Bhatti Vikramarka | పద్మ అవార్డులపై భట్టి రియాక్షన్ ఇదే..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. పద్మ అవార్డుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అస్తిత్వం, ఆత్మగౌరవానికి ప్రశ్నార్థకంగా మారిందంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణకు చెందిన ఎందరో మహానుభావులకు అవార్డులు అందించని కేంద్రం తీరు.. తెలంగాణపై వారికి ఉన్న చిన్నచూపుకు అద్దం పడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిన వారిలో ఒక్కరికి కూడా అవార్డు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.
‘‘కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల పంపిణీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అస్తిత్వానికి, ఆత్మగౌరానికి ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, సమాజం కోసం, కలల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఐదుగురు పేర్లను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సిఫారసు చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఒక్కరికి కూడా అవార్డు ఇవ్వకపోవడం శోచనీయం. వీరిలో ఒక్కరికి కూడా అర్హత లేదా? తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజాయుద్ధ నౌక గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయదీర్ తిరుమల రావు పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఫెడరల్ స్ఫూర్తి కి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఐదుగురిలో ఒక్కరికి కూడా అవార్డులు ఇవ్వకపోవడం అన్యాయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన వారికి ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం సూచించిన వారికి ఇవ్వకపోవడం అన్యాయం. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇవ్వడం అభినందనీయం’’ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ నుంచి ఐదుగురికి అవార్డులు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణ నుంచి నలుగురికి మాత్రమే అవార్డులు ఇచ్చిందని, పలువురు మహానుభావులకు నిర్లక్షం చేసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.