కంగనా రనౌత్‌కు భట్టి విక్రమార్క స్ట్రాంగ్ వార్నింగ్..
బాలీవుడ్ భామ కంగనా రనౌత్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
బాలీవుడ్ భామ కంగనా రనౌత్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇందిరా గాంధీ ప్రధాన పాత్రగా కంగనా రనౌత్ తెరకెక్కించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే కంగనా రనౌత్‌పై విమర్శలు చేశారు. ప్రపంచ స్థాయిలో భారత దేశాన్ని ప్రత్యేకంగా నిలబెట్టడంలో ఇందిరా గాంధీ ప్రధాన భూమిక పోషించారని, దేశ సమగ్రత కోసం తన ప్రాణాలను సైతం విడిచారని భట్టి చెప్పారు. అటువంటి గొప్ప నాయకురాలిపై కొందరు కావాలని, చరిత్రపై అవగాహన లేక నెగిటివ్ సినిమాలు తీస్తున్నారంటూ ‘ఎమర్జెన్సీ’ సినిమాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ఎమర్జెన్సీ’ సినిమా జనవరి 2025లో విడుదల కానుందని ఈ క్రమంలోనే చరిత్ర తెలియని వారు కావాలనే ఇందిరా గాంధీ గురించి తప్పులు ప్రచారం చేయడానికి సినిమాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం తెలిసిన వారు ఇందిరా గాంధీకి చేతులెత్తి దండం పెడతారంటూ చెప్పుకొచ్చారు. కానీ కొందరు కావాలని తమ స్వార్థం కోసం ఇందిరా గాంధీపై, వారి కుటుంబ చరిత్రపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు చేసే వారికి ప్రజలే బుద్ధి చెబుతారు అని దుయ్యబట్టారు.
‘‘భారతదేశమంటే అభిమానం, ప్రేమ లేని వారే ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారు. కావాలనే ఇందిరా గాంధీని నెగిటివ్‌గా చూపిస్తున్నారు. ఇందిరాపై తప్పుడు ప్రచారం చేస్తూ దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు వదిలిన ఘనత ఇందిరా గాంధీ కుటుంబం సొంతం. ఇందిరా గాంధీ స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నాం. ఇందులో భాగంగానే అధికారంలోకి రాగానే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పథకం కోసం రూ.400 కోట్ల వరకు ఖర్చ పెడుతున్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం. బలహీన వర్గాల వారికి సంక్షేమం సత్వరమే అందేలా చర్యలు తీసుకోవడం కోసం సమగ్ర సర్వే చేయిస్తున్నాం. ప్రస్తుతం యావత్ దేశం చూపు తెలంగాణ వైపే ఉంది. కొందరు మాత్రం కావాలనే అమాయక ప్రజలను తమ అబద్ధాలతో రెచ్చగొడుతున్నారు’’ అని మండిపడ్డారు.