ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి హైకోర్టు షాక్..
x

ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి హైకోర్టు షాక్..

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆమె పాత్రపై మరోసారి విచారణ జరగనుంది.


ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి(SriLakshmi)కి తెలంగాణ హైకోర్టు(High Court) భారీ షాక్ ఇచ్చింది. ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో న్యాయస్థానం ఇప్పటికే ఆమెను దోషిగా ప్రకటించి శిక్ష కూడా ఖరారు చేసింది. ఆమెను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ కేసులో ఆమె పాత్రపై సీబీఐ ఎంక్వయిరీ స్టార్ట్ చేసింది. అయితే ఈ కేసులో శ్రీలక్ష్మీ పోరాటం ఇప్పుడు కాదు.. 2022లోనే ప్రారంభమైంది. ఆ సమయంలో శ్రీలక్ష్మీ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. కాగా సీబీఐ కోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ శ్రీలక్ష్మీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను ఉన్నతన్యాయస్థానం అనుమతించి విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఆమెను కేసు నుంచి తప్పిస్తూ తీర్పును కూడా వెలువరించింది.

ఆమెను కేసు నుంచి తప్పిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. హైకోర్టు తీరును తప్పుబట్టింది. సీబీఐ తరపు వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీ చేయడం సరైన పద్దతి కాదని అభిప్రాయపడింది. ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకుని తాజాగా విచారణ జరపాలని ఆ పిటిషన్‌ను తిరిగి హైకోర్టుకు పంపింది. అంతేకాకుండా ఈ కేసును మూడు నెలల్లో పరిష్కరించాలని తెలిపింది. దీంతో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆమె పాత్రపై మరోసారి విచారణ జరగనుంది.

అయితే 2006లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఓబుళాపురం మైనింగ్ లీజ్ వ్యవహారం అంతా కూడా ముందుకు సాగిందని సీబీఐ తరపు న్యాయవాది.. హైకోర్టు విచారణలో తెలిపారు. ఓఎంసీ లీజులు కట్టబెట్టడానికి అమె అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ తెలిపింది. ఈ కేసులో ఆరో నిందితురాలైన శ్రీలక్ష్మి.. వాస్తవాలను తొక్కిపెట్టి మరోసారి ఇక్కడ పిటిషన్‌ దాఖలు చేశారంటూ తెలంగాణ హైకోర్టుకు సీబీఐ నివేదించింది. గతంలో ఇదే కేసులో ఆమె పిటిషన్లను ఈ హైకోర్టు కొట్టేసిందని తెలిపింది. ఈ విషయాన్ని ప్రస్తుత రివిజన్‌ పిటిషన్‌లో ప్రస్తావించకుండా మరోసారి పిటిషన్‌ దాఖలు చేశారంది. ఓఎంసీకి లీజుల మంజూరులో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని, కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు శ్రీలక్ష్మి పిటిషన్‌ను తోసిపుచ్చింది.

అసలు కేసు ఏంటంటే..!

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(OMC)కి యజమాని గనుల కింగ్ గా పాపులరైన గాలి జనార్ధనరెడ్డి(Gali JanardhanaReddy). గాలికి దేశంలోని చాలా రాష్ట్రాల్లో గనుల వ్యాపారాలున్నాయి. గాలి ఏమిచేశారంటే తవ్వుకోవాల్సిన రెండు గ్రామాలతో పాటు పొరుగునే ఉన్న కర్నాటకలోని బళ్ళారి(Bellary) రిజర్వ్ ఫారెస్టులో కూడా ఇనుమ ఖనిజాన్ని తవ్వేసుకున్నాడు. సీఎం రోశయ్య ప్రభుత్వం గాలి కంపెనీమీద సీబీఐకి ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం నుండి ఫిర్యాదురాగానే వెంటనే సీబీఐ(CBI) రంగంలోకి దూకేసింది. గాలి అక్రమాలన్నింటినీ శాస్త్రీయంగా రుజువులు చేసే సాక్ష్యాలను సంపాదించి సీబీఐ కోర్టుముందుంచింది. దాదాపు 14 ఏళ్ళ విచారణలో 219 మంది సాక్ష్యులను, 3400 డాక్యుమెంటరీ ఎవిడెన్సును పరిశీలించిన కోర్టు గాలితో పాటు వ్యాపార భాగస్వామి బీవీ శ్రీనివాసరెడ్డి, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, ఓఎంసీ కంపెనీ, గాలికి పీఏగా పనిచేసిన మొహిసిన్ ఆలీఖాన్ కు ఏడెళ్ళ శిక్షలు విధించింది. ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేని కారణంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita IndraReddy), అప్పటి గనుల శాఖ సెక్రటరీ యెర్రా శ్రీలక్ష్మి, మరో ఐఏఎస్ అధికారి కృపానందంకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే సుప్రింకోర్టు ఆదేశాలతో శ్రీలక్ష్మి మీద తెలంగాణ హైకోర్టు మళ్ళీ విచారణ జరపబోతోంది. మూడునెలల్లో విచారణ ముగించాలని హైకోర్టును సుప్రింకోర్టు ఆదేశించింది.

Read More
Next Story