ఈటలను గెలిపించడానికే పార్టీ మారుతున్నా
x

'ఈటలను గెలిపించడానికే పార్టీ మారుతున్నా'

ఓ ఉద్యమ నేత బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. టికెట్ రాలేదనో, రాజకీయ భవిష్యత్తు కోసమో కాదు, ఈటలని గెలిపించడానికి రాజీనామా చేస్తున్నాని కేసీఆర్ కి తేల్చి చెప్పారు.


అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చవిచూసిన బీఆర్ఎస్ కి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అవినీతి ఆరోపణలు, కేసులు, నోటీసులు, విచారణలు, నేతల ఫిరాయింపులు... ఇలా ఒకటేమిటి, నలువైపులా ప్రతికూల పవనాలే ఎదురవుతున్నాయి. కష్ట సమయంలో అండగా నిలబడతారనుకున్న కీలక నేతలు సైతం పార్టీకి దూరం అవుతున్నారు. టికెట్ రాలేదని కొందరు, పార్టీ పరిస్థితి బాలేదని కొందరు... ఇలా రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ లోకి జంప్ అవుతున్నారు.

ఇదే క్రమంలో ఓ ఉద్యమ నేత కూడా బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. ఆయన టికెట్ రాలేదనో, తన రాజకీయ భవిష్యత్తు చక్కబెట్టుకోడానికో పార్టీ మారడం లేదుట. ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేయడానికి పార్టీకి రాజీనామా చేస్తున్నాని కేసీఆర్ కి తేల్చి చెప్పారు. ఈ మేరకు కేసీఆర్ కి ఆయన రాజీనామా లేఖ రాశారు. ఇంతకీ ఎవరా నేత? ఏమా కథ తెలుసుకుందాం.



భేతి సుభాష్ రెడ్డి.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 2001 లో బీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ స్థాయికి ఎదిగారు. ఆయన విధేయతని మెచ్చి 2014 లో కేసీఆర్ ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి NVSS ప్రభాకర్ చేతిలో 14,169 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

2018 ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ తరపున ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఈసారి తన సమీప బీజేపీ అభ్యర్థి NVSS ప్రభాకర్ పై 48,168 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కానీ, 2023 లో టికెట్ దక్కించుకోలేకపోయారు. తన స్థానంలో పార్టీలో కొత్తగా చేరిన బండారి లక్ష్మారెడ్డికి ఉప్పల్ టికెట్ ఇచ్చింది అధిష్టానం. అధిష్టానం నిర్ణయంతో కలత చెందినప్పటికీ, పార్టీ అభ్యర్థి గెలుపుకి కృషి చేసి సక్సెస్ అయ్యారు. 2024 లోక్ సభ ఎన్నికల కూకట్ పల్లి ఇంచార్జ్ గా బీఆర్ఎస్ హై కమాండ్ భేతి సుభాష్ రెడ్డిని నియమించింది.

అయితే రాగిడి లక్ష్మారెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వడంపై భేతి అసంతృప్తితో ఉన్నారు. ఉద్యమ నేతలని పక్కన పెట్టి అవకాశవాదులకి టికెట్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఉద్యమనేత ఈటల రాజేందర్ కి టికెట్ ఇచ్చిందని, ఆయన్ని గెలిపించుకోవడం కోసం పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ గురువారం ప్రకటించారు. ఇదే విషయాన్ని కేసీఆర్ కి లేఖ ద్వారా తెలియజేశారు.

భేతి రాజీనామా లేఖ..

"నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. మీ ఆశయాల మేరకు పార్టీ అభివృద్ధికై పాటు పడ్డాను. నామీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసారు. కనీసం వారికి టికెట్ ఇచ్చేముందు నాకు మాట మాత్రమైనా చేప్పలేదు. అయినా మీ మాటను శిరసావహిస్తూ వారి గెలుపుకై కృషి చేసాను.

మొన్న మళ్ళీ మల్కాజిగిరి ఎంపీ టికెట్ మరొక అవకాశావాది రాగిడి లక్ష్మారెడ్డి కి పార్టీలో చర్చ లేకుండా ఇచ్చారు. కానీ బీజేపీ పార్టీ తోటి ఉద్యమ సహచరుడు ఈటెల రాజేందర్ కి టికెట్ ఇచ్చారు. కావున BRS పార్టీ ఇచ్చిన అవకాశవాద ఎంపీ అభ్యర్థులకంటే బీజేపీ ఇచ్చిన మా ఉద్యమసహచరుడు ఈటల రాజేందర్ ని గెలిపించాలనుకుంటున్నాను. కావున బీఆర్ఎస్ పార్టీకి, నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామాను ఆమోదించగలరు. ధన్యవాదములు" అంటూ కేసీఆర్ కి భేతి సుభాష్ రెడ్డి రాజీనామా లేఖ రాశారు.

Read More
Next Story