ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం.. భట్టి విక్రమార్క
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆదివారం యాదాద్రి పవర్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం పవన్ ప్లాంట్‌కు బొగ్గును తరలించే రైలును ఆయన ప్రారంభించారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆదివారం యాదాద్రి పవర్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం పవన్ ప్లాంట్‌కు బొగ్గును తరలించే రైలును ఆయన ప్రారంభించారు. తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు కేటాయించిన నిధులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందని అన్నారాయన. తెలంగాణ అంతటా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను కనీవినీ ఎరుగని స్థాయిలో నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రపంచ స్థాయికి పోటీ ఇచ్చేలా ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తుందన్నారు. విద్య విషయంలో తమ ప్రభుత్వం రాజీ అన్న పదానికి కూడా ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతుందన్నారు.
రెసిడెన్షియల్ పాఠశాలల కోసం గత ప్రభుత్వం రూ.70 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా అత్యాధినిక సాంకేతికతతో రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాల కోసం రూ.5వేల కోట్లు నిధులను కేటాయించామని గుర్తు చేశారు భట్టి. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్.. విద్య, వైద్య రంగాలను విస్మరించిందని, ఆ రెండు రంగాలను సర్వనాశనం చేసిందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో గాడి తప్పిన అన్ని వ్యవస్థలను తమ ప్రభుత్వం గాడిన పెడుతోందని, ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే పరమావధిగా తమ ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోందని అని వివరించారాయన.
బీఆర్ఎస్‌కు భయం పట్టుకుంది..
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందుతుందో అని, ప్రజల బతుకులు ఎక్కడ మెరుగుపడతాయో అని బీఆర్ఎస్ నేతలకు భయంపట్టుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెటైర్లు వేశారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం చేపట్టినా, ఏ ప్రాజెక్ట్ ప్రారంభించినా విమర్శించడానికి, అడ్డు తగలడానికి బీఆర్ఎస్ ముందుంటుందని విమర్శించారు. అందుకు మూసీ ప్రాజెక్ట్ నిలువెత్తు నిదర్శనమని అన్నారు. అంతభయం ఉన్న వాళ్లు వాళ్ల చేతుల్లో అధికారం ఉన్నప్పుడే అంతా అవినీతే కాకుండా ప్రజలకు కాస్తంత మంచి చేసుండాల్సిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అన్ని సౌకర్యాలతో స్కూళ్లు
‘‘రెసిడెన్షియల్ స్కూళ్లను రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌకర్యాలతో నిర్మించనున్నాం. పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఆధునికీ విద్యను అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ విద్యను ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందరికీ అందించడే మా ముఖ్య ఉద్దేశం. అలాగే కాస్మోటిక్ ఛార్జీలను 40 శాతం పెంచిన ఘనత కూడా మా ప్రభుత్వానిదే. విద్యారంగం అభివృద్ధి కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కాస్మోటిక్ ఛార్జీలను అసలు పట్టించుకోలేదు. డైట్ ఛార్జీలను మాత్రం నామమాత్రంగానే పెంచి గొప్పలు మాత్రం ఆకాశాన్నంటే చెప్పుకున్నారు’’ అని విమర్శించారు.
అన్ని అనుమతులు సాధించాం
‘‘యాదాద్రి పవర్ స్టేషన్‌కు పర్యావరణ అనుమతులు అన్నీ సాధించాం. సంక్రాంతి తర్వాత అర్హులకు సన్నబియ్యం అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ఈ పథకం అమలైతే పేదలకు సన్నబియ్యం అందించాలన్న ప్రభుత్వం కల నెరవేరుతోంది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్కూల్స్ ద్వారా నాణ్యమైన, సాంకేతిక పరిజ్ఞాన విద్యను కూడా పేద విద్యార్థులకు ఉచితంగా అందించడమే కాకుండా వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం. అందుకోసం ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో 25 ఎకరాల స్థలం కేటాయించాం. ఇందుకు గాను రూ.5వేల కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ పాఠశాలల ఏర్పాటుకు త్వరితగతిన స్థలం సేకరించి ప్రాజెక్ట్ ప్రారంభించాలని చూస్తున్నాం’’ అని తెలిపారు.