బీసీలకు ‘పెద్ద పీట’ నిజమేనా ?
x
Congress, BRS BJP (source Twitter)

బీసీలకు ‘పెద్ద పీట’ నిజమేనా ?

మొదటిసారి ఇంతమంది బీసీలకు టికెట్లు దక్కినా బీసీ సంఘాల నేతలు మాత్రం హ్యాపీగా లేరు. ఓడిపోయే ఎన్నికల్లో బీసీలకు టికెట్లివ్వటం కూడా గొప్పేనా అని నిలదీస్తున్నారు.


రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికలో మూడు ప్రధాన పార్టీలు బీసీలకు పెద్ద పీట వేశాయి. మొత్తం 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కలిపి 14 సీట్లిచ్చాయి. వీటిల్లో బీఆర్ఎస్ ఐదు చోట్ల టికెట్లివ్వగా, బీజేపీ ఐదుగురు నేతలకు టికెట్లిస్తే కాంగ్రెస్ మాత్రం ముగ్గురు నేతలకు మాత్రమే టికెట్లిచ్చింది. మొదటిసారి ఇంతమంది బీసీలకు టికెట్లు దక్కినా బీసీ సంఘాల నేతలు మాత్రం హ్యాపీగా లేరు. ఎందుకంటే ఓడిపోయే ఎన్నికల్లో బీసీలకు పిలిచి టికెట్లివ్వటం కూడా గొప్పేనా అని నిలదీస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇచ్చి ఓడిపోయారు కాబట్టి రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఎగ్గొట్టేందుకు పార్టీలు వేసిన ఎత్తుగడలుగా మండిపోతున్నారు.

విషయం ఏమిటంటే బీఆర్ఎస్ చేవెళ్ళ, నిజామాబాద్, జహీరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, హైదరాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను పోటీకి దింపింది. అలాగే బీజేపీ కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి, భువనగిరి, జహీరాబాద్ టికెట్లిచ్చింది. ఇక కాంగ్రెస్ మెదక్, సికింద్రాబాద్, జహీరాబాద్ లో టికెట్లిచ్చింది. మొత్తంమీద జహీరాబాద్ లో మాత్రమే మూడుపార్టీలు బీసీలకు టికెట్లిచ్చాయి. సికింద్రాబాద్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లిచ్చాయి. నిజామాబాద్ లో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్ధులను దింపాయి. భువనగిరిలో బీజేపీ, బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీలు ఇన్ని టికెట్లు ఇవ్వటం బీసీల మీద ప్రేమతోకాదని, కేవలం తప్పనిస్ధితిలో వేరేదారిలేకే ఇచ్చినట్లు బీసీ సంఘాల నేతలు మండిపోతున్నారు.

బీసీలకు టికెట్లు ఇచ్చామని పార్టీలు చెప్పుకోవటానికి మాత్రమే ఇన్ని టికెట్లు పనికొస్తాయని బీసీ హక్కుల కోసం పోరాటంచేస్తున్న జర్నలిస్టు రఘు అబిప్రాయపడ్డారు. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, మెదక్, చేవెళ్ళ లాంటి నియోజకవర్గాల్లో బీసీలకు గెలిచే అవకాశాలున్నాయా అని పార్టీలను నిలదీశారు. అభ్యర్ధులకు అదృష్టం ఉంటే తప్ప లాజికల్ గా పై నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు చాలా తక్కువన్నారు. సికింద్రాబాద్ లో నాన్ బీసీ పోటీచేయటానికి ఎవరు ముందుకు రాకపోవటంతోనే టీ పద్మారావు గౌడ్ కు కేసీయార్ టికెట్ ఇచ్చినట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్ లో గడ్డం శ్రీనివాసయాదవ్ కు, భువనగిరిగో క్యామ మల్లేష్ కు టికెట్లిచ్చిన విషయాన్ని రఘు ప్రస్తావించారు. పై నియోజకవర్గాల్లో బీసీలు కాకుండా ఇంకెవరైనా గట్టి అభ్యర్ధులుంటే ఇక్కడనుండి బీసీలకు కేసీయార్ టికెట్లిచ్చేవారేనా ? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తరపున పోటీచేస్తున్న స్ధానాల్లో బీసీలు గెలుస్తారా ? అనే సందేహాన్ని వ్యక్తంచేశారు.

బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్న మెదక్, ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాల్లో బీసీలకు కేసీయార్ ఎందుకు టికెట్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీలు రెడ్లు, కమ్మలు, వెలమలకు టికెట్లిచ్చుకుని గెలుపుపై నమ్మకంలేని నియోజకవర్గాల్లో బీసీలను పోటీచేయిస్తున్నట్లు మండిపోయారు. ఇపుడు పార్టీలు టికెట్లు ఇవ్వటం 14 టికెట్లు ఇచ్చామని చెప్పుకోవటానికి మాత్రమే పనికొస్తుందన్నారు. తెలంగాణా జనాభాలో 6.5 శాతం జనాభా ఉన్న రెడ్లకు పార్టీలు ఇచ్చే ప్రాధాన్యత 56 శాతం జనాభా ఉన్న బీసీలకు ఇవ్వటంలేదన్నారు. బీసీల ఓట్లు కావాలి కాని సీట్లు మాత్రం ఇవ్వరా అంటు సూటిగా ప్రశ్నించారు.

బీసీల జనాభా గురించి మాట్లాడుతు ప్రధానంగా ముదిరాజులు 26.5 లక్షలు, మున్నూరుకాపులు 14.88 లక్షలు, గౌడ్లు 10.21 లక్షలు, యాదవులు 13.37 లక్షలు, పద్మశాలీలు 11.86 లక్షలున్నట్లు చెప్పారు. సమగ్రసాధికార సర్వే వివరాల ఆధారంగానే తాను పై సామాజికవర్గాల జనాభాను చెప్పినట్లు రఘు చెప్పారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించటానికి సిద్ధపడకపోతే ముందుముందు మరింత అన్యాయం జరగటం ఖాయమన్నారు. ఇప్పటికన్నా బీసీలు మేల్కోకపోతే ఎవరు ఏమిచేయలేరని రఘు అభిప్రాయపడ్డారు.

Read More
Next Story