
బీసీల తర్వాత టార్గెట్ ఇదేనా ?
మెజారిటి పంచాయతీల్లో గెలిచిన బీసీలు తర్వాత టార్గెట్ గా స్ధానికసంస్ధల ఎన్నికలను ఎంచుకున్నట్లు కనబడుతోంది
పంచాయతీ ఎన్నికల్లో అనధికారికంగా బీసీల హవా కనబడింది. మెజారిటి పంచాయతీల్లో గెలిచిన బీసీలు తర్వాత టార్గెట్ గా స్ధానికసంస్ధల ఎన్నికలను ఎంచుకున్నట్లు కనబడుతోంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో (Telangana Congress)తెలంగాణలో బీసీ(BC Reservations) వాదన ఒక్కసారిగా పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు ఎనుముల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ అదికారంలోకి రావటమే కాకుండా (Revanth)రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రయ్యాడు. దాంతో బీసీలకు ఇచ్చిన 42శాతం రిజర్వేషన్లు అమలుచేయాలనే డిమాండ్లు మొదలై ఊపందుకుని చివరకు భారీ ఆందోళనలకు దారితీసింది. ఎన్ని ఆందోళనలు జరిగినా చట్టబద్దంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వటం రేవంత్ కు సాధ్యంకాలేదు. చివరకు పార్టీపరంగా కూడా బీసీలకు రేవంత్ 42శాతం రిజర్వేషన్లను అమలుచేయలేకపోయాడు.
ప్రభుత్వ, కాంగ్రెస్ వైఖరితో మండిపోయిన బీసీ మేథావులు, సంఘాల నేతలు జనరల్ సీట్లలో కూడా బీసీలు పోటీచేయాలని పిలుపిచ్చారు. దాని ఫలితంగా చట్టబద్దంగా బీసీలక కేటాయించిన సీట్లకు అదనంగా జనరల్ పంచాయతీల్లో కూడా బీసీ అభ్యర్ధులు పోటీచేశారు. దాని ఫలితంగా అత్యధిక సీట్లను బీసీ అభ్యర్ధులు గెలుచుకున్నారు. దీనితోనే రాష్ట్రంలో బీసీ వాదన ఎంతబలంగా నాటుకుంటోందో అర్ధమవుతోంది.
రాష్ట్రంలో 12,733 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిల్లో చట్టప్రకారం బీసీలకు దక్కేది 2,275 పంచాయతీలు మాత్రమే. ఎస్సీ, ఎస్టీల రిజర్వుడు సీట్లు పోను మిగిలిన పంచాయతీలు జనరల్ స్ధానాలు. బీసీలకు కేటాయించిన పంచాయతీల్లో ఎలాగూ బీసీలే పోటీచేయాలి కాబట్టి ఎవరు గెలిచినవారంతా బీసీలే అయ్యుంటారు. అయితే రిజర్వేషన్లు పోగా మిగిలిన 5,190 పంచాయతీలు జనరల్ క్యాటగిరీలో ఉన్నాయి. ఈ 5,190 పంచాయతీల్లో కూడా బీసీలు పోటీచేయగా 2,738(52.75శాతం) మంది బీసీ అభ్యర్ధులు గెలిచారు. అంటే రిజర్వయిన 2,275+గెలుచుకున్న జనరల్ పంచాయతీలు 2,738=5,013 పంచాయతీల్లో బీసీలే గెలిచినట్లయ్యింది.
మామూలుగా అయితే అంటే 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల వరకు బీసీలకు కేటాయించిన పంచాయతీల్లో పోటీకి మాత్రమే బీసీ అభ్యర్ధులు పోటీచేసేవారు. జనరల్ పంచాయతీల్లో పోటీచేయాలనే ఆలోచన చాలామంది బీసీలకు వచ్చేదికాదు. అలాంటిది ఇపుడు ఏకంగా జనరల్ క్యాటగిరి పంచాయతీల్లో పోటీచేయటమే కాకుండా 2,738 పంచాయతీలను గెలుచుకున్నారంటేనే అర్ధమవుతోంది తెలంగాణలో బీసీ వాదన ఎంత బలంగా ఉందో అని.
పంచాయతీల్లోని జనరల్ సీట్లలో గెలుపుతో తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికలు అంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆ తర్వాత జరగబోయే మున్సిపల్ ఎన్నికలను బీసీలు టార్గెట్ చేసుకున్నట్లు అర్ధమవుతోంది. స్ధానిక ఎన్నికల్లో కూడా బీసీలకు రిజర్వయిన స్ధానాలతో పాటు జనరల్ సీట్లలో కూడా బీసీలు పోటీచేయాలని బీసీ సంఘాల నేతలు పిలుపిస్తున్నారు. రాష్ట్రంలో 5,763 ఎంపీటీసీలు, 565 ఎంపీపీ సీట్లున్నాయి. అలాగే 565 జడ్పీటీసీలు, 31 జిల్లా పరిషత్తులున్నాయి. జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లోను, ఎంపీటీసీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గతంలో నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపుతో బీసీ సామాజికవర్గాల్లోని నేతలు, బీసీ సంఘాల నేతలు స్ధానికసంస్ధల ఎన్నికల్లో కూడా జనరల్ సీట్లలో పోటీచేయాల్సిందే అని గట్టిగా చెబుతున్నారు.
స్ధానిక ఎన్నికలే టార్గెట్ : తీన్మార్
తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో కూడా జనరల్ సీట్లలో బీసీలు పోటీచేయాలని తెలంగాణ రాజ్యాధికారపార్టీ(టీఆర్పీ) అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పిలుపిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వుడు సీట్లలోనే కాకుండా జనరల్ సీట్లలో కూడా పోటీచేసి గెలిచినట్లుగానే స్ధానికసంస్ధల ఎన్నికల్లో కూడా పోటీచేయాలన్నారు. పంచాయతీలు, స్ధానికసంస్ధల తర్వత టార్గెట్ చట్టసభలే అని తీన్మార్ చెప్పారు. పార్టీల్లో బీసీలు టికెట్లు తీసుకోవటం కాకుండా బీసీలే ఇతరులకు టికెట్లిచ్చేస్ధాయికి రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలని మల్లన్న చెప్పారు. ఎవరి అధికారంకిందా పనిచేయాల్సిన అవసరం లేదని బీసీ సామాజికవర్గాలు గుర్తించాలని కోరారు.
బీసీ సత్తా చాటుతారు :పర్వతం
ప్రజల్లో బీసీ చైతన్యం పెరిగింది అనటానికి ఇదే నిదర్శనం అని అంబేద్కర్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లెక్షిరిర్, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ అని అభిప్రాయపడ్డారు. జనరల్ సీట్లలో గెలుపుపై తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘రిజర్వేషన్లు బీసీలు తీసుకోవటం కాదు కేటాయించే స్ధాయికి చేరుకోవాలి’’ అని చెప్పారు. ‘‘ఇకనుండి రిజర్వుడు సీట్లలోనే కాకుండా జనరల్ సీట్లలో కూడా పోటీచేసి సత్తా చాటుతారు’’ అన్నారు. ‘‘పవర్ ద్వారా ఎన్ని పనులు చేయచ్చు అన్నఆలోచన బీసీల్లో పెరిగిపోతోంది’’ అని చెప్పారు. ‘‘గ్రామపోరులో పోటీచేసిన అభ్యర్ధుల్లో గెలుపుకు ఎక్కువగా అభ్యర్ధి వ్యక్తిగతమే ఎక్కువగా పనిచేసింది’’ అని అన్నారు. ‘‘బీసీ అభ్యర్ధులపైన పోటీచేసిన అగ్రవర్ణాల అభ్యర్ధులను కూడా కొన్నిచోట్ల వ్యక్తిత్వాన్ని చూసే గెలిపించారు’’ అని చెప్పారు. ‘‘బీసీలను ఒకపుడు చిన్నచూపు చూసిన అగ్రవర్ణాల నేతలు ఇపుడిప్పుడే గౌరవం ఇస్తున్నట్లు కనబడుతోంది’’ అని చెప్పారు. ‘‘రెండోదశ ఎన్నికల ఫలితాల్లో కూడా బీసీలు సత్తా చాటుతారు’’ అనేథీమా వ్యక్తంచేశారు. ‘‘కొన్ని పంచాయితీల్లో అగ్రవర్ణాల్లో ముఖ్యంగా రెడ్డి నేతలు సర్పంచ్ పదవులను బీసీనేతలకు వదిలేశారు’’ అని చెప్పారు.
బీసీవాదం పెరిగింది : చిరంజీవులు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ మేథావుల ఫోరం అధ్యక్షుడు తగరాల చిరంజీవులు మాట్లాడుతు ‘‘గ్రామాల్లో ఎక్కువగా బీసీలే ఉంటారని అగ్రవర్ణాల జనాభా సంఖ్య తక్కువగానే ఉంటుంది’’ అని గుర్తుచేశారు. ‘‘గ్రామ జనాభాలో మెజారిటీ బీసీలదే అయినా మొన్నటివరకు ఎన్నికలు, పోటీ, గెలుపుపై బీసీలు పెద్దగా ఆలోచించలేదు’’ అని అన్నారు. ‘‘ఇపుడు రాజకీయంగా చైతన్యం పెరగటంతో రాజకీయాల్లోకి రావాలని, ఎన్నికల్లో గెలిచి పదవులు అందుకోవాలన్న ఆలోచన బీసీల్లో పెరిగింది’’ అని అన్నారు. ‘‘పెరిగిన చైతన్యమే జనరల్ సీట్లలో కూడా బీసీలు పోటీచేసి గెలవటానికి నిదర్శనం’’ అని చెప్పారు. ‘‘జనాభాలో మెజారటి బీసీలదే కాబట్టి పోటీచేసిన జనరల్ సీట్లలో కూడా బీసీ అభ్యర్ధులు తేలిగ్గా గెలిచారు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘గతంలోకన్నా బీసీ వాదన పెరిగింది కాబట్టి ఎన్నికల్లో పోటీపై చైతన్యం పెరిగింది’’ అని అన్నారు.

