
విమాన పైలెట్ గా పనిచేస్తున్న అందాలభామ
ఆందాల భామలు చేసే ఉద్యోగాలేమిటో తెలుసా?
హైదరాబాద్ లో జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ప్రపంచ సుందరీమణులు ఏం ఉద్యోగాలు చేస్తున్నారంటే..
72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాల సుందరాంగులు అందంలోనే కాదు ఉన్నత విద్య అభ్యసించి వివిధ వృత్తుల్లో రాణిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల నుంచి వస్తున్న అందాల భామలు వారికి ఇష్టమైన వృత్తులు, వ్యాపకాల్లో తలమునకలై ఉన్నారు. వివిధ దేశాల్లో జరిగిన అందాల పోటీల్లో విజయం సాధించి ఆ దేశ సుందరీమణిగా కిరీటాన్ని సొంతం చేసుకున్న అందాల భామలు అందరికీ స్ఫూర్తినిచ్చేలా వైద్యులు, దౌత్యవేత్తలు, డిజైనర్లు, పైలెట్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ సుందరాంగులు అందం, గ్లామరుతో పాటు విద్య, వృత్తుల్లో రాణిస్తున్నారు.
వ్యాపారంలోనూ అందాల భామల ముందంజ
అందాలభామలు ఎలోనా నడ్రేకాజ్ (అల్బేనియా),సోఫియా ఎస్టుపినాన్ (ఎల్ సాల్వడార్), మరియా అమేలియా బాప్టిస్టా (పోర్చుగల్) లు వ్యాపార సంస్థలను నెలకొల్పి,వారు వ్యాపారాలను విజయవంతంగా నడుపుతున్నారు. నమీబియాకు చెందిన సెల్మా కమన్య, ఆర్థికవేత్తగా ఉన్నారు. భారతదేశానికి చెందిన ఫెమీనా మిస్ ఇండియా నందిని గుప్తా హోస్ట్ ప్రతినిధిగా మహిళల సాధికారత కోసం పనిచేస్తున్నారు.ఫిన్లాండ్ దేశానికి చెందిన సోఫియా సింగ్ ఒక పబ్లిక్ రిలేషన్స్ మార్కెటింగ్ నిపుణురాలు.
పైలెట్లుగా విమానయానం
చిలీకి చెందిన ఫ్రాన్సిస్కా లావాండెరో వాణిజ్య పైలట్. ఏవియేషన్ కోర్సు చదివిన సోమాలియాకు చెందిన జైనాబ్ జామా,స్పెయిన్‌కు చెందిన విమాన సహాయకురాలు కొరినా మ్రాజెక్‌లకు ఆకాశం హద్దులు కాదు.
హోటల్ మేనేజర్లుగా సుందరాంగులు...
కిర్గిజ్స్తాన్ కు చెందిన ఐజాన్ చనాచెవా, సెర్బియాకు చెందిన అలెక్సాండ్రా రుటోవిచ్ హోటల్ మేనేజర్లుగా పనిచేస్తూ ఆతిథ్య రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లారు. మిస్ వరల్డ్ టైటిల్ హోల్డర్లు కొందరు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కొలంబియాకు చెందిన కాటాలినా క్వింటెరో అంతర్జాతీయ వ్యాపారం చేస్తున్నారు. అంగోలాకు చెందిన నూరియా అస్సిస్ వ్యాపార, మార్కెటింగ్‌లో డిగ్రీ చేసి పాప్ స్టార్ గాయనిగా బోర్డ్‌రూమ్‌లతో బీట్‌లను మిళితం చేస్తున్నారు.
వివిధ రంగాల్లో సంచలనాలు...
దక్షిణాఫ్రికాకు చెందిన జోలిజ్ జాన్సెన్ వాన్ రెన్స్‌బర్గ్ ఇప్పటికే ప్రొఫెషనల్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్నారు.కేవలం 18 సంవత్సరాల వయస్సులో ఆమె డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్.గ్లోబల్ అఫైర్స్ గ్రాడ్యుయేట్ అయిన థాయిలాండ్‌కు చెందిన ఓపాల్ సుచాటా అంతర్జాతీయ సంబంధాల రంగంలో ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ విశ్లేషకురాలిగా బల్గేరియాకు చెందిన టియోడోరా మిల్టెనోవా ఉన్నారు.
అందాలభామల్లో వైద్యులున్నారు...
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వారిలో పలువురు వైద్యులున్నారు. జాంబియాకు చెందిన ఫెయిత్ బ్వాల్య వైద్యురాలిగా లైసెన్స్ పొందారు.గ్వాడెలోప్‌కు చెందిన నోయెమీ మిల్నే వైద్యురాలు. టర్కీకి చెందిన ఇడిల్ బిల్గెన్ కూడా ఉక్రెయిన్‌లో యుద్ధ బాధితులకు చికిత్స చేశారు. వేల్స్‌కు చెందిన మిల్లీ-మే ఆడమ్స్, బోస్నియాకు చెందిన ఎనా అడ్రోవిక్ వైద్య విద్య అభ్యసిస్తున్నారు. ప్యూర్టో రికోకు చెందిన వలేరియా పెరెజ్ వైద్య సాంకేతికతలో మాస్టర్స్ గ్రాడ్యుయేట్.బెల్జియంకు చెందిన కరెన్ జాన్సెన్, గ్వాటెమాలకు చెందిన జీమీ ఎస్కోబెడో, లెబనాన్‌కు చెందిన నాడా కౌసా, మలేషియాకు చెందిన సరూప్ రోషి ,పోలాండ్‌కు చెందిన మజా క్లాజ్డా మానసికవైద్యులుగా ఉన్నారు.సైకోథెరపీలో మాస్టర్స్ డిగ్రీ పొందిన మాల్టాకు చెందిన మార్టిన్ కుటాజర్ వైద్యసేవలు చేస్తున్నారు. వైద్యులే కాదు ఫ్రాన్స్‌కు చెందిన అగాథే కౌట్, ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన హన్నా జాన్స్, గయానాకు చెందిన జాలికా శామ్యూల్స్ నర్సులుగా రోగుల సంరక్షణ చూస్తున్నారు.
విద్యాబోధనలోనూ అందాలరాశులు
బ్రెజిల్‌కు చెందిన జెస్సికా పెడ్రోసో, అర్జెంటీనాకు చెందిన గ్వాడాలుపే అలోమర్, ఆస్ట్రేలియాకు చెందిన జాస్మిన్ స్ట్రింగర్ గర్వించదగ్గ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. మెక్సికోకు చెందిన మేరీలీ లీల్ విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిబ్రాల్టర్‌కు చెందిన షానియా బ్యాలెస్టర్ స్థానిక సంరక్షణ కేంద్రంలో రోగులకు సేవలు చేస్తున్నారు.
డిజైనర్లుగా రాణిస్తున్న సుందరీమణులు
డిజిటల్ డిజైనర్ సమంతా పూలే (న్యూజిలాండ్), కంటెంట్ సృష్టికర్త, ప్రకటనల నిపుణురాలు ఫిలిప్పీన్స్‌కు చెందిన కృష్ణ గ్రావిడెజ్ వంటి మహిళలున్నారు. కెన్యాకు చెందిన గ్రేస్ రాంటు, వెనిజులాకు చెందిన వలేరియా కన్నవో డిజైనర్లుగా పనిచేస్తున్నారు.దుబాయ్‌లో జరిగిన ఒక ప్రధాన ఉత్సవంలో ప్రదర్శన ఇచ్చి అంతర్జాతీయ పాటల పోటీలో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న లాట్వియాకు చెందిన మరియా ఎలిజబెట్, ఈక్వెడార్‌కు చెందిన సాండ్రా అల్వరాడో, అంగోలాకు చెందిన నూర్ మిస్ వరల్డ్ వేదికపైకి రావడానికి సిద్ధంగా ఉన్నారు.
టీవీ నటీమణులుగా...
అర్మేనియాకు చెందిన అడ్రిన్ అత్షెమియన్, అమెరికాకు చెందిన అథెన్నా క్రాస్బీ వంటి నటీమణులు టీవీ స్క్రీన్‌లలో మెరుస్తుంటారు. ఆర్మేనియా టీవీ ప్రసారం చేస్తున్న అత్యధిక రేటింగ్ పొందిన టెలివిజన్ సిరీస్‌లలో ఒకదానిలో అడ్రిన్ అత్షెమియన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
Next Story