Big Butterfly Count: వాలంటీర్ల సర్వేలో వెలుగుచూసిన జీవవైవిధ్యం
x
అడవిలో చెట్లపై వాలిన సీతాకోక చిలుక

Big Butterfly Count: వాలంటీర్ల సర్వేలో వెలుగుచూసిన జీవవైవిధ్యం

ములుగు మన్యంలో 85 అరుదైన సీతాకోకచిలుక జాతులున్నాయని తాజా సర్వేలో వెలుగుచూసింది.


అడవిలో ఎగురుతూ… పూలపై వాలి రంగుల విందు పండిస్తున్న సీతాకోక చిలుకల సందడి ఈ మధ్య తెలంగాణ అడవుల్లో (Telangana forests) కొత్త కథ రాసింది. రంగురంగుల సీతాకోక చిలుకలు తెలంగాణ (Telangana) అడవుల్లో మళ్లీ రెక్కలు విప్పుతున్నాయి. దేశంలో తొలిసారిగా నిర్వహించిన భారీ బట్టర్‌ఫ్లై కౌంట్ సర్వే (BigButterflyCount) తెలంగాణ అడవుల్లో దాగి ఉన్న జీవవైవిధ్యాన్ని(biodiversity) వెలుగులోకి తెచ్చింది.




ఎన్ని జాతులున్నాయంటే...

జీవవైవిధ్యానికి ప్రతీకలైన సీతాకోక చిలుకలపై దేశంలోని పది రాష్ట్రాల్లో వాలంటీర్లు మొట్టమొదటిసారి సర్వే చేశారు. ఈ సర్వేలో రంగురంగుల పలు జాతుల సీతాకోక చిలుకలు, అరుదైన జాతులు వెలుగుచూశాయి. ప్రపంచవ్యాప్తంగా 17,500 రకాల జాతుల సీతాకోకచిలుకలున్నాయని ప్రపంచ బట్టర్ ఫ్లై కన్జర్వేషన్ సొసైటీ చెబుతోంది.భారతదేశంలో 1500 కు పైగా జాతుల సీతాకోకచిలుకలుండగా, వీటిలో 43 రకాల జాతుల సీతాకోకచిలుకలు అంతరించి పోయే ప్రమాదంలో ఉన్నాయని తేల్చారు. మనసుకు ఆహ్లాదాన్ని అందించే బట్టర్ ఫ్లైలను పరిరక్షించాలనే లక్ష్యంతో మొదటి సారి తెలంగాణలోని ఏటూరునాగారం అడవులతోపాటు పది రాష్ట్రాల్లో బిగ్ బట్టర్ ఫ్లై కౌంట్ పేరిట సర్వే చేసి నివేదిక రూపొందించామని అటవీశాఖ వైల్డ్ లైఫ్ ఓఎస్‌డీ ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



సీతాకోక చిలుకల సందడి

అడవిలో రంగురంగుల సీతాకోక చిలుకలు...పూల మొక్కలపై వాలుతూ... రివ్యున ఎగురుతూ సందడి చేస్తున్నాయి. బట్టర్ ఫ్లై ప్రేమికులు వాలంటీర్లుగా మారి...కాళ్లకు షూ ధరించి...భుజాన బ్యాగు వేసుకొని...బైనాక్యులర్స్...మెడలో లెన్స్ కెమెరాలతో దట్టమైన అడవిలో కాలిబాటల్లో తిరుగుతూ అరుదైన సీతాకోక చిలుకలను తమ కెమెరాల్లో బంధించారు.తెలంగాణ అటవీశాఖ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ పర్యావరణవేత్తలు, వాతావరణ అధ్యయన నిపుణులు, వాలంటీర్లు ఏటూరునాగారం అభయారణ్యంలో బట్టర్ ఫ్లై సర్వే చేశారు. ఈ సర్వేతో ములుగు జిల్లాకు ప్రాధాన్యం ఏర్పడింది.ఈ సర్వేలో పాల్గొన్న వాలంటీర్లకు అటవీశాఖ సర్టిఫికెట్లను ప్రదానం చేసింది. ఈ మొదటి సీతాకోకచిలుక సర్వే తెలంగాణలో జీవవైవిధ్య పర్యవేక్షణ, పరిరక్షణ పరిశోధన, పర్యావరణ వ్యవస్థకు కీలకమైన బేస్‌లైన్ డేటాను అందించిందని అటవీ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ కల్యాణపు సుమన్ చెప్పారు.



తెలంగాణలో 145, ఏటూరునాగారంలో 85 రకాల జాతులు

తెలంగాణ రాష్ట్రంలోని అడవుల్లో 145 రకాలు, ఏటూరునాగారం మన్యంలో 85 రకాల జాతుల సీతాకోక చిలుకలున్నాయని తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.లక్నవరం అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యానికి ప్రతీకలైన రంగురంగుల సీతాకోక చిలుకలు తన సర్వేలో కనిపించాయని హైదరాబాద్ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఉద్యోగిని అపరంజని ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణలో ఎన్నెన్నో అడవుల్లో ప్రకృతి అందాలను తిలకించవచ్చని ఆమె పేర్కొన్నారు.



పూలపై వాలిన సీతాకోకచిలుకలు

వివిధ జాతులు, రంగురంగుల బట్టర్ ఫ్లైలు పూలపై వాలినపుడు చూస్తే తన మనసు ఆనందంతో నిండుతుందని వాలంటీర్లు సర్వే అనుభూతులను పంచుకున్నారు. ములుగు మన్యంలో సీతాకోక చిలుకలతో తాను ఆల్బం రూపొందిస్తున్నానని బెంగళూరుకు చెందిన వాలంటీర్ బృందా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పూలపై వాలిన బట్టర్ ఫ్లైలను చూస్తే మనసు పులకరించిందని ఆమె పేర్కొన్నారు. పచ్చని ఎతైన చెట్లు...వివిధ రకాల పూల మొక్కలు...వాటిపై వాలిన సీతాకోక చిలుకలను వాలంటీర్ల తమ కెమెరాల్లో క్లిక్ మనిపించారు. బట్టర్ ఫ్లై సర్వే కాదని వాటిని కాపాడేందుకు తాము చేపట్టిన కార్యక్రమం అని వాలంటీర్ గంజి మారయ్య చెప్పారు.



రంగురంగుల సీతాకోక చిలుకలు...

ములుగు జిల్లా ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం రంగురంగుల సీతాకోక చిలుకల సందడితో రంగుల మయంగా మారింది. ఏడు రాష్ట్రాల నుంచి వాలంటీర్లు తెలంగాణ అటవీ శాఖ మొదటి సీతాకోకచిలుక సర్వేలో పాల్గొన్నారు. వణికిస్తున్న చలిలో తెలంగాణలోని మన్యంలో సీతాకోకచిలుకలను లెక్కించడం వాలంటీర్లకు మర్చిపోలేని మధుర స్మృతులను మిగిల్చింది. బట్టర్ ఫ్లైల ఉనికి పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యానికి మంచి సూచిక అని ములుగు జిల్లా అటవీ అధికారి రాహుల్ జాదవ్ చెప్పారు. తెలంగాణానే కాదు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌,లోని టైగర్ రిజర్వ్‌లలో ఇంతకు ముందు ఇలాంటి సర్వేలలో పాల్గొన్న అనుభవం ఉన్నవారు, అభయారణ్యంలో గుర్తించిన ప్రాంతాల్లో రోజుకు రెండుసార్లు, ఉదయం, సాయంత్రం ఈ సర్వే సాగింది. వాలంటీర్లు నలుగురు లేదా ఐదుగురు బృందాలుగా ఏర్పడి సీతాకోకచిలుకలు కనిపించే ప్రదేశాలను గుర్తించి, వాటిని లెక్కించి, ఈ కీటకాల చిత్రాలతో హ్యాండ్ గైడ్‌ని రూపొందించారు.



అంతరించి పోతున్న జాతులు

వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పెంచ్ టైగర్ రిజర్వ్, కన్హా అభయారణ్యాల్లోనూ బట్టర్ ఫ్లై సర్వే చేశారు. అడవుల్లో సీతాకోక చిలుకల సంఖ్య తగ్గిపోతుండటంతోపాటు కొన్ని జాతులు అంతరించి పోతున్న నేపథ్యంలో తాము బట్టర్‌ఫ్లై ఎమర్జెన్సీని ప్రకటించామని అటవీశాఖ అధికారులు చెప్పారు. చాలా రాష్ట్రాల్లోని అడవుల్లో బట్టర్ ఫ్లై జాతులు అంతరించి పోతున్నాయని తాజా సర్వేలో తేలింది. మాండ్‌సౌర్‌లోని గాంధీసాగర్ అభయారణ్యంలో వైల్డ్ వారియర్స్ బృందం నిపుణులు 45 జాతుల సీతాకోక చిలుకలను నమోదు చేశారు.



సీతాకోక చిలుకల సర్వే చిరస్మరణీయం

ఒక్క గాంధీసాగర్ వాతావరణంలో సీతాకోక చిలుకల సంతతి పెరిగి జీవవైవిధ్యం వృద్ధి చెందిందని తేలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని చప్రాలా, తాడోబా వన్యప్రాణుల అభయారణ్యాల్లో సీతాకోకచిలుక సర్వేలో పాల్గొనడం ఒక చిరస్మరణీయ అనుభవమని వాలంటీర్లు చెప్పారు.ఆకురాల్చే అడవిలో సీతాకోకచిలుకలను చూడటం నిజంగా మనోహరంగా ఉందని వాలంటీర్లు పేర్కొన్నారు. పది రాష్ట్రాల నుంచి 139 మంది వాలంటీర్లు ఉత్సాహంతో సీతాకోక చిలుకల సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే జీవవైవిధ్యం , పౌర విజ్ఞాన వేడుకగా మారింది. స్వచ్ఛంద సేవకులు అనేక జాతుల సీతాకోకచిలుకలను డాక్యుమెంట్ చేశారు.ముంబయి బట్టర్ ఫ్లై క్లబ్ సభ్యులు తాజాగా మలబార్ హిల్స్ పై బట్టర్ ఫ్లై వాక్ చేశారు.

పర్యావరణ ఆరోగ్యానికి జీవ సూచికలు...

అడవుల్లో రెపరెపలాడే ఈ చిన్న జీవులు కేవలం రంగుల విందు కాదు...మన పర్యావరణ ఆరోగ్యానికి జీవ సూచికలు. సీతాకోక చిలుకలను లెక్కించిన ఈ సర్వేతో వాలంటీర్లు అధ్యయనం మాత్రమే చేయలేదు, అడవులను రాబోయే తరాలకు కాపాడే మహోత్తర జాగృతి మొదలు పెట్టారు. దేశంలోని పది రాష్ట్రాల్లో ఒకే లక్ష్యంతో కలిసి పనిచేసిన వాలంటీర్లు చూపించిన మార్గం ఇక జీవవైవిధ్య సంరక్షణలో నూతన అధ్యాయానికి నాంది. ఈ సీతాకోక చిలుకల రెపరెపలు ఇప్పుడు పరిశోధనలకు, సంరక్షణకు దిక్సూచిలా మారాయి.


Read More
Next Story