
ప్రభుత్వానికి హైకోర్టు పెద్ద షాక్...జీవో 9పై స్టే
కోర్టు తాజాఆదేశాలను బట్టి కేసువిచారణ జరిగేంతవరకు స్ధానికసంస్ధల ఎన్నికలు జరగవని తేలిపోయింది.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది.
వెనబడిన కులాలకు 42శాతం రిజర్వేషన్ అమలుచేస్తు ప్రభుత్వం జారీచేసిన జీవో 9 (GO MS 9) ని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్, జీఎం మొయిద్దీన్ a ద్విసభ్య ధర్మాసనం స్టే విధించింది.
గురువారం మధ్యాహ్నం ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శనరెడ్డి, పిటీషనర్ల తరపు లాయర్ కే వివేక్ రెడ్డి, మయూర్ రెడ్డి, జే ప్రభాకర్ సుదీర్ఘంగా తమ వాదనలను వినిపించారు. రెండువైపుల వాదనలు విన్న తర్వాత చీఫ్ జస్టిస్ మాట్లాడుతు జీవో 9 అమలుపై స్టే విధించినట్లు ప్రకటించారు. రెండువైపుల లాయర్లకు కౌంటర్ల దాఖలుకు రెండువారాలు గడువిచ్చిన చీఫ్ జస్టిస్, కేసు విచారణను నాలుగువారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కోర్టు తాజాఆదేశాలను బట్టి కేసువిచారణ జరిగేంతవరకు స్ధానికసంస్ధల ఎన్నికలు జరగవని తేలిపోయింది.
జీవో అమలుపై అడ్వకేట్ జనరల్ చాలాసేపు వాదనలు వినిపించారు. ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో బీసీలు 57.6 శాతం ఉన్నట్లు తేలిందని చెప్పారు. బీసీల జనాభా 57.6శాతం ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం 42శాతం రిజర్వేషన్ మాత్రమే కల్పించిన విషయాన్ని వివరించారు. బీసీలకు స్ధానికసంస్ధల్లో 42శాతం రిజర్వేషన్లు అమలైతే దాని ప్రభావంతో ఆర్ధిక, సామాజికంగా కూడా బీసీలు ఎదిగేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. అట్టడుగుస్ధాయిలో ఉన్న బీసీలను అభివృద్ధిచేయటానికే ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు సుదర్శనరెడ్డి వాదన వినిపించారు. ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని అర్ధంచేసుకుని జీవో 9 అమలుకు అందరు మద్దతు ఇచ్చేట్లుగా ఆదేశించాలని ద్విసభ్య ధర్మాసనాన్ని కోరారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని ఏజీ ధర్మాసనానికి గుర్తుచేశారు.
ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రవి వర్మ వాదనలువినిపించారు. రాష్ట్రంలో అగ్రకులాలు ఉన్నది కేవలం 15 శాతం మాత్రమే. ఈ రిజర్వేషన్లు వల్ల వాళ్ళకేలాంటి నష్టంలేదని , ఇంకా 33 శాతం మిగిలే ఉంటుందని కోర్టుకు నివేదించారు. 15 శాతం ఉన్నవాళ్ళు ఎలా రిజర్వేషన్లు అడ్డుకుంటారని ప్రశ్నిస్తూ రిజర్వేషన్లపై యాబై శాతం నియంత్రణ రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదని ఆయన చెప్పారు.
వాదనలు విన్న ధర్మాసనం జీవో 9 అమలుపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించి కేసు విచారణను నాలుగు వారాలు వాయిదావేస్తున్నట్లు చెప్పింది. ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల కారణంగా ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్లే అనుకోవాలి. జీవో 9 అమలును హైకోర్టు అడ్డుకోదన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఎన్నికలనిర్వహణకు ఏర్పాట్లు చేసింది. స్టేట్ ఎలక్షన్ కమీషన్ కూడా గురువారం నుండి నామినేషన్ల స్వీకరణకు ప్రకటన జారీచేసింది. మొదటి దశలో 292 జడ్పీటీసీలు, 2963 ఎంపీటీసీల ఎన్నికకు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో పాటు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసింది.
హైకోర్టు తాజా ఆదేశాలతో నోటిఫికేషన్ తో పాటు ఏర్పాట్లు ఎక్కడివి అక్కడే నిలిచిపోక తప్పదు. కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదావేసినా పూర్తి విచారణ జరిగేంతవరకు తెలంగాణలో స్ధానికసంస్ధల ఎన్నికలు జరగవని అర్ధమైపోయింది. ఎలాగైనా ఎన్నికలు జరిపించాలని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలుచేయాల్సిందే అన్న రేవంత్ ప్రభుత్వ సంకల్పం మొదట్లోనే నీరుకారిపోయినట్లయ్యింది. చట్టప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయటం ఇప్పట్లో సాధ్యంకాదని తేలిపోయింది. అందుకనే పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు రేవంత్ ఆలోచిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. గతంలోనే ఈ విషయాన్ని రేవంత్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. చట్టప్రకారం కాకపోతే బీసీలకు పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్లు అమలుచేసి తీరుతామని గట్టిగానే చెప్పారు. అప్పట్లో చెప్పినట్లుగా పార్టీపరంగానే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని రేవంత్ ఎప్పుడు తీసుకుంటారో చూడాలి.