
Big Breaking | బీసీ రిజర్వేషన్లకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..
సవరణ బిల్లులపై ఆమోద ముద్ర వేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రభుత్వం తెచ్చిన చట్ట సవరణ బిల్లులు రెండిటికీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. గెజిట్ విడుదలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్డినెన్స్ చేసి పంపగా దానిని న్యాయపరమైన అంశాలను పరిశీలించడం కోసం కేంద్రానికి సిఫార్సు చేశారు గవర్నర్. దీంతో తాజాగా మరో రెండు సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపింది ప్రభుత్వం. అనంతరం ఆ బిల్లుల ప్రాముఖ్యత, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంపై శాసనసభ ఏకాభిప్రాయం వంటి అంశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పలువురు నేతలతో కలిసి వెళ్లి గవర్నర్‌కు వివరించారు. తాజాగా ఈ బిల్లులకు గవర్నర్ తన ఆమోదం తెలిపారు. ఈ బిల్లులకు గవర్నర్.. సెప్టెంబర్ 9నే ఆమోదం తెలిపినప్పటికీ గురువారం ఈ విషయం బయటకు వచ్చింది.
గవర్నర్ గ్రీన్ సిగ్నల్..
గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై 50శాతం పరిమితి ఉంది. దానిని ఎత్తివేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్, పురపాలక చట్టాల సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆగస్టు 31న అసెంబ్లీలో, సెప్టెంబర్ 1న శాసనమండలిలో ఈ బిల్లులు పాస్ అయ్యాయి. అనంతరం సెప్టెంబర్ 2న వీటిని రాజ్‌భవన్‌కు పంపింది ప్రభుత్వం. వాటిని పరిశీలించిన గవర్నర్ న్యాయపరమైన సూచనలను కూడా తీసుకుని ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది.
ఫలించిన ప్రయత్నాలు
కామారెడ్డి డిక్లరేషన్ అమలుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేసింది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్తామని పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. కానీ రాష్ట్రంలోని, కేంద్రంలోని పరిస్థితుల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు కలగానే మిగులుతుందని అన్న వాదన బలంగా వినిపించింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీలు అన్నీ ఏకతాటిపై నడిచాయి. కానీ చట్టం చేసే తీరులో కొన్ని మార్పులు ఉండాలని విపక్షాలు సూచించాయి. వీటిని పక్కన బెడితే బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం, విపక్షాలు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు గవర్నర్ ఆమోదంతో ఫలించాయి.
స్థానిక సంస్థల ఎన్నికలే తరువాయి..
రిజర్వేషన్లను జులై చివరికి ముగించి స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 31 లోపు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ల కోసం చట్టాన్ని సవరించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి ఓకే చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వం అనేక అడ్డంకులను దాటుకుని అన్ని విధాలా ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు ఇప్పుడు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించడానికి లైన్ క్లియర్ అయింది. దీంతో అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది.
అన్ని ప్రయత్నాలు..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేసింది. తొలుత మార్చి నెలలో నిర్వహించిన కుల గణన ఆధారంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేలా రెండు బిల్లులను తీసుకొచ్చింది. వాటికి అసెంబ్లీ కూడా ఓకే చెప్పేసింది. కానీ అవి కేంద్రం దగ్గర నిలిచాయి. దాంతో కొంతకాలం వేచి చూసిన రాష్ట్ర ప్రభుత్వం.. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ చేసి గవర్నర్‌కు పంపింది. దానిని తరువుగా పరిశీలించిన గవర్నర్.. న్యాయపరమైన సూచనల కోసం కేంద్ర హోంశాఖకు ఆ ఆర్దినెన్స్‌ను సిఫార్సు చేశారు. దీంతో బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్‌మంతర్ వేదికగా కాంగ్రెస్.. బీసీ నేతలతో కలిసి భారీ ధర్నా నిర్వహించింది. అనంతరం ఈ ఆర్డినెన్స్, బిల్లులపై చర్చించడానికి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్‌మెంట్ కోరారు.
వారి అపాయింట్‌మెంట్ లభించలేదు. అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి రాష్ట్రపతి నిరాకరించారు. అయితే అపాయింట్‌మెంట్ లభిస్తే ఆమెను కలిసి పరిస్థితులు వివరించి వినతి పత్రం అందించాలని కాంగ్రెస్ భావించింది. కానీ అది సాధ్యపడలేదు. దీంతో దాదాపు చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు మరో ప్రయత్నంగా పంచాయతీరాజ్ శాఖ, పురపాలక చట్టాల సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ సమయంలో విపక్షాల నుంచి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆర్డినెన్స్‌కు ఓకే చెప్పని గవర్నర్.. ఈ బిల్లులకు ఎలా ఓకే చెప్తారని ప్రభుత్వం అనుకుంటుంది? అని కూడా ప్రశ్నించారు. కాగా తాము ఒక పాజిటివ్ ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని కాంగ్రెస్ మంత్రులు బదులిచ్చారు. అయితే ఇప్పుడు ఈ బిల్లులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. అతి త్వరలోనే ఈ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.