ఉద్యమానికి సిద్ధమవుతున్న తెలంగాణా  బీసీలు
x
BC associations president and Rajyasabha MP R Krishnaiah

ఉద్యమానికి సిద్ధమవుతున్న తెలంగాణా బీసీలు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకోవాల్సిందే అని బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.


రిజర్వేషన్ల అంశంపై తెలంగాణా బీసీ సామాజికవర్గాల సంఘాలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయా ? పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకోవాల్సిందే అని బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఒకవేళ ఇచ్చిన హామీని తప్పితే ఉద్యమంచేయక తప్పదని ప్రభుత్వానికి అల్టిమేట్ కూడా ఇచ్చాయి. అసలు విషయం ఏమిటంటే స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతోంది. జూలైనాటికి జిల్లా పరిషత్, మండల పరిషత్తుల కాలపరిమితి పూర్తయిపోతుంది. కాబట్టి కొద్దిరోజులు పర్సన్ ఇన్చార్జీలను నియమించి వీలైనంత తొందరలోనే ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడే ప్రభుత్వానికి, బీసీ సంఘాలకు మధ్య చిచ్చు మొదలైంది.

చిచ్చు ఎందుకంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీఇచ్చింది. పార్టీ అధికారంలోకి రాగానే కులగణను చేసి బీసీలకు న్యాయబద్ధంగా అందాల్సిన 42 శాతం రిజర్వేషన్ను వర్తింపచేస్తామని అప్పట్లో రేవంత్ రెడ్డి మొదలు చాలామంది హామీలిచ్చారు. ఇపుడేమో కులగణ చేయకుండానే జూలైలో ఎన్నికలకు రెడీ అయిపోతున్నది ప్రభుత్వం. దీన్ని ఆక్షేపిస్తు 13 బీసీ సంఘాలు, 30 కులసంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజ్యసభ ఎంపీ ఆర్ కష్ణయ్య హాజరయ్యారు. కులగణన చేయకుండా, బీసీల రిజర్వేషన్ ఎంతో తేల్చకుండా స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు లేదని సమావేశం తీర్మానంచేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలుపుకోవాల్సిందే అని మిగిలిన పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.

ఇదే విషయమై తెలంగాణా ఫెడరల్ తో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని తప్పితే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ‘కులగణన చేయకుండా, బీసీల జనాభా ఎంతో తేలకుండా, జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కేటాయించకుండా స్ధానిక సంస్ధల ఎన్నికలను ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుంద’ని ప్రశ్నించారు. ‘రిజర్వేషన్లు పెంచాలంటే ముందు కులగణను చేయాల్సిందే’ అని స్పష్టంగా చెప్పారు. ‘ఒకవేళ తమ డిమాండును పట్టించుకోకుండా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు వెళితే తీవ్ర పరిణామాలు తప్పవ’ని కూడా హెచ్చరించారు. ‘కులగణనకు ఎంతకాలం పట్టినా సరే అభ్యంతరం లేద’ని ఎంపీ తేల్చిచెప్పారు. ‘ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా తాము అన్నీ పార్టీలతోను మద్దతుకోసం మాట్లాడుతున్న’ట్లు చెప్పారు. ‘ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపచేయాల్సిందే’ అని కృష్ణయ్య డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిశెట్టి నిరంజన్ మాట్లాడుతు కులగణన చేయకుండా స్ధానికసంస్ధల ఎన్నికలు నిర్వహించకూడదన్న డిమాండులో అర్ధంలేదన్నారు. ‘కులగణనకు చాలాకాలం పడుతుంద’న్న విషయాన్ని గోపిశెట్టి గుర్తుచేశారు. ‘అంతకాలం ఎన్నికలు జరపకుండా వాయిదావేయటం వల్ల స్ధానికసంపస్ధలకు కేంద్రప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఆగిపోతాయ’ని చెప్పారు. ‘కులగణన, రిజర్వేషన్లతో పాటు నిధులు, అభివృద్ధి కూడా ప్రభుత్వానికి కీలకమే కదా’ని నిరంజన్ ప్రశ్నించారు. ‘కులగణన, రిజర్వేషన్లపై పట్టుబడుతున్న బీసీ సంఘాలు అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోవాల’ని విజ్ఞప్తిచేశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. రిజర్వేషన్లు 50 శాతంకు మించకూడదన్న సుప్రింకోర్టు ఆదేశాలను నిరంజన్ గుర్తుచేశారు.

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ వినయ్ భాస్కర్ మాట్లాడుతు రిజర్వేషన్ల ప్రకటించిన తర్వాతే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ‘పోలిటికల్ రిజర్వేషన్ల కోసం తాము ఎప్పటినుండో పోరాడుతున్న’ట్లు చెప్పారు. ‘తమ హయాంలో ఇంటింటి సర్వేని నిర్వహించినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించి కులగణన చేయాల’ని సూచించారు. ‘టైం బౌండ్ పెట్టుకుని కులగణను పూర్తిచేసి బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లను వర్తించేయాల్సిందే’ అన్నారు. ‘కులగణన చేయకుండా బీసీల రిజర్వేషన్ తేల్చకుండా ఎన్నికలకు వెళితే ప్రొటెస్ట్ చేస్తామని అదే సమయంలో ఎన్నికల్లో కూడా పాల్గొంటామ’ని వినయ్ భాస్కర్ స్పష్టంచేశారు.

Read More
Next Story