
రేవంత్-మోడి మీటింగులో బిగ్ ట్విస్టు
తనను కలసిన ముఖ్యమంత్రికి సదరు రాష్ట్రంలో పెండింగులో ఉన్న కేంద్రపథకాలను వెంటనే పూర్తిచేయాలని విజ్ఞప్తి చేస్తే ఎలాగుంటుంది ?
పేరంటాళ్ళల్లో ఇస్తినమ్మ వాయినం..పుచ్చుకుంటినమ్మ వాయినం అనే సంప్రదాయముంది. అదేమిటంటే పేరంటాలకు వెళ్ళినపుడు ఒక మహిళ మరో మహిళకు వాయినం(తాంబూలం) ఇస్తుంది. వెంటనే వాయినం పుచ్చుకున్న సదరు మహిళ అంతకుముందు తనకు వాయినం ఇచ్చిన మహిళకు తానొక వాయినం ఇస్తుంది. దీన్నే ‘ఇస్తినమ్మ వాయినం-పుచ్చుకుంటినమ్మ వాయినం’ సంప్రదాయంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇపుడిదంతా ఎందుకంటే నరేంద్రమోడీ-రేవంత్ భేటీలో అచ్చు ఇలాంటి సంఘటనే జరిగింది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రసహకారం కోరుతు మోడీకి రేవంత్(Revanth) ఒక విజ్ఞప్తి ఇచ్చారు. వెంటనే కేంద్రపథకాలకు సంబంధించి తెలంగాణలో పెండింగులో ఉన్న వాటిని ప్రస్తావిస్తు మోడీ(Narendra Modi) కూడా రేవంత్ కు మరో విజ్ఞప్తిని అందించారు. విజ్ఞప్తులు ఇచ్చిపుచ్చుకోవటం అచ్చంగా వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నట్లుగా అనిపిస్తోంది.
దేశంలోని ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కలిసి పెండింగ్ పనులు పూర్తి చేయాలని, రాష్ట్రాలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని, బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని విజ్ఞప్తులు చేయటం చాలా సహజం. అదే ప్రధానమంత్రి తనను కలసిన ముఖ్యమంత్రికి సదరు రాష్ట్రంలో పెండింగులో ఉన్న కేంద్రపథకాలను వెంటనే పూర్తిచేయాలని విజ్ఞప్తి చేస్తే ఎలాగుంటుంది ? సీన్ రివర్సులో ఉందేమిటనే అనుమానాలు రావా ? ఇపుడు నరేంద్రమోడీ-రేవంత్ భేటీలో అచ్చంగా అదే జరిగింది. విషయం ఏమిటంటే తెలంగాణ(Telangana)కు సంబంధించిన కేంద్రంలో పెండింగులో ఉన్న అనేక అంశాలపై మోడీతో భేటీ అయి క్లియరెన్స్ తెచ్చుకునేందుకు రేవంత్ దాదాపు గంటసేపు భేటీఅయ్యారు. తెలంగాణకు పెండింగులో ఉన్న అనుమతులు, నిధులు, వివిధ ప్రాజెక్టులకు ఆశిస్తున్న నిధులు, అనుమతులను స్పీడుచేయాలని రేవంత్ రిక్వెస్టుచేశారు. మోడీ కూడా రేవంత్ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించారు. భేటీ ముగిసిన తర్వాత రేవంత్ బయటకు వచ్చేయటానికి రెడీ అయ్యారు.
సరిగ్గా ఆసమయంలో మోడీ బిగ్ ట్విస్టు ఇచ్చారు. రేవంత్ విజ్ఞప్తిని అందుకున్న మోడీ తర్వాత తానొక విజ్ఞప్తిని రేవంత్ కు అందించారు. అదేమిటంటే కేంద్రప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణలో పెండింగులో ఉన్న అంశాలపై తానొక లేఖను రేవంత్ కు అందించారు. ఆవిజ్ఞప్తిలో తెలంగాణలో కేంద్రపథకాలు అమలు జరుగుతున్న తీరు, పథకాల అమలుకు పెండింగులో ఉన్న భూ సేకరణ తదితరాల్లో జోరుపెంచాలని, పథకాల అమలులో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని రేవంత్ కు నరేంద్రమోడీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరుచేస్తున్నా అనేక ప్రాజెక్టులు ఇంకా పెండింగులో ఉన్నాయని మోడీ గుర్తుచేశారు.
వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మూడు మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పెండింగులో ఉన్నట్లు మోడీ చెప్పారు. రిలయన్స్ మొబైల్(Reliance Mobile) రు. 32,797 కోట్ల పెట్టుబుడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి రైట్ ఆఫ్ కింద అనుమతులు 2022 ఆగష్టు నుండి తెలంగాణలోని రెండు రూట్లకు అనుమతులు పెండింగులో ఉన్నట్లు మోడీ గుర్తుచేశారు. దేవాదుల, బీమా, శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాజెక్టులకు సంబంధించి 2023, జూలై నుండి రు. 18, 189 కోట్ల విలువైన భూసేకరణ పెండింగులో ఉన్నట్లు మోడీ తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ కి సంబంధించి రు. 1366 కోట్లు రాష్ట్రప్రభుత్వం నుండి విద్యుత్, వాటర్ బిల్లులు పెండింగులో ఉన్నట్లు చెప్పారు. శంషాబాద్ లో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన భూమికి తెలంగాణ ప్రభుత్వం రు. 150 కోట్లు కేంద్రానికి చెల్లించాల్సుందన్న విషయాన్ని మోడీ గుర్తుచేశారు. మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైల్వేలైన్, కాపీపేట-విజయవాడ మూడోలైన్ విద్యుదీకరణకు సంబంధించి రు. 3113 కోట్లు విలువైన భూసేకరణ 2020, సెప్టెంబర్ నుండి పెండింగులో ఉందని మోడీ చెప్పారు.
2016-17, 2017-18 లో తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకంలో 70,674 ఇళ్ళు మంజూరుచేసిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు. అయితే ఇళ్ళు నిర్మించలేదు కాబట్టి కేంద్రం మంజూరుచేసిన ఇళ్ళన్నింటినీ తిరిగి కేంద్రానికి వాపసుచేస్తు లేఖ రాయాలని మోడీ అడిగారు. తాను లేఖలో ప్రస్తావించిన పెండింగులో ఉన్న అంశాలను వెంటనే క్లియర్ చేసి కేంద్రప్రాజెక్టులు తొందరగా జరగటానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని రేవంత్ కు మోడీ విజ్ఞప్తిచేశారు. దాంతో ఏమిచేయాలో అర్ధంకాని రేవంత్ విజ్ఞప్తిలోని అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించి అనుమతుల మంజూరుకు తొందరగా నిర్ణయాలు తీసుకుంటానని మోడీకి హామీ ఇచ్చి రేవంత్ బయటపడ్డారు.