
మోహన్ బాబుకు దెబ్బమీద దెబ్బ
కోర్టును తప్పుదోవ పట్టించారంటూ మనోజ్ తరపు న్యాయవాది కొన్ని ఆధారాలను ఎల్‌బీ నగర్ కోర్టు ముందు ఉంచారు. వాటిని పరిశీలించిన న్యాయస్థానం ఇది వరకు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
నటుడు మోహన్ బాబుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి తనను జల్‌పల్లి ఫామ్ హౌస్‌లోకి అనుమతించాలంటూ ఇంటి గేటు దగ్గరే ఆయన రెండో కుమారుడు మనోజ్ కుమార్.. నిరసన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఈ వ్యవహారం తీవ్రతరం అవుతున్న క్రమంలోనే ఎల్‌బీ నగర్ కోర్టులో మోహన్ బాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మనోజ్‌ను తన ఇంట్లోకి రాకుండా ఆదేశాలివ్వాలంటూ వేసిన పిటిషన్‌లో ఇది వరకు మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును న్యాయస్థానం ఈరోజు కొట్టివేసింది. తనను లోపలికి రానివ్వాలని మనోజ్ నిరసన చేస్తున్న క్రమంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం కీలకంగా మారింది.
అయితే గతేడాది చివరిలో మంచు ఫ్యామిలీలో తీవ్ర కలహాలు రేగాయి. వాటిలో భాగంగానే జల్‌పల్లిలో ఉన్న తన ఇంట్లోకి మనోజ్ రాకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. అందులో మోహన్‌బాబుకు అనుకూలంగానే కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే కోర్టును తప్పుదోవ పట్టించారంటూ మనోజ్ తరపు న్యాయవాది కొన్ని ఆధారాలను ఎల్‌బీ నగర్ కోర్టు ముందు ఉంచారు. వాటిని పరిశీలించిన న్యాయస్థానం ఇది వరకు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అంతేకాకుండా తప్పు చేసిన కోర్టు క్లర్క్‌కు మెమో జారీ చేసింది.
కోర్టు తన తీర్పును కొట్టివేసిన క్రమంలో ఇప్పుడు మనోజ్‌ను లోపలికి రానిస్తారా లేదా అనేది హాట్ టాపిక్‌గా మారింది. మంచు వారి కుటుంబ కథా చిత్రం మరోసారి కీలక మలుపు తీసుకునే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.