బాబు, రేవంత్ ల అనుబంధంపై భట్టి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టేనా...
x

బాబు, రేవంత్ ల అనుబంధంపై భట్టి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టేనా...

చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ నేపథ్యంలో కలవబోతున్న గురుశిష్యులు అంటూ విమర్శలు మొదలయ్యాయి.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం గా రేవంత్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన్ని ఓ విమర్శ, కాదు కాదు బలమైన ఆరోపణ వెంటాడుతోంది. రేవంత్ కి సీఎం పగ్గాలిచ్చి మళ్ళీ ఆంధ్రోళ్ల పెత్తనం మనపైన రుద్దబోతున్నారు అని. బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకి సీఎం రేవంత్ రెడ్డే అయినా నడిపించేది చంద్రబాబే అన్నారు. గురుశిష్యులిద్దరూ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తారు అని. ఇక ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక ఈ డోస్ మరింత పెరిగిందనుకోండి.

ఇప్పుడు విభజన అంశాలపై చర్చించుకునేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలుగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ నెల 6 న కలవనున్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. చర్చల ప్రతిపాదనను ఆహ్వానిస్తూ ఈమేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నెల 6న హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా చర్చిద్దామని ఆహ్వానించారు. “విభజన సమస్యలను కలిసి పరిష్కరించుకుందాం. తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖి చర్చలు అవసరం. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. మా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున చంద్రబాబును ఆహ్వానిస్తున్నాం” అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ నేపథ్యంలో కలవబోతున్న గురుశిష్యులు అంటూ విమర్శలు మొదలయ్యాయి. వీటికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టిగానే సమాధానం చెప్పారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన... చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అనే కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. అలా అనకూడదని రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారని భట్టి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఎలాంటి గురువు కాదని, చంద్రబాబు రేవంత్ రెడ్డికి కేవలం సహచరుడు మాత్రమే అని అన్నారు. అది కూడా కొన్నేళ్ళ క్రితం నాటి పరిస్థితి అన్నారు. ఇప్పుడు ఎవరి దారి వారిదని, చంద్రబాబు ఏపీకి సీఎం అయితే, రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం అని అన్నారు. "ఇద్దరు సహచర ముఖ్యమంత్రులమే తప్ప గురు శిష్యులం కాదని రేవంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. విభజన చట్టంలో ఏడు మండలాల విలీనం అంశం లేదు. బీఆర్ఎస్ ఆర్డినెన్స్ తెచ్చి ఏపీకి అప్పజెప్పింది. ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీలే" అని భట్టి విక్రమార్క అన్నారు.

Read More
Next Story