బీఆర్ఎస్ మీదికి భారీ వల విసిరిన బీజేపీ
x
BRS and BJP (source Twitter)

బీఆర్ఎస్ మీదికి భారీ వల విసిరిన బీజేపీ

కారుపార్టీకి చెందిన మాజీమంత్రులతో కలిపి సుమారు ఏడుగురు ఎంఎల్ఏలు బీజేపీలో చేరటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇక్కడ చిన్నసమస్య ఎదురవుతోంది.


తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో టార్గెట్ రీచవ్వాలంటే బీజేపీకి ఇతర పార్టీల ఎంఎల్ఏలే దిక్కయ్యేట్లున్నారు. ఇతరపార్టీల ఎంఎల్ఏలు అంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అని మాత్రమే అర్ధం. విషయం ఏమిటంటే కారుపార్టీకి చెందిన మాజీమంత్రులతో కలిపి సుమారు ఏడుగురు ఎంఎల్ఏలు బీజేపీలో చేరటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇక్కడ చిన్నసమస్య ఎదురవుతోంది. అదేమిటంటే పార్లమెంటు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పార్టీలో చేరితే అనుకున్నట్లుగా మంచిఫలితాలు సాధించవచ్చని కమలనాధులు భావిస్తున్నారు. ఇదేసమయంలో కారుపార్టీ ఎంఎల్ఏలేమో పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన తర్వాతే బీజేపీలో చేరుతామని అంటున్నారు.

బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వెళితే తమపై వెంటనే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుపడుతుందేమో అని కూడా ఆందోళనపడుతున్నారు. బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎంఎల్ఏలకు అనర్హతవేటు భయంఉన్నట్లు లేదు. ఎందుకంటే అధికార పార్టీలోకి జంప్ చేసే ఎంఎల్ఏలపైన అనర్హత వేటు పడటం చాలా అరుదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే అనర్హతవేటు వేయాల్సింది అసెంబ్లీ స్పీకర్ మాత్రమే. అనర్హత వేటువేసినా, వేయకుండా జాప్యంచేసినా స్పీకర్ ను ప్రశ్నించేందుకు లేదు. స్పీకర్ నిర్ణయంపై న్యాయస్ధానాలు కూడా జోక్యం చేసుకునే అవకాశంలేదు. ఈమధ్యనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి మారిన దానం నాగేందర్ విషయంలో కోర్టు స్పందించిన తీరే తాజా ఉదాహరణ. పార్టీ ఫిరాయించిన దానంపై వెంటనే అనర్హత వేటు వేయాలని రాజుయాదవ్ అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ వేశారు.

అనర్హత వేటు స్పీకర్ చేతిలోనే

ఆ కేసును విచారించిన జడ్జి అనర్హత వేటు విషయంలో సంబంధిత పార్టీని అడగకుండా కోర్టులో కేసేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కొట్టేశారు. వెంటనే బీఆర్ఎస్ నేతలు దానంపై అనర్హ వేటు వేయాలని స్పీకర్ ను కలిసి విజ్ఞప్తిచేశారు. బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తిచేసినంత మాత్రాన స్పీకర్ దానంపై అనర్హత వేటువేసే అవకాశంలేదు. ఎందుకంటే అనర్హత వేటు విషయంలో రావాల్సిన వారినుండి ఆదేశాలు వచ్చేంతవరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోరని అందరికీ తెలిసిందే. పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో కేసీయార్ అనుసరించిన మార్గాన్నే ఇపుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుసరిస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలపై అనర్హత వేటువేయాలని హస్తంపార్టీ నేతలు ఎన్నిసార్లు అడిగినా అప్పటి స్పీకర్ పట్టించుకోలేదు.

అధికారపార్టీలోకి ఫిరాయించిన ఎంఎల్ఏలపైన అనర్హత వేటుపడే అవకాశాలు లేకపోవచ్చు కాని బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి ఫిరాయించే ఎంఎల్ఏలమీద వెంటనే అనర్హత వేటుపడే అవకాశాలున్నాయి. ఈఒక్కకారణమే బీజేపీలో చేరాలని అనుకుంటున్న బీఆర్ఎస్ ఎంఎల్ఏలను వెనకాడేట్లు చేస్తోంది. ఒకరిపై అనర్హత వేటువేసి మరొకరిపైన వేయకపోతే వేటుపడిన వారు కోర్టుకు వెళతారు. అయితే కోర్టులో కేసంటే ఎప్పటికి తెములుతుందో ఎవరు చెప్పలేరు. తొందరలోనే బీఆర్ఎస్ నుండి కొందరు ఎంఎల్ఏలు మూకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. కొందరు ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో గనుక చేరితే అప్పుడు ఏడుగురు ఎంఎల్ఏలతో కలిసి మాజీ మంత్రులు బీజేపీలో చేరే విషయంపై క్లారిటి వస్తుందని కమలంపార్టీ నేతలు అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతల్లో అసంతృప్తి పెరిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ అసంతృప్తే బాగా పెరిగిపోయి తమకు లాభిస్తుందని బీజేపీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు.

ముహూర్తం ఎప్పుడో ?

పార్టీవర్గాల సమాచారం ప్రకారం పార్లమెంటుఎన్నికలు అయిపోగానే బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉందికాని కమలంపార్టీ ఆశించినట్లుగా ఫలితాలు రాకపోతే అప్పుడు ఏమి జరుగుతుందన్నదే ఇపుడు సస్పెన్సుగా ఉంది. బీజేపీకి ఇపుడున్న నాలుగు ఎంపీ స్ధానాలను తిరిగి నిలబెట్టుకున్నా బాగానే పెర్ఫార్మ్ చేసినట్లు అనుకోవాలి. అదే సీట్లసంఖ్య తగ్గిపోతే అప్పుడు కూడా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు బీజేపీలోకి ఫిరాయించటానికి రెడీగా ఉంటారా అన్నదే క్వశ్చన్.

Read More
Next Story