రాష్ట్ర వృద్ధి రేటు గురించి భట్టి ఏమన్నారంటే..
x

రాష్ట్ర వృద్ధి రేటు గురించి భట్టి ఏమన్నారంటే..

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోందని భట్టి చెప్పుకొచ్చారు.


ఆర్థిక సంవత్సరం 2025-2026 బడ్జెట్‌ను తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక విషయాలు పంచుకున్నారు. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల ప్రకారం, పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయలు (16,12,579 కోట్లు). గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధిరేటు 10.1 శాతంగా నమోదు అయ్యింది. ఇదే సమయంలో, దేశ GDP మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల మూడు వేల రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు (3,31,03,215 కోట్లు) కాగా, వృద్ధిరేటు 9.9 శాతంగా ఉంది’’ అని తెలిపారు.

తలసరి ఆదాయం:

2024-25 ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాబై ఒక రూపాయలు (రూ.3,79,751) కాగా, వృద్ధి రేటు 9.6 శాతం. దేశ తలసరి ఆదాయం రెండు లక్షల ఐదువేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు (రూ.2,05,579) కాగా వృద్ధి రేటు 8.8 శాతం. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,74,172 అంటే వృద్ధి రేటు 1.8రెట్లుగా ఉందని భట్టి వివిరించారు.

వివిధ రంగాలలో వృద్ధి రేటు:

  • 2024-25లో తెలంగాణ జోడింపబడిన స్థూల విలువలో (GSVA) సేవా రంగం 66.3 శాతం, పారిశ్రామిక రంగం 16.4 శాతం, మరియు వ్యవసాయ, అనుబంధ రంగాలు 17.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
  • వ్యవసాయ, అనుబంధ రంగాలు GSDP లో తక్కువ వాటా కలిగి ఉన్నప్పటికీ, రాష్ట్ర మొత్తం శ్రామిక రంగంలో 42.7 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఉచిత కరెంట్, రైతు భరోసా, పంట రుణ మాఫీ, నీటి పారుదల ప్రాజెక్టులపై పెట్టుబడులు వంటి ప్రభుత్వ పథకాలు రైతాంగానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. అదే సమయంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టవంతం చేసేందుకుగాను, పండ్ల తోటలు, పశు సంరక్షణ, చేపల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాం.
  • రాష్ట్ర పరిశ్రమలు 22.5 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. "చైనా +1" వ్యూహాన్ని అవలంభించడం ద్వారా తెలంగాణను ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగాలలో గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
  • పరిశ్రమల కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళ అభివృద్ధి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి, ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి తోడ్పడతాయి. తద్వారా, ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా, వేగంగా అభివృద్ధి చెందుతుంది.
  • రాష్ట్రంలో సేవా రంగం అత్యధిక క్రొత్త ఉపాధి కల్పించే దిశగా కొనసాగుతోంది. ఇది మొత్తం శ్రామిక రంగంలో 34.8 శాతం వాటాను కలిగి ఉంది. హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో అగ్రగామిగా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ సేవలు, ఫిన్స్టిక్, లాజిస్టిక్స్, పర్యాటకం వంటి రంగాలలో ఉపాధి వృద్ధికి ప్రధానంగా దోహదపడుతోంది.
  • తెలంగాణ లో శ్రామికశక్తి 68.7 శాతం ఉండగా, దేశీయ సగటు 64.3 శాతం మాత్రమే ఉంది. దీనిలో, మహిళల ఉపాధి శాతం 52.7 శాతం ఉండగా, ఇది దేశ సగటు 45.2 శాతం కంటే అధికం. మహిళలు మరియు వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎంతగా విజయవంతమయ్యిందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
Read More
Next Story