భగవద్గీత పై ప్రమాణం చేసి చెబుతున్నా, వాటన్నింటిని కూల్చేస్తా!
x
Revanth

భగవద్గీత పై ప్రమాణం చేసి చెబుతున్నా, వాటన్నింటిని కూల్చేస్తా!

రాజకీయాల్లోనే కాదు అక్రమనిర్మాణాల కూల్చివేతల్లో రేవంత్ రెడ్డి భగవద్గతను స్పూర్తిగా తీసుకున్నారు.


రాజకీయాల్లోనే కాదు అక్రమనిర్మాణాల కూల్చివేతల్లో రేవంత్ రెడ్డి భగవద్గతను స్పూర్తిగా తీసుకున్నారు. కోకాపేటలో జరిగిన అనంతశేష స్ధాపన కార్యక్రమంలో మాట్లాడుతు భగవద్గీత స్పూర్తితో తాను ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. వంద ఏళ్ళ క్రితమే నిజామ్ నవాబు నగరంలో మంచినీటికి సమస్యలేకుండా, డ్రైనేజి వ్యవస్ధకు అద్భుతమైన వ్యవస్ధను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. అయితే ఆ వ్యవస్ధలను రాజకీయనేతలు చెడగొట్టినట్లు మండిపడ్డారు. చెరువులు, నాలాలు, కుంటలను ఆక్రమించేసి పెద్ద పెద్ద నిర్మాణాలతో పాటు ఫాంహౌసులను కూడా కట్టేసుకున్నారని మండిపోయారు. ధనవంతులు నిర్మించుకున్న ఫాంహౌసుల్లోని డ్రైనేజీని మొత్తాన్ని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తో పాటు చెరువుల్లోకి వదిలేస్తున్నారని గుర్తుచేశారు.

భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా తన కర్తవ్యాన్ని తాను నెరవేరుస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. చెరువులను కాపాడుకోవటంలో భాగంగా కఠినంగా వ్యవహరించక తప్పదని తనకు తెలుసన్నారు. కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మంవైపు నిలబడినట్లుగానే తాను చెరువులు, కుంటలను ఆక్రమణల చెరలో నుండి బయటపడేయాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. తన ప్రయత్నంలో తనకు ఒత్తిళ్ళు ఎదురవుతాయన్న విషయం బాగా తెలుసన్నారు. అయినా సరే మిత్రులని, కావాల్సిన వాళ్ళని, ప్రతిపక్షాల నేతలవనో ఎవరి నిర్మాణాలనూ పట్టించుకోకుండా కూల్చేయటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.

ముందటి తరాలకు మంచిజరగాలన్న ఏకైక ధ్యేయంతోనే ఇపుడు చెరువులు, కుంటల ఆక్రమణలను, కబ్జాలను, అక్రమనిర్మాణాలను కూల్చేస్తున్నామన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చేసి చెరువలు, కుంటలను కాపాడలేకపోతే ప్రజాప్రతినిధిగా తాను ఫెయిలైనట్లే అని రేవంత్ అన్నారు. తన ప్రయత్నాన్ని తప్పుపట్టడం కాకుండా భవిష్యత్తును ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఆక్రమణలను క్లియర్ చేయటం కోసం ఏర్పాటుచేసిందే హైడ్రా అన్నారు. ఆక్రమణలను తొలగించటంలో, కబ్జాలను క్లియర్ చేయటంలో చెరువులు, కాల్వలతో పాటు ప్రభుత్వ స్ధలాలను కాపాడటంలో హైడ్రాకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు రేవంత్ చెప్పారు. తనపై ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఆక్రమణల తొలగింపులో తాను వెనకడుగు వేసేదిలేదని రేవంత్ తెగేసిచెప్పారు.

రేవంత్ ఇలా చెప్పారో లేదో వెంటనే బీఆర్ఎస్ నుండి ఎదురుదాడి మొదలైపోయింది. నిజంగానే రేవంత్ లో చిత్తుశుద్ది ఉంటే ముందుగా మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ప్రముఖల ఫాంహౌసులను కూల్చేయాలని చాలెంజ్ విసిరారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్తు భవన్ తరపున గండిపేటలో అక్రమంగా నిర్మించిన ఎన్టీఆర్ కాలేజీ, హాస్టల్ ను రేవంత్ కూల్చేయాలంటు పదేపదే రెచ్చగొడుతున్నారు. మరి బీఆర్ఎస్ చాలెంజులకు రేవంత్ ఏ విధంగా సమాధానం చెబుతారన్నది ఆసక్తిగా మారింది.

Read More
Next Story