
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
మొడెం కేంద్ర కమిటి సభ్యుడే కాకుండా, ఒడిశా రాష్ట్ర కమిటి కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు
శుక్రవారం తెల్లవారుజామున ఛత్తీస్ గడ్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో పదిమంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో కేంద్ర కమిటి సభ్యుడు మొడెం బాలకృష్ణ(60) కూడా ఉన్నట్లు భద్రతాదళాలు, పోలీసులు గుర్తించారు. బాలకృష్ణ ఇప్పటికే భద్రతాదళాలు, పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. మొడెం కేంద్ర కమిటి సభ్యుడే కాకుండా, ఒడిశా రాష్ట్ర కమిటి కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. దశాబ్దాలుగా మొడెం మావోయిస్టు(Maoists) భావజాలంతో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఒడిసా(Odessa) అటవీప్రాంతాలన్నీ కొట్టినపిండిగా పోలీసులు నిర్ధారించారు.
హనుమకొండ జిల్లా, కాజీపేట మండలం మడికొండకు చెందిన బాలకృష్ణ అలియాస్ మనోజ్ పై ఇప్పటికే రు. 2 కోట్ల రివార్డున్నది. ఛత్తీస్ ఘడ్ లోని మొయిన్ పూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు భద్రతాదళాలకు సమాచారం అందింది. దాంతో పెద్దఎత్తున గురువారం అర్ధరాత్రి నుండి అటవీప్రాంతంలో గాలింపు చర్యలు మొదలయ్యాయి. తమకు సమాచారం అందిన ప్రాంతానికి భద్రతాదళాలు చేరుకుని తీవ్రంగా గాలింపు మొదలుపెట్టారు. దీంతో భద్రతాదళాల ఉనికిని గమనించిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. వెంటనే భద్రతదళాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి.
దాదాపు రెండుగంటలకు పైగా జరిగిన కాల్పుల కారణంగా మావోయిస్టులు ఘటనా స్ధలంనుండి కాల్పులు జరుపుతునే పారిపోయారు. కొద్దిసేపటికి భద్రతాదళాలు స్ధలాన్ని పరిశీలించగా పదిమంది మృతదేహాలను గమనించారు. ఒక్కో దేహాన్ని పరీక్షించినపుడు వాటిల్లో బాలకృష్ణ కూడా ఉండటాన్ని భద్రతాదళాలు గుర్తించాయి. మిగిలిన మృతదేహాలను కూడా గుర్తించేపనిలో భద్రతాదళాలు నిమగ్నమయ్యాయి.
బాలకృష్ణ నేపధ్యం
మొడెం వెంకటయ్య, మల్లమ్మ నలుగురు సంతానంలో బాలకృష్ణ ఒకడు. పోస్టుమ్యాన్ గా ఉద్యోగం రావటంతో సొంత ఊరును వదిలేసి వెంకటయ్య 50 ఏళ్ళ క్రిందటే హైదరాబాదులోని చాదర్ ఘాట్ వద్ద కాపురం పెట్టారు. 1983లో పీపుల్స్ వార్ గ్రూప్ కు ఆకర్షితుడైన బాలకృష్ణ తన ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే నిలిపేశారు. ర్యాడికల్ విద్యార్దిసంఘంలో చురుకుగా వ్యవహరించి జంటనగరాల బాద్యతలు చూశారు. 1993లో యాంటీ నక్సల్ స్క్వాడ్ బాలకృష్ణను అరెస్టు చేయగా 1999 వరకు జైలులో ఉన్నారు.
డీఐజీ వ్యాస్ హత్య, ఎంఎల్ఏ కిడ్నాప్ తో పాటు బెంగుళూరులో అయుధాల సరఫరా, కుట్ర కేసుల్లో బాలకృష్ణ ముషీరాబాద్ జైలులో గడిపారు. 1999లో జైలునుండి విడుదలైన వెంటనే బాలకృష్ణ మళ్ళీ మావోయిస్టులతో కలిసిపోయారు. సుమారు 26 ఏళ్ళపాటు ఆంధ్ర-ఒడిశా బార్డర్(ఏవోబీ)లో వివిధ క్యాడర్లలో పనిచేశారు. మావోయిస్టులు పోలీసులపై జరిపిన అనేక దాడుల్లో బాలకృష్ణ కీలకపాత్ర పోషించాడు. ఆపరేషన్ కగార్ లో భాగంగా భద్రతాదళాలు మావోయిస్టుల ఏరివేతకు కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా బాలకృష్ణ ఛత్తీస్ ఘడ్, ఒడిశా సరిహద్దుల్లోని అడవుల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న భద్రతాదళాలు చివరకు పదిమంది మావోయిస్టులను హతమార్చారు.