తెలంగాణా మంత్రివర్గ విస్తరణకు ‘మహా’ దెబ్బ ?
x
Revanth and MaheshKumarGoud

తెలంగాణా మంత్రివర్గ విస్తరణకు ‘మహా’ దెబ్బ ?

రెండు రాష్ట్రాల్లోను అధికారంలోకి రావటం కాంగ్రెస్ లేదా ఇండియా కూటమికి చాలా కీలకమే అయినా రెండింటిలో మహారాష్ట్ర మరీ మరీ కీలకం.


తెలంగాణా మంత్రివర్గ విస్తరణకు మహారాష్ట్ర ఎన్నికల రూపంలో పెద్ద దెబ్బ పడేట్లుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గం ఏర్పడి ఇప్పటికి పదిమాసాలవుతోంది. రేవంత్ తో పాటు మంత్రివర్గంలో 11 మంది ఉన్నారు. మంత్రివర్గంలో 17 మందికి ఛాన్సుంటుంది. ఖాళీగా ఉన్న ఆరు స్ధానాలను భర్తీ చేయటానికి రేవంత్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఏదోక అవాంతరం ఎదురవుతున్న కారణంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతోంది. రెండునెలల నుండి మంత్రివర్గ విస్తరణలో చోటు సాధించేందుకు చాలామంది సీనియర్లు చాలా గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. జిల్లాలు, కులాల వారీగానే కాకుండా అధిష్టానం దగ్గర తమకున్న పలుకుబడి కారణంగా ఎవరికి వారు మంత్రివర్గంలో చోటుకోసం రేవంత్ పై అన్నీ రకాలుగా ఒత్తిళ్ళు తీసుకొస్తున్నారు.

నెలన్నర క్రితమే మంత్రివర్గ విస్తరణకు మీడియా ముహూర్తంకూడా పెట్టేసింది. విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా బాగా ప్రచారం జరిగింది. అయితే హర్యానా, జమ్మూ-కాశ్మీర్ ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో విస్తరణ ప్రచారానికి బ్రేకులు పడింది. జమ్మూలో మిశ్రమ ఫలితాలు వచ్చినా హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయింది. హర్యానా ఫలితంతో సంబంధంలేకుండా తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణకు రేవంత్ పైన సీనియర్లు ఒత్తిళ్ళు పెంచేస్తుంటే ఇదే విషయమై రేవంత్ కూడా అధిష్టానంలో ముఖ్యనేతలతో పదేపదే విస్తరణ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈరోజో రేపో విస్తరణ జరుగుతుందని అందరు అనుకుంటున్న సమయంలో సడెన్ గా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీఅయ్యింది. రెండు రాష్ట్రాల్లోను అధికారంలోకి రావటం కాంగ్రెస్ లేదా ఇండియా కూటమికి చాలా కీలకమే అయినా రెండింటిలో మహారాష్ట్ర మరీ మరీ కీలకం.

R

మహారాష్ట్ర ఎన్నికలు నెలరోజుల్లో పెట్టుకుని ఇపుడు తెలంగాణా మంత్రివర్గ విస్తరణ చేయటం మంచిదికాదని అధిష్టానం ముఖ్యులు అనుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం. మంత్రివర్గ విస్తరణకు ఒకపుడు హర్యానా ఎన్నికలు అడ్డుపడితే ఇపుడు మహారాష్ట్ర ఎన్నికలు అడ్డుపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రతో తెలంగాణాలోని జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్ సరిహద్దులు పంచుకుంటున్న విషయం తెలిసిందే. కాబట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణాలో సీనియర్లు కీలకపాత్ర పోషించాల్సుంటుంది. ఇపుడు గనుక మంత్రివర్గ విస్తరణ చేస్తే అవకాశాలు దక్కనివారు అలిగి నానా రచ్చచేసే అవకాశముంది. ఇదే జరిగితే మంత్రివర్గ విస్తరణ ప్రభావం మహారాష్ట్ర ఎన్నికలపైన నెగిటివ్ గా పడుతుంది. అందుకనే పై రెండు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాతే తెలంగాణా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయని పార్టీవర్గాల సమాచారం.

హీట్ పెంచేసిన మహేష్

మంత్రివర్గ విస్తరణ తొందరలో జరగబోతుందనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. రేవంత్ తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధరబాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటన ఫైనల్ అయ్యింది. దాంతో ఆశావహులు, సీనియర్లు మరింతగా అలర్టయ్యారు. ఇపుడు ప్రాతినిధ్యంలేని జిల్లాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు, వివేక్, వినోద్, నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి లాంటి అనేకమంది సీనియర్ల హడావుడి మొదలుపెట్టేశారు. ఇంతలో సడెన్ గా రెండు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ జారీఅయ్యింది. దాంతో సీనియర్లు, ఆశావహుల్లో హడావుడిపై నీళ్ళుచల్లేసినట్లయ్యింది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story