మదర్ డెయిరీ ఎన్నికల్లో ఓడితే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ కు రాజీనామా
x

మదర్ డెయిరీ ఎన్నికల్లో ఓడితే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ కు రాజీనామా

తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ డిమాండ్


అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనమయ్యాయి. శుక్రవారం ఎమ్మెల్యే మందుల సామేల్ విలేకర్లతో మాట్లాడుతూ బీర్ల ఐలయ్య కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలని సామెల్ కండిషన్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు బీర్ల ఐలయ్య కంకణం కట్టుకున్నట్టు ఎమ్మెల్యే మండిపడ్డారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీతో కొందరు కుమ్ముక్కయ్యారని ఆయన ఆరోపించారు. మీ బంధుత్వం కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టకండంటూ బీర్ల ఐలయ్యకు ఈ సందర్భంగా సామెల్ సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడితే మాత్రం పార్టీ శ్రేణులు తగిన విధంగా బుద్ధి చెబుతాయని బీర్ల ఐలయ్యను మందుల సామేల్ హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీర్ల ఐలయ్య రాజకీయ వ్యభిచారం చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే మందుల సామేల్ సూచించారు.

ఈ నెల 27 (శనివారం) మదర్ డెయిరీ ఎన్నికలు జరగనున్న మూడు డైరెక్టర్ల స్థానాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను, ఒక చోట బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునేలా ఇరు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయని ప్రచారం జరుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఇరు పార్టీల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశం అయ్యిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. శనివారం రోజే ఓట్ల లెక్కింపు జరిపి విజేతలను ప్రకటించనున్నారు.

Read More
Next Story