స్మిత సబర్వాల్‌పై చర్యలు తీసుకోవద్దు..!
x

స్మిత సబర్వాల్‌పై చర్యలు తీసుకోవద్దు..!

ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు.


కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి అంశంలో స్మిత సబర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెకు ఉపశమనం లభించింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆర్థిక అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ దాదాపు ఏడాదిన్నరపాటు విచారణ జరిపింది. సుమారు 120 మంది విచారించి, వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. వాటన్నింటినీ క్రోఢీకరించి నివేదికను సిద్ధం చేసి, దానిని ప్రభుత్వానికి అందించింది. కాగా ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిపి కాళేశ్వరం అవినీతి అంశాన్ని సీబీఐకి అప్పగించాలని సీఎం రేవంత్ తీర్మానం చేశారు. అప్పటి నుంచి ఈ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దంటూ అనేక మంది అధికారులు, నేతలు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.

కేసీఆర్, హరీష్ రావే ఫస్ట్..

కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని, సీబీఐ విచారణను వాయిదా వేయాలని కోరుతూ హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నివేదికలో అనేక తప్పులు, అబద్ధాలు ఉన్నాయని వారు ఆరోపించారు. ఈ విషయంలో హైకోర్టు నుంచి కేసీఆర్, హరీష్ రావుకు భారీ ఊరట లభించింది. వారు కోరినట్లే పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కాంగ్రెస్ తన రాజకీయకక్ష కోసం ఈ నివేదికను వినియోగించుకుంటుందని కూడా హరీష్ ఆరోపించారు.

ఇప్పుడు స్మితా సబర్వాల్..

కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పేరు కూడా ఉంది. దీంతో ఆమె నివేదికను హైకోర్ట్‌లో ఛాలెంజ్ చేసింది. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని ఆమె సవాల్ చేశారు. కమిషన్ నివేదికను కొట్టివేయాలని కూడా కోరారు. ఆ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని ఆమె తన పిటిషన్‌లో అభ్యర్థించారు. ఆమె పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఆమెపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

Read More
Next Story