తెలంగాణకు షాకిచ్చిన ఏపీ బీజేపీ చీఫ్
x

తెలంగాణకు షాకిచ్చిన ఏపీ బీజేపీ చీఫ్

పెను వివాదంగా మారిన లోకేష్ కు మాధవ్ ఇచ్చిన ఫొటో


ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్ తెలంగాణ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాను పార్టీ అధ్యక్షుడిగా అయిన తరువాత పెద్దలను అందరినీ కలిసే క్రమంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి లోకేష్ తో నూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ఆ సందర్భంగా మాధవ్ లోకేష్ కు అందజేసిన ఫొటో ఇప్పుడు వివాదానికి వేదికైంది.భారత సాంస్కృతిక వైభవం అంటూ దేశపటాన్ని బహుకరించారు.అందులో తెలంగాణ రాష్ట్రం లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ అస్తిత్వాన్ని అవమాన పరిచారు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఏపీ మంత్రి లోకేశ్‌కు ఇచ్చిన భారత చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్య‌క్తం చేశారు. భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడంపై వెంటనే బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.తెలంగాణ అస్తిత్వాన్ని భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బిజెపి అధికారిక విధానమా..? అని ప్రధాని నరేంద్ర మోదీని కేటీఆర్ సూటిగా ప్ర‌శ్నించారు. ఈ విషయంలో ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీకి పలు ప్రశ్నలు సంధించారు . మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మా సాంస్కృతిక గుర్తింపుని అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారు. మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని మాత్రమే చూపించడం దారుణం. తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని లెక్కచేయకుండా చేసిన చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఇది పూర్తిగా అనుచితమైంది. భారతదేశ చిత్రపటం నుంచి మా చరిత్రనే తొలగిస్తే మేమెవరం? ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా? అని ప్రధానమంత్రి మోదీని కేటీఆర్ ప్ర‌శ్నించారు. లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాటా అనే విషయంపై స్ప‌ష్ట‌త ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు ఈ ఫోటో వివాదాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్లు చేశారు. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తదితరులు సోషల్ మీడియా వేదికగా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
Read More
Next Story