రెండు లక్షల రుణమాఫీపై రైతులకు భట్టి గుడ్ న్యూస్
x

రెండు లక్షల రుణమాఫీపై రైతులకు భట్టి గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో మూడవ విడత రుణమాఫీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.


తెలంగాణ రాష్ట్రంలో మూడవ విడత రుణమాఫీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా వైరా లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వైరాలో మూడో విడత రూ . 2 లక్షల రుణమాఫీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పంద్రాగస్టున వైరాలో జరిగే బహిరంగ సభకి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఈ సభా ప్రాంగణంలోనే మూడవ విడత రుణమాఫీ నిధులను విడుదల చేస్తారని చెప్పారు.

‘ఇప్పటివరకు రెండు విడతలుగా రూ.12,289 కోట్లు రుణమాఫీ చేశాం. రూ.లక్షన్నర వరకు రుణం ఉన్న వారికి నేరుగా అకౌంట్లలో డబ్బులు వేశాం. రెండు విడతల్లో కలిపి 16 లక్షల 29వేల కుటుంబాలకు రుణమాఫీ జరిగింది. రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తాం" అని భట్టి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఇందిరమ్మ రాజ్యంలో నిబద్దతతో పని చేస్తున్నామని భట్టి పేర్కొన్నారు. రైతుల రుణాలు మాఫీ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్న ఆయన... ఆగస్టు 15 న రైతులను రుణవిముక్తుల్ని చేస్తామన్నారు.

జన్మభూమి రుణం తీర్చుకుంటా..

తన సొంత ప్రాంతమైన వైరా మండల అభివృద్ధికి కృషిచేసి జన్మభూమి రుణం తీర్చుకుంటానని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైరాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. భట్టి వైరా పర్యటనలో భాగంగా వైరాతోపాటు తన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో సుమారు రూ.81.52 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, వైరాలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైరా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అమృత్ 2.0 పథకం కింద రూ.26.87 కోటు మంజూరయ్యాయి. ఈ పనులు చేపట్టేందుకు ముందుగా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం వైరాలోని టీజీఆర్ఎస్ పాఠశాల సమీపంలో నూతనంగా నిర్మించే 100 పడకల ఆస్పత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. వైరా రిజర్వాయర్ ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు కుడి కాల్వ హెడ్ స్లూయిస్ వద్ద శంకుస్థాపన చేశారు. తన సొంత గ్రామంలో రూ.65 లక్షలతో నిర్మించనున్న బాతింగ్ ఘాట్, రూ.4.20 కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యామ్, రూ.7.70 కోట్లతో నిర్మించనున్న రిటెయినింగ్ వాల్ నిర్మాణ పనులకు భట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీ పురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని, వైరా మండల అభివృద్ధికి కృషిచేసి జన్మభూమి రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు.

Read More
Next Story