
అఖిలపక్షానికి ఆ పార్టీలు దూరం..
ఈరోజు అధికారికంగా షెడ్యూల్ ఫిక్స్ కావడమే ఇందుకు కారణం. మరోసారి సమావేశం పెట్టి ముందుగా సమాచారం ఇవ్వండి. చర్చించి నిర్ణయం తీసుకుంటామని కిషన్ తెలిపారు.
ప్రజాభవన్‌లో తెలంగాణలోని అన్ని పార్టీల ఎంపీలతో చర్చించడం కోసం శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి రావాలంటూ అన్ని పార్టీల నేతలను కోరారు. కాగా ఈ సమావేశానికి తాము రావడం కుదరదని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లేఖ కూడా రాశారు. అప్పటికప్పుడు తమకు సమాచారం ఇచ్చారని, అందువల్ల తాము ఈ సమావేశానికి హాజరుకాలేకున్నామని ఆయన వివరించారు. కాగా తాజాగా ఈ సమావేశానికి తాము కూడా రావడం లేదంటూ బీఆర్ఎస్ కూడా స్పష్టం చేసింది. కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు బీఆర్ఎస్ వెల్లడించింది.
‘‘ఈరోజు అఖిలపక్ష సమావేశానికి హాజరుకావడం లేదు. మాకు ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం శుక్రవారమే ఇచ్చారు. పార్టీలో అంతర్గతంగా , జాతీయ నాయకత్వంతో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. భవిష్యత్ లో సమావేశాలకు ముందుగా సమాచారం ఇవ్వండి. పార్టీలో చర్చించి హాజరవుతాం. ఈరోజు అధికారికంగా షెడ్యూల్ ఫిక్స్ అయింది. మోడీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది’’ అని కిషన్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ప్రజాభవన్‌కు చేరుకున్నారు.
శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఈ ఆల్ పార్టీ ఎంపీలతో భేటీపై కేసీఆర్‌తో చర్చించారు బీఆర్ఎస్ ఎంపీలు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న నలుగురు ఎంపీలు ఈ చర్చలో పాల్గొన్నారు. కాగా కేసీఆర్ సూచనల మేరకే వారు ఈ సమావేశానికి హాజరుకావడం లేదని తెలుస్తోంది.