హైదరాబాద్ ర్యాంప్ పై సౌందర్య సమరం ఎందుకు/
x

హైదరాబాద్ ర్యాంప్ పై సౌందర్య 'సమరం' ఎందుకు/

ప్రపంచ సుందరి అందాల పోటీలకు హైదరాబాద్ ముస్తాబవుతున్న వేళ మహిళా సంఘాలు పోరుబాట పట్టాయి.


ప్రపంచ సుందరి అందాల పోటీలకు భాగ్యనగరం- హైదరాబాద్ ముస్తాబవుతున్న వేళ మహిళా సంఘాలు పోరుబాట పట్టాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతులీనుతున్న వేళ.. 120కి పైగా దేశాలు, వందలాది మంది యువతులు, వేలాది మంది మీడియా ప్రతినిధులు, లెక్కకు మిక్కిలి సౌందర్య సాధనాల సంస్థలు, ర్యాంపులు, క్యాంపులు, వంటలు, పిండివంటలు, దుస్తులు, దర్శనాలు లాంటివి తరలివస్తాయని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చెబుతుంటే మహిళల అంగాంగాల్ని ప్రదర్శనకు పెట్టి వ్యాపారం చేస్తారా అని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. రకరకాల దేశదేశాల యువతులు విద్యుద్దీపాల కాంతిరేఖల మధ్య తమ అందాల్ని విరజిమ్మి అలరిస్తారని నిర్వాహకులు చెబుతుంటే 'బికినీ కాంటెస్ట్' అని పిలిచే ఈ ఫెస్టివల్ కి భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు ఏమాత్రం సంబంధం లేదని మహిళా సంఘాలు తెగేసి చెబుతున్నాయి.
విభిన్నమైన కళా వారత్వం ఉన్న తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని తెలంగాణ పర్యాటక శాఖ ప్రకటిస్తే స్త్రీల శరీరాలకు కొలతలు పెట్టి మార్కెట్ అవసరాల కోసం ఉత్పత్తుల్ని అమ్ముకుంటారా అని మరికొన్ని సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పోటీలను వెనక్కి తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తుంటే పోటీలను అడ్డుకుని అభాసుపాలు కావొద్దని పాలకులు హెచ్చరిస్తున్నారు.
మే 7 నుంచి 31 వరకు పోటీలు...
ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక సౌందర్య పోటీ- మిస్ వరల్డ్- 2025 గ్లోబల్ ఈవెంట్‌కి తెలంగాణను ఆతిథ్యం ఇవ్వనుంది. "తెలంగాణ జరూర్ ఆనా" అనే నినాదంతో 72వ ఈ మెగా ఎడిషన్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని తెలంగాణ దక్కించుకుంది. మే 7 నుండి 31 వరకు నాలుగు వారాల పాటు సుసంపన్న వారసత్వం, ఆధునిక వాతావరణంతో కూడిన తెలంగాణలోని వివిధ ప్రదేశాల్లో జరుగనుంది.
హైదరాబాద్‌లో ప్రారంభ వేడుకలు...
ఈ మెగా ఈవెంట్ ప్రారంభ, ముగింపు వేడుకలు, గ్రాండ్ ఫైనల్‌ కూడా హైదరాబాదులో జరుగుతాయి. న్యూ ఢిల్లీ, ముంబైలో 71వ మిస్ వరల్డ్ ఘన విజయాన్ని చవిచూశాయి. సంప్రదాయాన్ని ఆవిష్కరించేందుకు ఈ వేడుకను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ప్రకటించింది. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్, CEO జూలియా మోర్లీ, తెలంగాణ, టూరిజం, సాంస్కృతిక, వారసత్వ, యువజన వ్యవహారాల విభాగం సెక్రటరీ స్మితా సభర్వాల్ కలిసి అధికారికంగా ఈ మేరకు ప్రకటనను జారీ చేశారు. విభిన్నమైన కళా వారత్వం ఉన్న తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని, అంతర్జాతీయ వేడుకలకు హైదారాబాద్ వేదికైనందుకు ఆనందంగా ఉన్నదని మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్‌, సీఈఓ జూలియా మోర్లీ, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ తో కలిసి ప్రకటించారు.
జూలియా మోర్లీ స్పందన...
ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు తెలంగాణ ముందుకు రావడం పట్ల జూలియా మోర్లీ హర్షాన్ని వ్యక్తం చేశారు. “సంపన్న సాంస్కృతిక వారసత్వానికీ, నూతన ఆవిష్కరణలకు, ఆతిథ్యానికి మారుపేరుగా నిలిచే ప్రతిబింబించే తెలంగాణలో 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌ను నిర్వహించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ ఈవెంట్ ను నిర్వహించడం ముదావహం. అద్భుత వారసత్వాన్నీ, చురుకైన అభివృద్ధిని ప్రపంచ వేదికపై చూపించవచ్చు. ఈ భాగస్వామ్యం కేవలం మిస్ వరల్డ్ ఫెస్టివల్‌ను నిర్వహించడం మాత్రమే కాదు. ఇది సమాజాలను సమ్మిళితం చేయడం, వైవిధ్యాన్ని ఆస్వాదించాలన్న ఉద్దేశ్యంతో ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నామని” జూలియా మోర్లీ చెప్పారు.
స్మితా సభర్వాల్ అభిప్రాయం..
తెలంగాణ 72వ మిస్ వరల్డ్ 2025ను నిర్వహించబోతున్నందుకు గర్వంగా ఉంది. ఇక్కడ సౌందర్యం కేవలం కళ్లకు కనిపించేది కాదు. అది భూమి, ప్రజలు, సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలతో అనుసంధానమవుతుంది. తెలంగాణ ప్రతి పండుగను సంతోషంతో జరుపుకుంటుంది. అద్భుత ప్రదర్శనకు ఆలవాలంగా ఉంటుంది. ప్రతి కళాకారుడి కృషినీ, నైపుణ్యాన్నీ ప్రతిబింబిస్తుంది” అని స్మితా అన్నారు.
“ఈ వేదిక ద్వారా తెలంగాణ సాంప్రదాయ హ్యాండ్లూమ్ వారసత్వం, అద్భుత ప్రదేశాలు, రుచికరమైన వంటకాలు, కళారూపాలు, శిల్పాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి పనికి వస్తుంది” అని కూడా ఆమె చెప్పారు.
120 దేశాల ప్రతినిధులు..
మిస్ వరల్డ్ పోటీలో 120కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొనబోతున్నారు. అందరూ ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ కోసం పోటీ పడతారు. మే 7వ తేదీ నాటికి ప్రతినిధులు తెలంగాణకి చేరుకుంటారు. ప్రస్తుత మిస్ వరల్డ్, డెన్మార్క్ కి చెందిన క్రిస్టినా పిజ్కోవా తన కిరీటాన్ని మే 31న ఎంపికయ్యే వ్యక్తికి అందజేస్తారు.
1951లో ప్రారంభం...
ఈ మిస్ వరల్డ్ పోటీలను 1951లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎరిక్ మోర్లీ ప్రారంభించారు. ఆ తర్వాత ఇది అమెరికాకి పాకింది. ఇదో అంతర్జాతీయ ఈవెంట్ గా మారింది. ఓ పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. ఎరిక్ కుటుంబ వారసత్వంగా కొనసాగుతున్నది. దశాబ్దాలుగా ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిరసనల మధ్యనే జరుగుతున్నాయి.
మహిళా సంఘాల వ్యతిరేకత ఎందుకు...
సౌందర్య పోటీలను పలు మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో ఐదారు అంశాలను మహిళా సంఘాలు ప్రస్తావిస్తుంటాయి.
1. బాహ్య రూపానికే ప్రాధాన్యతా?
మనిషి అంతఃసౌందార్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి బదులు కేవలం బాహ్య రూపానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని మహిళా సంఘాలు తప్పుబడుతున్నాయి. శరీర సౌష్టవాన్నిబట్టి ప్రమాణాలు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది స్త్రీల స్వతంత్రను, వ్యక్తిత్వాన్నీ తగ్గించే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది.
2. సామాజిక స్థితిని కుదించడం కాదా?
ఈ సౌందర్య పోటీలలో మహిళలను ప్రధానంగా వారి శరీర ఆకృతినే చూపించడం, ఆమె వ్యక్తిత్వం, మేధస్సు, ఇతర అంతర్గత విలువలను పక్కన పెట్టడాన్ని మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది స్త్రీ స్వాతంత్య్రాన్నీ కించపరడమేనన్న భావన ఉంది. సమాజంలో మహిళ అన్నిరంగాలలో దూసుకుపోతున్నప్పుడు శరీర రంగు, రూపానికే ప్రాధాన్యత ఇవ్వడమేమిటన్నది ప్రశ్న.
3. వ్యాపార ప్రయోజనాల కోసమేనా?
కొందరు ఆందోళన చెందే అంశం ఏమిటంటే, ఈ పోటీలు ఒక వాణిజ్య కార్యక్రమంగా మారిపోయాయి. నిజమైన సౌందర్యం కన్నా వ్యాపార ప్రయోజనాలే ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ విధంగా మహిళల వ్యక్తిగత విలువలను, సామాజిక సాధికారతలకు అవమానపర్చడమే అని మహిళా సంఘాలు వాదిస్తున్నాయి.
4. సాంప్రదాయ పరిమితులేమిటీ?
పోటీలలో కొనసాగుతున్న పాశ్చాత్య, సంప్రదాయ దృక్కోణాలు- స్త్రీల ప్రతిభను, సామర్థ్యాన్ని విస్తృతంగా చూపకుండా ఒకే తరహాలో మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. సౌందర్యం అనేది కేవలం శరీర రూపంలోనే కాదని, అది వ్యక్తిత్వం, సామాజిక, సాంస్కృతిక విలువలతో కూడుకున్నదని పేర్కొంటున్నాయి.
5. స్త్రీల శరీరాలకు కొలతలేంటీ?
స్త్రీల శరీరాలకు కొలతలు పెట్టి అంగాంగ ప్రదర్శనలతో, మార్కెట్ అవసరాల కోసం ఉత్పత్తులని అమ్ముకోవడానికి స్త్రీల శరీరాలను, జీవితాలను తీర్చిదిద్దే ఈ పోటీలను నిర్వహించడం మహిళల ఆత్మగౌరవానికి అవమానకరం అని వాదిస్తున్నాయి
వాస్తవానికి ఈ పోటీలు చాలా ఖరీదైన వ్యవహారం. సామాన్యులు ఎవ్వరూ ఆ దరి చేరలేరు. ఈ పోటీలు మహిళలపై ఒక నిర్దిష్ట, పరిమిత మాడల్‌ను రుద్దుతున్నాయి. వ్యక్తిత్వం, అంతర్గత విలువలను పక్కన పెట్టేలా ఉంటాయని మహిళా సంఘాలు భావిస్తాయి.
బెంగళూరులో ఏమి జరిగిందంటే...
1996లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బెంగుళూరులో తీవ్ర నిరసనల హోరు మధ్య జరిగాయి. అనేక విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నిరసనలు, అరెస్టుల మధ్య ఆ పోటీలు సాగాయి. ఈసారి సుమారు 28 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో ప్రపంచ సుందరి అందాల పోటీలు జరుగుతున్నాయి. తెలంగాణను పర్యాటకంగా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ఈ ప్రయత్నం సాగుతున్నట్టు పాలకులు ప్రకటించారు.
"తెలంగాణ జరూర్ ఆనా" అనే నినాదంతో ఈ పోటీలు జరుగుతున్నాయి. దేశ విదేశీ పర్యాటకులను ఆహ్వానించడానికి, చేనేత గొప్ప వారసత్వం, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, అరుదైన వంటకాలు చాటడానికి ఈ అందాల పోటీలను ఎంచుకున్నట్టు తెలంగాణ టూరిజం శాఖ ప్రకటించింది.
పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య అభ్యంతరం..
ఈ పోటీలను వ్యతిరేకించాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) పిలుపిచ్చింది. తెలంగాణ జరూర్ ఆనా అంటే మహిళల అందచందాలేనా అని ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు సంధ్య ప్రశ్నించారు. "ఈ ఈవెంట్ కి బదులు మరే అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు, ఈవెంట్లు, సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించినా ఈ ప్రయోజనాలు నెరవేరుతాయి. అందుకోసం అభ్యంతరకరమైన, మహిళకు అవమానకరమైన ఈ పోటీలకు హైదరాబాద్ ను వేదికగా మార్చవలసిన అవసరం ఎంత మాత్రం లేదు" అంటున్నారు సంధ్య.
"బికినీ కాంటెస్ట్ అని పిలిచే ఈ ఫెస్టివల్ ఈవెంట్ కి భారత్ లో సంస్కృతీ పరిరక్షకులుగా, హిందూ ధర్మమే తమ లక్ష్యం అని చెప్పుకునే పాలకులు అనుమతి ఇవ్వడం ఓ విషాదం అయితే, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించడం మరో దౌర్భాగ్యం" అన్నారు ఆమె.
ప్రభుత్వం అండ ఉంది కనుక ఎన్ని నిరసనలు వ్యక్తమైనా ఈ పోటీలు ఆగబోవన్నది నిజం. 120కిపైగా దేశాల యువతులు పాల్గొని ర్యాంప్ పై క్యాట్ వాక్ చేయడమనేది నిప్పులాంటి నిజం.
Read More
Next Story