బీసీల వెంటపడుతున్నతెలంగాణ పార్టీలు
x
Telangana parties to woo BCs

బీసీల వెంటపడుతున్నతెలంగాణ పార్టీలు

సమాజంలో బీసీల జనాభా సగంకన్నా ఎక్కువగా ఉందన్న విషయం తేలటంతోనే పార్టీలు ఒక్కసారిగా బీసీల ఛాంపియన్ అనిపించుకోవాలని పోటీలు పడుతున్నాయి


ఇపుడు తెలంగాణలో పార్టీలన్నీ బీసీ జపంచేస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ ఎంఎల్సీ అభ్యర్ధులుగా పార్టీలు అగ్రవర్ణాల నేతలను వదిలిపెట్టి బీసీ నేతలనే ఎంపికచేయటం. తెలంగాణ(Telangana)లో ఎంఎల్ఏ కోటాలో ఐదుగురు ఎంఎల్సీలను ఎంపికచేయటానికి నామినేషన్ల గడువు 10వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఐదింటిలో కాంగ్రెస్ తరపున ముగ్గురు, సీపీఐ తరపున ఒకరు నామినేషన్లు దాఖలు చేయగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) తరపున మరో అభ్యర్ధి నామినేషన్ వేశారు. కాంగ్రెస్(Congress) తరపున నామినేషన్లు దాఖలుచేసిన ముగ్గురిలో ఒక బీసీ, మరో ఎస్సీ, ఇంకో ఎస్టీ నేతలున్నారు. బీసీ కోటాలో ప్రముఖ సినీనటి విజయశాంతి(Vijayasanthi), ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, ఎస్టీ నేత కేతావత్ శంకర్ నాయక్ నామినేషన్ వేశారు.

ఇక మిత్రపక్షం సీపీఐ తరపున నెల్లికంటి సత్యం యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ వేసి దాసోజు శ్రవణ్(Dasoju Sravan) ఇద్దరు బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలే కావటం గమనార్హం. అంటే నామినేషన్లు దాఖలుచేసిన ఐదుగురు నేతల్లో విజయశాంతి, సత్యంయాదవ్, దాసోజు ముగ్గురూ బీసీలే. ఐదు సీట్లకు ఐదుగురే నామినేషన్లు వేయటంతో వీరంతా ఎంఎల్సీలుగా ఎంపికైపోయినట్లే లెక్క. ఈ విషయాన్ని నామినేషన్ల ఉపసంహరణ తేదీ 13 సాయంత్రం ఎన్నికల కమీషన్ ప్రకటిస్తుంది. నిజానికి బీఆర్ఎస్ తరపున అభ్యర్ధిగా ఎస్టీ నేత సత్యవతి నామినేషన్ వేస్తారని బాగా ప్రచారం జరిగింది. అయితే ఇపుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏదన్నా ఉందంటే అది బీసీ వాదమనే చెప్పాలి. ప్రతి రాజకీయపార్టీ బీసీల జపమే చేస్తోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ఈమధ్యనే బయటపెట్టిన కులగణన రిపోర్టులో బీసీల జనాభా సుమారుగా 56 శాతం ఉందన్న విషయం బయటపడింది. అందుకనే చివరి నిముషంలో సత్యవతికి బదులుగా బీసీ నేత దాసోజు అభ్యర్ధి అయిపోయారు.

సమాజంలో బీసీల జనాభా సగంకన్నా ఎక్కువగా ఉందన్న విషయం తేలటంతోనే పార్టీలు ఒక్కసారిగా బీసీల ఛాంపియన్ అనిపించుకోవాలని పోటీలు పడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలప్రచారంలో కామారెడ్డి సమావేశంలో రేవంత్ మాట్లాడుతు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. ఆఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం బాగా హైలైట్ అవుతోంది. తొందరలోనే స్ధానికసంస్ధల ఎన్నికలు జరగబోతున్నాయనే ప్రచారంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే అని బీసీల సంఘాలు, పార్టీలోని బీసీ నేతలు రేవంత్ పైన ఒత్తిడి తేవటం మొదలుపెట్టారు.

ఎప్పుడైతే బీసీల సంఘాలు, కాంగ్రెస్ లోని బీసీ నేతలు బీసీ వాదాన్ని బలంగా వినిపించటం మొదలుపెట్టారో వెంటనే బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా బీసీ నినాదాన్ని అందుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపైనే ప్రతిపక్షాలు రేవంత్ పైన ఒత్తిడి పెంచేస్తున్నాయి. తెలంగాణలో బలపడతున్న బీసీ వాదనను దృష్టిలో పెట్టుకునే ఈమ్యనే జరిగిన టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ కోటా ఎన్నికల్లో బీజేపీ ఒక బీసీకి టికెట్ ఇచ్చింది. రెండు టీచర్స్ కోటా ఎంఎల్సీల్లో మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల టీచర్ ఎంఎల్సీ అభ్యర్ధిగా బీసీ నేత మల్క కొమురయ్యను పోటీచేయించింది. కొమురయ్య గెలవటంలో బీసీ వాదం బాగా ఉపయోగపడిందనే విశ్లేషణలు అందరికీ తెలిసిందే. బీఎస్పీ తరపున పోటీచేసిన ప్రసన్న హరికృష్ణకు 65 వేల ఓట్లు రావటంలో బీసీ వాదం బాగా పనిచేసింది.

ఇలాంటి అనేక ఘటనలను దృష్టిలో పెట్టుకునే ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ అభ్యర్ధుల ఎంపికలో పార్టీలు బీసీలకు పెద్ద పీట వేసినట్లు అర్ధమవుతోంది. రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీల ఓట్లను గంపగుత్తగా వేయించుకునేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ తాము బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రచారంచేసి నమ్మించాలన్న ఆలోచనతోనే తాజా ఎంపికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ బీసీ నేతలనే ఎంపికచేసినట్లు అనుకోవాలి. బీసీ వాదం రాజకీయపార్టీల్లోను, బీసీల సంఘాలు, బీసీల నేతల్లోను బాగా వినబడుతోంది సరే, మరి బీసీ జనాల్లో కూడా అంతేస్ధాయిలో ఉందా ? అన్నదే సస్పెన్సుగా ఉండిపోయింది.

Read More
Next Story