
మాగంటి మరణం మిస్టరీలో బిగ్ ట్విస్ట్
అనారోగ్యంతో గోపి ఆసుపత్రిలో చేరినదగ్గర నుండి చనిపోయారని ప్రకటించేంతవరకు జరిగిన పరిణామాలన్నీ తీవ్ర అనుమానాస్పదంగానే ఉన్నాయని తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు.
మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నది. ఇంతకీ ఆ ట్విస్టు ఏమిటంటే గోపీ తల్లి మహానందకుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకొడుకు మరణం మిస్టరీని ఛేదించాలని ఆమె ఫిర్యాదులో కోరారు. గోపి(Maganti Gopi)మరణం మిస్టరీని ఛేదించాలని, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi)పదేపదే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి బదులుగా రేవంత్(Revanth)మాట్లాడుతు బండి ఫిర్యాదుచేస్తే వెంటనే పోలీసులతో విచారణ చేయించి మిస్టరీని ఛేదిస్తామని చెప్పారు. ఇదేసమయంలో గోపీ తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు.
అనారోగ్యంతో గోపి ఆసుపత్రిలో చేరినదగ్గర నుండి చనిపోయారని ప్రకటించేంతవరకు జరిగిన పరిణామాలన్నీ తీవ్ర అనుమానాస్పదంగానే ఉన్నాయని తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరిన కొడుకును చూడటానికి వచ్చినపుడు తనను ఆసుపత్రి యాజమాన్యం లోపలకి అనుమతించలేదన్నారు. తమకుటుంబంలోని ఐదుగురిని ఆసుపత్రిలోని మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి రానీయలేదని, చివరకు చనిపోయిన తర్వాత కూడా వెంటనే కాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్ నుండి తిరిగివచ్చిన తర్వాతనే చనిపోయినట్లు ప్రకటించారని మహానంద ఆరోపించారు. గోపీ కూతురు ఆసుపత్రి యాజమాన్యానికి రాసిన లేఖ కారణంగానే తమను యాజమాన్యం లోపలకు అనుమతించలేదని మండిపడ్డారు. కాబట్టి తన కొడుకు మరణంపై తమ అనుమానాలు తీరాలంటే నిష్పాక్షికంగా విచారణ చేయాల్సిందే అని పోలీసులను గోపీ తల్లి ఫిర్యాదులో కోరారు.
గోపి మరణించిన తర్వాత జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో భార్య సునీత నామినేషన్ దాఖలు చేసినప్పటినుండి వివాదం మొదలైంది. సునీత నామినేషన్ అలాగే ఓకే అయ్యిందో లేదో వెంటనే తానే గోపీ అసలు భార్యను అంటు మాలినీదేవి, కొడుకును అంటు ప్రద్యుమ్న అమెరికా నుండి దిగేశారు. గోపీకి తాను మొదటిభార్యనని తనకు విడాకులు ఇవ్వకుండానే సునీతతో గోపీ ఉన్నట్లు మాలినీదేవి ఆరోపిస్తున్నారు. గోపీ-సునీత వివాహం చేసుకోలేదని, ఏళ్ళతరబడి సహచర్యం చేశారని ఆమెచేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈవివాదాన్ని శేరిలింగంపల్లి ఎంఆర్వో వెంకటరెడ్డి విచారిస్తున్నారు.
ఇప్పటివరకు రెండుకుటుంబాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, వెంకటరెడ్డి విచారణకు హాజరవుతున్నారు కాని ఎవరూ పోలీసులను ఆశ్రయించలేదు. ఈ నేపధ్యంలోనే గోపీ తల్లి మహానందకుమారి రాయదుర్గం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో వివాదం పెద్ద మలుపు తీసుకుందనే చెప్పాలి. పోలీసులు గనుక విచారణ మొదలుపెడితే గోపీ-మాలినీదేవి వివాహం, గోపీ-సునీత వివాహం లేదా సహచర్యం, మ్యారేజీ సర్టిఫికేట్లు, గోపి ఆసుపత్రిలో చేరటం, మరణించటం, మరణ ప్రకటణ, ఆసుపత్రిలోకి మహానందకుమారి తదితరులను అనుమతించకూపోవటం లాంటి అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడు గోపీ తాలూకు మరణంలోని మిస్టరి ఏమిటో బయటపడుతుంది. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.

