్వేషన్లు బీసీలు తీసుకోవటం కాదు కేటాయించే స్ధాయికి చేరుకోవాలి’’ అని చెప్పారు. ‘‘ఇకనుండి రిజర్వుడు సీట్లలోనే కాకుండా జనరల్ సీట్లలో కూడా పోటీచేసి సత్తా చాటుతారు’’ అన్నారు. ‘‘పవర్ ద్వారా ఎన్ని పనులు చేయచ్చు అన్నఆలోచన బీసీల్లో పెరిగిపోతోంది’’ అని చెప్పారు. ‘‘గ్రామపోరులో పోటీచేసిన అభ్యర్ధుల్లో గెలుపుకు ఎక్కువగా అభ్యర్ధి వ్యక్తిగతమే ఎక్కువగా పనిచేసింది’’ అని అన్నారు. ‘‘బీసీ అభ్యర్ధులపైన పోటీచేసిన అగ్రవర్ణాల అభ్యర్ధులను కూడా కొన్నిచోట్ల వ్యక్తిత్వాన్ని చూసే గెలిపించారు’’ అని చెప్పారు. ‘‘బీసీలను ఒకపుడు చిన్నచూపు చూసిన అగ్రవర్ణాల నేతలు ఇపుడిప్పుడే గౌరవం ఇస్తున్నట్లు కనబడుతోంది’’ అని చెప్పారు. ‘‘రెండోదశ ఎన్నికల ఫలితాల్లో కూడా బీసీలు సత్తా చాటుతారు’’ అనేథీమా వ్యక్తంచేశారు. ‘‘కొన్ని పంచాయితీల్లో అగ్రవర్ణాల్లో ముఖ్యంగా రెడ్డి నేతలు సర్పంచ్ పదవులను బీసీనేతలకు వదిలేశారు’’ అని చెప్పారు.
బీసీవాదం పెరిగింది : చిరంజీవులు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ మేథావుల ఫోరం అధ్యక్షుడు తగరాల చిరంజీవులు మాట్లాడుతు ‘‘గ్రామాల్లో ఎక్కువగా బీసీలే ఉంటారని అగ్రవర్ణాల జనాభా సంఖ్య తక్కువగానే ఉంటుంది’’ అని గుర్తుచేశారు. ‘‘గ్రామ జనాభాలో మెజారిటీ బీసీలదే అయినా మొన్నటివరకు ఎన్నికలు, పోటీ, గెలుపుపై బీసీలు పెద్దగా ఆలోచించలేదు’’ అని అన్నారు. ‘‘ఇపుడు రాజకీయంగా చైతన్యం పెరగటంతో రాజకీయాల్లోకి రావాలని, ఎన్నికల్లో గెలిచి పదవులు అందుకోవాలన్న ఆలోచన బీసీల్లో పెరిగింది’’ అని అన్నారు. ‘‘పెరిగిన చైతన్యమే జనరల్ సీట్లలో కూడా బీసీలు పోటీచేసి గెలవటానికి నిదర్శనం’’ అని చెప్పారు. ‘‘జనాభాలో మెజారటి బీసీలదే కాబట్టి పోటీచేసిన జనరల్ సీట్లలో కూడా బీసీ అభ్యర్ధులు తేలిగ్గా గెలిచారు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘గతంలోకన్నా బీసీ వాదన పెరిగింది కాబట్టి చైతన్యం పెరిగింది’’ అని అన్నారు.

