
Kavitha | జాగృతిలో చీలిక
సంచలన విషయాలు చెప్పిన ఫౌండర్ రాజీవ్ సాగర్.
హరీష్ రావును ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలను రాజీవ్ తీవ్రంగా ఖండించారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయిన సమయంలో ఆమెను చూసి ఏడ్చిన నేత హరీష్ రావు అని, ఆమె బెయిల్‌పై విడుదలైన సమయంలో ఆమె మూటలు అందుకున్న వ్యక్తి హరీష్ రావు అని గుర్తు చేశారు. అంతేకాకుండా ఢిల్లీలో కవిత కోసం కేటీఆర్ చేసిన న్యాయపోరాటంలో హరీష్ రావు ప్రతిక్షణం కేటీఆర్‌కు తోడుగా, మద్దతుగా నిలిచారని అన్నారు. అలాంటి హరీష్ రావుపై ఈనాడు కవిత ఇలాంటి ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే ఆయన కవితకు ఓ సూటి ప్రశ్న కూడా వేశారు. ‘‘భవిష్యత్‌లో కూడా కేసీఆర్ కోసం, తెలంగాణ ప్రజల కోసం పని చేస్తామని ఆయన తేల్చిచెప్పారు. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. కేసీఆర్ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసే తెలంగాణ జాగృతి.. ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎవరి ఆశయం కోసం పనిచేస్తున్నారు?’’ అని కవితను మేడే రాజీవ్ సాగర్ నిలదీశారు.
కేసీఆర్‌తోనే మా ప్రయాణం..
జాగృతిని కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి స్థాపించాం అని రాజీవ్ సాగర్ గుర్తించారు. 2006 నుంచి ఉద్యమం కోసం తాము కేసీఆర్‌తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ‘‘కేసీఆర్ పిలుపు మేరకే కవితతో కలిసి పనిచేశాం. మాతో చర్చించకుండా కవిత ఎలా మాట్లాడతారు? ఎవరి లబ్ధి కోసం కవిత ఇలా మాట్లాడుతున్నారు? ఏది ఏమైనా మేము కేసీఆర్‌తోనే ఉంటాం. కేసీఆర్ కోసమే పనిచేస్తాం. ఎప్పుడయితే కవిత.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడారో అప్పటి నుండి మేము తెలంగాణ జాగృతికి దూరం అయ్యాం. కవిత లేఖ రాసినప్పటి నుండే కేసీఆర్‌కు ఆమె వ్యతిరేకం అయ్యారు’’ అని రాజీవ్ సాగర్ తెలిపారు.
‘‘కవిత తీసుకున్న నిర్ణయాల వల్ల జాగృతి కోసం పనిచేసిన ఎంతో మంది జీవితాలు ఏమవ్వాలి? 19 సంవత్సరాలు పని చేసిన వారి రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి? కవిత సామాజిక న్యాయం అని అంటున్నారు.. వారికి 2 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశాలు వచ్చాయి.. కానీ వారి వెనక ఉన్న వారికి సామాజిక న్యాయం జరిగిందా?’’ అని ఆయన ప్రశ్నించారు.
ఎవరి ఇష్టం వారిది..
అంతేకాకుండా జాగృతిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ దారిని తామే ఎన్నుకుంటారని రాజీవ్ చెప్పారు. కేసీఆర్‌తో కలిసి నడవాలా? లేకుంటే కవితతోనా? అనేది వారి ఇష్టం అని, ఎవరినీ ఎవరూ ఒత్తిడి చేయడం వంటివి ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు కవితతో ఎవరు ఉంటారు? బీఆర్ఎస్‌తో ఎవరు ఉంటారు? అనేది చూడాలని చెప్పారు.