ఫార్మా కంపెనీలో భారీ పేలుడు.. కార్మికులు ఏం చెప్తున్నారంటే..
x

ఫార్మా కంపెనీలో భారీ పేలుడు.. కార్మికులు ఏం చెప్తున్నారంటే..

ఒకరు మృతి.. ఏడుగురికి గాయాలు. ఒకరి పరిస్థితి విషమం.


యాదగిరిగుట్ట పెద్దకందుకూరు శివారులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ అనే కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. కార్మికులతంతా ఎవరి పనుల్లో వారుండగా ఈ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మరణించగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కిమ్స్, యశోదా ఆసుపత్రులకు తరలించారు. మృతుడిని జనగాం బచ్చన్నపేట గ్రామానికి చెందిన మార్క కనకయ్యగా గుర్తించారు. క్షతగాత్రుల్లో యాదగిరి గుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్ అనే కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా అసలు ఏం జరిగింది అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పేలుడు కారణం ఏంటి? ప్రమాదవశాత్తు జరిగిందా? ఉద్దేశపూర్వంగానే ఎవరైనా చేశారా? వంటి కోణాల్లో కూడా ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు యాజమాన్య నిర్లక్ష్యం ఏమైనా కారణమా అన్న కోణంలో కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు పోలీసులు వివరించారు. మృతుడి, క్షతగాత్రుల కుటుంబాలకు సమాచారం అందించినట్లు వెల్లడించారు.

కార్మికులు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే.. కంపెనీలో శనివారం ఉదయం 9:45 గంటల ప్రాంతంలో పీఆర్డీసీ బిల్డింగ్-3లో పెల్లెట్ ఫార్ములా తయారు చేస్తున్నారు. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని కంపెనీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపారు. పేలుడు జరిగిన సమయంలో కంపెనీలో మొత్తం ఎనిమిది మంది కార్మికులు పని చేస్తున్నారని వివరించారు. టిఫిన్ చేసే సమయం కావడంతో మిగిలిన కార్మికులంతా బయటకు వెళ్లారని, అప్పుడు బాధితులు ఎనిమిది మందే లోపల ఉన్నారని చెప్పారు. పేలుడు సంభవించిన వెంటనే యాజమాన్యం ఎమర్జెన్సీ సైరెన్ మోగించి కార్మికులను అప్రమత్తం చేసింది. గ్యాస్ ఎనర్జీ కావడంతో మంటలు అతి వేగంగా వ్యాపించాయని ఆయన అన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read More
Next Story