తెలంగాణ అసెంబ్లీలో రేపు భట్టి బడ్జెట్ పద్దు
x
ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క (ఫైల్ ఫోటో)

తెలంగాణ అసెంబ్లీలో రేపు భట్టి బడ్జెట్ పద్దు

తెలంగాణ అసెంబ్లీలో గురువారం రాష్ట్రఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ పద్దును ప్రవేశపెట్టనున్నారు.కాంగ్రెస్ హామీల అమలుకు నిధులివ్వనున్నారు.


తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో గురువారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క 2024-25 ఆర్థికసంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ కౌన్సిల్ సమావేశాల్లో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం 9 గంటలకు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలుపనున్నారు.


రాష్ట్ర బడ్జెట్ పై 27న చర్చ
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై ఈ నెల 27వతేదీన చర్చ జరగనుంది. ఈ నెల 26వతేదీన అసెంబ్లీకి సెలవు కావడంతో 27 వతేదీ నుంచి బడ్జెట్ పై చర్చించాలని నిర్ణయించారు. కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా కేంద్రం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని, దీనిపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపారు.

ఈ నెల 29,30 తేదీల్లో అసెంబ్లీలో కీలక బిల్లులు
తెలంగాణ అసెంబ్లీలో ఈ నెల 29,30 వతేదీల్లో కీలకమైన పలు బిల్లులను ప్రవేశపెట్టాలని బీఏసీ నిర్ణయించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం పొందిన తర్వాత ఈ నెల 31వతేదీన ద్రవ్య వినిమయ బిల్లును సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెలవుల నేపథ్యలో అసెంబ్లీ సమావేశాలను ఆగస్టు 1,2 వతేదీల్లో కూడా నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు.

ఈ సమావేశాల్లోనే కీలక బిల్లులు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేర జాబ్ క్యాలెండరును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది.ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంపై, నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపనతోపాటు పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే విద్యాకమిషన్, రెవెన్యూ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని ప్రకటించనున్నారు.

హాట్ హాటుగా బడ్జెట్ సమావేశాలు
మొట్టమొదటిసారి తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో ఈ సమావేశాలు హాట్ హాటుగా జరుగుతాయని భావిస్తున్నారు. గత ఆరు నెలల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన నేపథ్యంలో దీన్ని అసెంబ్లీలో లేవనెత్తాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది.నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు,రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లో జమ చేయడంలో జాప్యం,ప్రజారోగ్యం దెబ్బతినడం వంటి వాటిపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ యోచిస్తోంది.గత డిసెంబర్‌లో అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.


Read More
Next Story