అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్ కొత్త రికార్డు
x
Begumbazar in Old city

అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్ కొత్త రికార్డు

బేగంబజారు, పీల్ ఖానాలో 101 గజాల స్ధలం రు. 10 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం.


రెండు తెలుగురాష్ట్రాల్లో కలిపి అత్యంత ఖరీదైన ప్రాంతాలు ఏవంటే ఎవరైనా చెప్పేది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అని. కొంతకాలంగా కోకాపేట్, మాదాపూర్, కొండాపూర్ పేర్లు కూడా వినబడుతున్నాయి. పై ప్రాంతాల్లో రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ అవసరాలకోసం స్ధలం కొనాలంటే కోట్లాది రూపాయలు చెల్లించాల్సిందే. ఇందులో కూడా ప్రభుత్వం(రిజిస్ట్రేషన్) రేటు ఒక విధంగా మార్కెట్ రేట్ మరో విధంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. గవర్నమెంటు ధరకు మార్కెట్ ధరకు అసలు పోలికే ఉండదు. అయితే తాజాగా పాతబస్తీ ప్రాంతంలో జరిగిన ఒక ట్రాన్సాక్షన్ చూసిన తర్వాత పైన చెప్పుకున్న ప్రాంతాలు కూడా ఎందుకూ పనికిరావని అర్ధమైపోయింది.

ఇంతకీ విషయం ఏమిటంటే లేటెస్టు ట్రాన్సాక్షన్ కారణంగా పాతబస్తీలోని బేగంబజార్ ఏరియా ముందు రియల్ ఎస్టేట్ ధరల విషయంలో పైన చెప్పుకున్న ప్రాంతాలు కూడా దిగదిడుపే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే బేగంబజారు, పీల్ ఖానాలో 101 గజాల స్ధలం రు. 10 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఆమధ్యలో కోకాపేట్ లో ప్రభుత్వం నిర్వహించిన వేలంపాటల్లో ఎకరం భూమి రు. 100 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే అదంతా రియల్ ఎస్టేట్ మాఫియా చేసిన నిర్వాకమని బయటపడింది. సరే అది ఏదైనా వేలంపాటలో అమ్ముడుపోయిన ధరైతే ఎకరం 100 కోట్ల రూపాయలని ఫిక్సయిపోయింది. దాని ఆధారంగానే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మకాలు, కొనుగోళ్ళు జరిగాయి.

అయితే తాజాగా బేగంబజార్ పీల్ ఖానాలో జరిగిన అమ్మకం కోకాపేట వేలంపాటను తలదన్నేసింది. 101 గజాల స్ధలమే రు. 10 కోట్లకు అమ్ముడుపోయిందంటే ఇక ఎకరం ధర ఎంతుంటుందో ఎవరికి వారుగా లెక్క కట్టుకోవాల్సిందే.

అసలు బేగంబజారుకు ఇంత డిమాండ్ ఎందుకొచ్చింది ? ఎందుకంటే బేగంబజార్ అంటేనే దాదాపు కమర్షియల్ ఏరియాగా పాపులర్. ఉన్న ఏరియానేమో చాలా తక్కువ. కాని అందులో డిమాండేమో చాలా ఎక్కువ. ఎందుకంటే రెండు తెలుగురాష్ట్రాల్లోని వ్యాపారులకు సరుకులను అందించే హోల్ సేల్ దుకాణాలు వేలల్లో ఉంటాయిక్కడ. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన హోల్ సేల్ వ్యాపారస్తులు దశాబ్దాల క్రితమే వచ్చి హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. తమ రాష్ట్రాల నుండి సరుకులను పెద్దఎత్తున తెప్పించి ఉమ్మడి తెలుగు రాష్ట్రంతో పాటు కర్నాటక, తమిళనాడు, కేరళకు ప్రతిరోజు టన్నుల కొద్దీ సరుకులను పంపుతుంటారు. అంటే ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు హైదరాబాద్ హబ్ లాగ తయారైంది. బేగంబజార్లో తక్కువలో తక్కువ రకరకాల వస్తువులు, సరుకులు అమ్మే హోల్ సేల్ దుకాణాలు 6 వేలున్నాయని సమాచారం.

బేగంబజార్లో గాజుల దగ్గర నుండి డ్రై ఫ్రూట్స్ వరకు దొరకని వస్తువు, సరుకంటు లేదు. ఇంతటి కీలకమైన బేగంబజార్లో గజం స్ధలం దొరకాలంటే కూడా గగనమనే చెప్పాలి. స్ధలం లేదుకాబట్టి ఉన్నదాంట్లోనే వ్యాపారస్తులు సర్దుకుంటున్నారు. బాగా పాతపడిపోయి పనికిరాదని అనుకున్న ఇంటిని లేదా బిల్డింగును పూర్తిగా కొట్టేసి మళ్ళీ కొత్తగా కట్టుకోవాల్సిందే కాని ఎక్కడైనా స్ధలం కొనుక్కుని కట్టుకుందామంటే సాధ్యంకాదు. అందుకనే ఇక్కడ గజం స్ధలానికి కూడా బంగారానికి మించిన డిమాండ్ పెరిగిపోయింది. గట్టిగా చెప్పాలంటే ఇక్కడ గజం స్ధలంముందు బంగారం కూడా ఎందుకూ పనికిరాదు.

డిమాండ్ తెలుసుకాబట్టి ఎవరైనా ఏ కారణంతో అయినా ఇంటిని అమ్మేస్తున్నారంటే కొనేందుకు పదులసంఖ్యలో వ్యాపారస్తులు పోటీలుపడతారు. ఎప్పుడైతే వ్యాపారస్తులు పోటీపడుతున్నారో సహజంగానే డిమాండ్ పెరిగిపోతుంది. సప్లై తక్కువగా ఉండటంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. అందుకనే ఈమధ్యనే జరిగిన ట్రాన్సాక్షన్లో 101 గజాల స్ధలం రు. 10 కోట్లకు అమ్ముడుపోయింది. ఎక్కడైనా స్ధలం అమ్మకానికి వస్తోందంటే ముందుగా గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ వ్యాపరస్తులు అక్కడ వాలిపోతున్నారు.

ఇపుడు బేగంబజార్లో రెసిడెన్షియల్ స్ధలం గజం ప్రభుత్వం రేటు రు. 26,500గా ఉంది. కమర్షియల్ అయితే గజం స్ధలం రు. 71,500గా ఉంది. అయితే మార్కెట్ ఇంతకు పదిరెట్లు ఉందన్న విషయం అందరికీ తెలుసు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత బేగంబజార్లో గజం భూమి 1-2 లక్షల రూపాయలుండేది. వివిధ అవసరాల రీత్యా ఈ ప్రాంతంలో ధరలు పెరిగిపోయాయి. ఈమధ్యనే ఇదే ఏరియాలో 68 గజాల బుల్లిస్ధలం అమ్ముడుపోయిందట. ఎంతకంటే రు. 6.80 కోట్లకు. అంటే గజంధర రు. 6.80 లక్షలకు అమ్ముడుపోయినట్లు లెక్క. అత్యంత ప్రముఖ ప్రాంతాలుగా చెలామణిలో ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , కోకాపేటలో చదరపు అడుగు రు. 20 వేలుంటే బేగంబజార్లో మాత్రం రు. 70 వేలు పలుకుతోంది. మొత్తంమీద తాజా లావాదేవీల కారణంగా బేగంబజారులో రియల్ ఎస్టేట్ ధరల వ్యవహారం హాట్ టాపిక్ అయిపోయింది.

Read More
Next Story