భద్రాచలం (Bhadrachalam) పుణ్యకేత్రానికి దక్షిణ అయోధ్య అని పేరుంది. గోదావరి నది ఒడ్డనే ఉన్న ఇక్కడి శ్రీ సీతా రామా ఆలయం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దక్షిణ భారతం, ఉత్తర భారతం నుంచి కూడా భక్తులు దైవ దర్శనం కోసం లక్షలాదిగా తరలి వస్తారు. భద్రాచలం శ్రీరామచంద్రుడు వనవాసంలో సంచరించిన దండకారణ్యంలో భాగం. ఆయన సీతాసమేతంగా ఈ ప్రాంతం సందర్శించాడని ప్రజల విశ్వాసం.
17వ శతాబ్దంలో 1674 లో భద్రాచల రామదాసు( కంచెర్ల గోపన్న)శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని గోల్కొండ సుల్తాన్ పాలన ఉన్నప్పుడు, వారి ఆదేశాలను ధిక్కరించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి చేరుకోవాలంటే నదిని పడవలద్వారా దాటి రావాలి. 1965 జూలై లో బిడ్జి ప్రారంభమయ్యే వరకూ వేలాది మంది భక్తులు పడవ ప్రయాణం చేస్తూ లోతైన ఉధృత గోదావరి నది దాటి వచ్చే వారు. ఇలా శతాబ్దాలు పడవప్రయాణం ద్వారానే ఇతర రాష్ట్రాల భక్తులు భద్రాద్రి సీతారామాయాలనికి వచ్చే వారు. అయితే, ఒక 60 యేళ్ల కిందట జరిగిన విషాద సంఘటన తర్వాత పడవ ప్రయాణానికి రద్దు చేసేందుకు ఒక వంతెన నిర్మాణం చేపట్టవలసి వచ్చింది. గత నెలలోనే 1964లో ప్రారంభమయిన ఈ బ్రిడ్జి ఆరు వసంతాలను పూర్తి చేసుకుంది.ఎంతో పటిష్టంగా నిర్మితమైన ఈ వారధి రావడానికి , దీనిని అప్పటి పాలకులు ఆఘమేఘాల మీద నిర్మించడానికి పెద్ద కారణమే ఉంది నాడు జరిగిన భారీ పడవ ప్రమాదమే.
40 ప్రధాన వరదలను తట్టుకుని నిలచిన బ్రిడ్జి
ఇటీవల కొత్త వంతెన నిర్మించే వరకు, గోదావరి నదిని దాటడానికి ఈ అరవై ఏళ్ల బ్రిడ్జే ఏకైక మార్గం. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జూలై 13, 1965న ప్రారంభించిన ఈ వంతెన 80 అడుగుల పొడవు ఉంది .1959 డిసెంబర్ 16న మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి ఈ వంతెన నిర్మాణానికి పునాది రాయి వేశారు.

ఎలాంటి నష్టం లేకుండా ఇంతవరకు ఈ వంతెన 40 ప్రధాన వరదలను తట్టుకుంది.
ఐదు రాష్ట్రాల మధ్య అనుబంధం ఈ ఐకానిక్ వంతెన నిర్మాణంతో నాడు మూడు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డయి. ఆంధ్రప్రదేశ్, నేటి ఛత్తీస్ ఘడ్, ఒదిశా రాష్ట్రాల ప్రజల మధ్య రాకపోకలు, వరక్త వాణిజ్యాలు, టూరిజం బాగా పెరిగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ వంతెన ఐదు రాష్ట్రల మధ్య అనుబంధం పెంచింది. ముఖ్యంగా ఏజన్సీ ప్రాంతాలకు ఇదొక వరప్రసాదం అయింది.
ఈ వంతెన కారణంగా లక్షలాది మంది యాత్రికులు భద్రాచల రాముని దర్శనానికి రావడానికి అనుకూలమే కాదు, మూడు రాష్ట్రాలకు తెలంగాణ నుంచి వెళ్లడానికి కీలకంగా మారింది. అంతేకాదు, ఈ వంతెన సమ్మక్క సారక్క ( Sammakka-Sarakka Mela) గిరిజన జాతర కూడా ఇతర రాష్ట్రాల ప్రజలకు చేరువ అయింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం (Medaram) గ్రామంలో సమ్మక్క, సారక్క జాతరకు తెలంగాణ మహాకుంభ మేలా గా పేరుంది. ఈ జాతర ఏసియాలోనే అతిపెద్ద గిరిజన సమావేశం. ఈ జాతరకు మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీష్ గడ్, ఒదిశా రాష్ట్రాలనుంచి గిరిజను లక్షల సంఖ్యలో వస్తారు. కనీసం కోటి మంది గిరిజనులు ఈ జాతరకు తరలి వస్తారు. మధ్యప్రదేశ్, ఛత్తీష్ గడ్, ఒదిశా రాష్ట్రాల గిరిజనుల ప్రజలు తెలంగాణ కు వచ్చేందుకు ఇదొక్కటే మార్గం. 1964లో ఈ వంతెన నిర్మాణం తర్వాత జాతరకు గిరిజనులు రావడం ఎక్కువయింది.

" భద్రాచలం అభివృద్దికి ఈ వంతెన నిర్మాణం ఎంతో దోహద పడింది.దీనికి ఎంతో ప్రాధాన్యత వుంది.1957 లో జరిగిన భారీ పడవ ప్రమాదం తరువాత ప్రభుత్వం దీనిని చేపట్టింది.అప్పుట్లో పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ ఈ బ్రిడ్జిని నిర్మించింది , 60 ఏళ్ల కాలంలో ఎలాంటి మరమ్మత్తులు లేకుండా పటిష్టంగా వుంది.ఈ బ్రిడ్జి రాకతో భద్రాచలానికే కాదు, ఇతర క్షేత్రాలకు , ముఖ్యంగా సమ్కక్క సారక్క జాతరకు వచ్చే యాత్రికుల సంఖ్యఎన్నో రెట్లు పెరిగింది. రామాలయం పేరును గర్వంగా అందరూ చెప్పుకునేలా చేసిందీ ఈ బ్రిడ్జి నిర్మాణమే" అంటూ భద్రాచలానికి చెందిన స్థానికుడు సీనియర్ సిటిజన్ బాదం జగదీష్ బ్రిడ్జి అరవై ఏళ్ల ప్రస్థానాన్ని 'ఫెడరల్ తెలంగాణ' తో పంచుకున్నారు.
" ఎంతో ప్రాధాన్యత వున్న భద్రాచలం పాత బ్రిడ్జిని గొప్ప నమూనాగా పరిగణించాలి,అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా నైనా దీని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి.ఇప్పుడు బ్రిడ్జి అక్కడక్కడా బలహీనపడుతున్నట్లుంది. ప్రభుత్వం సరిగా పట్టించు కోవడం లేదు. బ్రిడ్జికి మెరుగులు దిద్దాల్సిన అవసరం వుంది" అంటూ భద్రాచలానికే చెందిన అవధానుల శ్రీనివాస శాస్త్రి నిర్మాణ గొప్పదనాన్ని 'ఫెడరల్ తెలంగాణ'కు తెలిపారు.

అసలు ఆనాటి పడవ ప్రమాదం ఏంటి? 1957లో భద్రాచలం వద్ద గోదావరిలో జరిగిన పడవ ప్రమాదం, "భద్రాచలం బోట్ ట్రాజెడీ"గా పిలువబడింది.భద్రాచలం రామాలయాన్ని సందర్శించాలంటే ఆనాడు పడవలలోనే గోదారి దాటాల్సి వచ్చేది. ఆ క్రమంలో శ్రీ రామనవమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆరోజు భద్రాచలం చేరుకున్నారు. మరుసటి రోజు తిరిగి వెళ్లే సమయంలో రెండు పడవలను జత చేసి వందలాది మందిని ఒకేసారి ఎక్కించుకొని ఆవలి ఒడ్డున వున్న గొమ్మూరుకు తీసుకెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంపై ప్రభుత్వం వేసిన కమిటీ మాత్రం మరణించిన వారి సంఖ్య 150 గా వుందని పేర్కొంది.అయితే భద్రాచలం స్థానికులు మాత్రం 300 లకు పైగా భక్తులు ఈ పడవ ప్రమాదంలో మరణించారని చెబుతున్నారు.ఇంత పెద్ద సంఖ్యలో యాత్రికులు మరణించడం అప్పట్లో దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.1957 ఏప్రిల్ 10 న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఆ సంవత్సరం ఏప్రిల్ 9 న శ్రీరాముని కళ్యాణోత్సవం జరగగా ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువగా 50 వేల మంది వరకూ భారీ సంఖ్యలో భక్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

పడవ ప్రమాదంపై విచారణ కమిటీ రిపోర్ట్ ఏమి తేల్చింది?
వందల సంఖ్యలో భక్తులు మరణించిన 1957 ఏప్రిల్ 10 నాటి గోదావరి పడవ ప్రమాదంపై అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు.అసెంబ్లీలో ప్రకటనచేశారు. ఆ కమిటీలో ఎమ్మెల్యే బలరామ కృష్ణంరాజు, ఎంపీ సర్వోత్తమ రెడ్డి ,ఐఎఎస్ అధికారి నాటి రెవెన్యూ బోర్డ్ మెంబర్ గులాం హైదర్ ,భద్రాచలం ప్రాంత ఐజీ కున్విరాం నంబియార్ ,ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ వెంకట కృష్ణ అయ్యర్ సభ్యులుగా వున్నారు . ఆ కమిటీ సభ్యులు పలు మార్లు భద్రాచలం వచ్చి 77 మంది సాక్షులను , స్థానిక అధికారులను విచారించి పడవ ప్రమాదంపై రిపోర్ట్ తయారు చేశారు. ఆక్రమంలోనే భద్రాచలం లో రామాలయంవున్న పరిస్థితులు,అక్కడికి పోవడానికి వున్న ఏకైక మార్గం గోదావరి దాటటంలో ఇబ్బందులను వివరించారు. గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం జరిగితేనే సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని తేల్చి చెప్పారు.ప్రమాదం జరిగిన తీరునూ వివరించారు. ఆనాటి సాక్షుల కథనం మేరకు కమిటీ సభ్యులు ఆ సంవత్సరం భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం ఆ సమయంలో పెరగడాన్ని ఒక కారణంగా పేర్కొన్నారు.ప్రతియేటా ఏప్రిల్ మాసంలో గోదావరిలో నీటి ప్రవాహం భద్రాచలం ప్రాంతంలో అతి తక్కువగా వుంటుంది. శ్రీరామ నవమికి భద్రాచలం వచ్చే భక్తులు గోదావరి ఆవలి ఒడ్డు బూర్గంపహాడ్ గుమ్ముగుడెం నుంచి కాలినడకనే నది దాటేఅవకాశం వుంటుంది. అయితే మహిళలు , పిల్లలు మాత్రం పడవలలో భద్రాచలం ఒడ్డుకు చేరేవారు.ఎప్పుడు ఆ సమయంలో నాలుగు అడుగుల లోతు మాత్రమే వుండే నీటి ప్రవాహం 6 అడుగులకు చేరడం తో ఆ రోజు అందరూ పడవలలోనే నదిని దాటాల్సి వచ్చింది.
"ఫెర్రీ కాంట్రాక్టర్లు డబ్బు అత్యాశతో కనీస భద్రతా చర్యలు పాటించకుండా రెండు పడవలను జతచేసి వంద లోపు సంఖ్యకే అనువైన ఆ పడవలలో ఏకంగా 300 మంది వరకూ ఎక్కించడం,ప్రయాణీకుల నుంచి టిక్కెట్టు వసూలు చేయడానికి నది మధ్యలో ఆపడం ,ఆ సమయంలో పెద్ద పడవలోనికి నీరు చేరుతుండటంతో ప్రయాణీకులు కంగారుగా మరో పడవలోనికి దూకడానికి ప్రయత్నించడం ఈ ప్రమాదానికి కారణమైంది" ఈ విషయాన్ని కమిటీ తన రిపోర్టులో స్పష్టం చేసింది." రెండు పడవలూ ఒకదానితో ఒకటి కట్టి జత చేసి వుండటం వల్ల ప్రమాద సమయంలో చిన్న పడవ పెద్ద పడవపై మూతలా పడిపోవడంతో ప్రయాణీకులంతా పడవల లోనే చిక్కుకొని మృతిచెందారు" విచారణ కమిటీ ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని ఉటంకిస్తూ తన రిపోర్టులో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.వరద పెరగడానికి పైన వున్న దుమ్ముగుడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తారా ,దీని వెనుక కుట్ర కోణం వుందా అన్న అంశాన్ని కూడ కమిటీ విచారించింది.

గోదావరిపై బ్రిడ్జి అవసరాన్ని చాటిన ప్రమాదం
1957 ఏప్రిల్ లో జరిగిన ఈ భారీ పడవ ప్రమాదం ఆ తరువాత కమిటీ సిఫారసులతో రెండు సంవత్సరాల తరువాత 1959 డిసెంబర్ లో భద్రాచలం పాత బ్రిడ్జికి పునాది రాయి పడితే ఆ తరువాత ఐదేళ్లకు 1965 జూలైలో భద్రాచలం గోదావరిపై బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగింది.ఇప్పటికి అరవై ఏళ్లు అయినా బ్రిడ్జి చెక్క చెదరకుండా పటిష్టంగావుండటం పట్ల స్థానికులు అప్పటి ఇంజనీరింగ్ గొప్పదన్నాన్ని ఇప్పటికీ పొగుడుతున్నారు.ఇప్పటి దాకా భద్రాచలం ఏజెన్సీ ప్రాంత వాసులతో పాటు మూడు రాష్ట్రాలకు వెళ్లే వారికీ ప్రధాన మార్గంగా ఈ పాత బ్రిడ్జి సేవలు అందిస్తూనే వుంది. ఈ వంతెన ప్రాంతీయ కనెక్టివిటీని మార్చివేసింది.
60 ఏండ్ల కాలంలో లక్షల సంఖ్యలో వాహనాలను ,కోట్ల సంఖ్యలో ప్రయాణీకులను దరి చేరుస్తున్నఈ బ్రిడ్జికి అదనంగా ఇప్పుడు మరో బ్రిడ్జి పక్కనే అందుబాటులోకి వచ్చింది. భద్రాచలం పుణ్య క్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తుల రాకపోకలకు ప్రస్తుతం ఈ రెండు బ్రిడ్డిలు సేవలందిస్తున్నాయి."ఇప్పుడు కొత్త బ్రిడ్డి వచ్చినా పాత వంతెన గొప్పదనం మరువలేనిది.దానితో పాటు బ్రిడ్జి నిర్మాణ అవసరాన్ని గుర్తు చేసిన పడవ ప్రమాదాన్నీ ఇన్ని సంవత్సరాలైనా గుర్తు చేసుకుంటూనే వుంటాం " అంటూ భద్రాచలం ప్రాంతానికే చెందిన స్థానిక వయోవృద్ధుడు నరసింహారావు 'ఫెడరల్ తెలంగాణ' కు తెలిపారు.

నాడు నేడు భద్రాద్రి రెండు రాష్టాల వివాదం లోనే..
రామాలయాన్ని ఆనాడు కంచెర్ల గోపన్న నిజాం పాలకులను ఎదిరించి భద్రాచలం ల నిర్మించిన దగ్గరి నుంచి ఆ పట్టణం ప్రాధాన్యం పెరిగిందే కాని ,పట్టణం అభివృద్ది , అంతకంతకూ పెరగాల్సిన రామాలయ అభివృద్దీ వందల సంవత్సరాలలోనామమాత్రంగానే వుంది. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రానికి , ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దుగా వుండి అటు ఇటు కలుస్తూ సమస్యలతో సతమతమైన భద్రాచలం, ఇప్పుడు కూడ అభివృద్దికి ఆమడ దూరంలోనే వుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక భద్రాచలం పట్టణం తెలంగాణలోనే వున్నా , భద్రాచలం శివారు ప్రాంతమంతా ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లడంతో పట్టణం అభివృద్దికి అవకాశం లేకుండా పోయిందని అక్కడి స్థానికులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ తో వున్న సరిహద్దు సమస్యతో భద్రాచలం పై దృష్టి సారించడం లేదు. అరవై సంవత్సరాల క్రితం భద్రాచలం వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మించాలన్నఆలోచన వచ్చినప్పుడు రామపాదసాగరం ప్రాజెక్టు(ఇప్పటి పోలవరం ) వస్తే పరిస్థితి ఏంటని ఆలోచించాల్సి వచ్చింది. ఇప్పుడు పోలవరం పూర్తయితే భద్రాచలం పరిస్థితి ఏంటన్న భయమూ లేకపోలేదు.