
బీజేపీని నమ్ముకుని మునిగిపోయిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇద్దరు చేసేదిలేక చివరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకుని పరువు దక్కించుకోవాలని డిసైడ్ అయ్యారు
శతృవుకు శతృవు మిత్రుడు అన్నది రాజనీతి. అయితే ఇది అన్నీసందర్భాల్లోను వర్కవుట్ కాదు. ఎందుకంటే పోటీలో నలుగురు ఉన్నపుడు పై రాజనీతి పనిచేయదు. ఇపుడీ విషయం ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) స్టాండింగ్ కమిటి ఎన్నికల్లో బీజేపీ(BJP)ని నమ్ముకుని బీఆర్ఎస్(BRS) దెబ్బతినేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉన్న విషయం తెలిసిందే. 150 కార్పొరేటర్ల నుండి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటికి ప్రతి ఏడాది 15 మంది సభ్యులను ఎన్నుకుంటారు. మేయర్, డిప్యుటి మేయర్ తర్వాత జీహెచ్ఎంసీ పాలనా వ్యవహారాల్లో స్టాండింగ్ కమిటి(కౌన్సిల్) చాలా కీలకం. ప్రతిఏడాది 15 మంది సభ్యులను ఎన్నిక లేదా ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంటారు. గడచిన పదేళ్ళుగా స్టాండింగ్ కమిటికి సభ్యులు ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉందికాబట్టి. ఇపుడు స్టాండింగ్ కమిటీకి 15 మంది సభ్యులను ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది.
అధికారంలో కాంగ్రెస్(Congress) ఉందికాబట్టి ఎలాగైనా అధికారపార్టీని దెబ్బతీయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. నిజానికి జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్, బీజేపీల బలం బాగానే ఉంది. 150 డివిజన్ల కార్పొరేషన్లో 2020లో ఎన్నికలు జరిగినపుడు బీఆర్ఎస్ బలం 56, బీజేపీ బలం 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 డివిజన్లు గెలిచాయి. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటంతో సీన్ మారిపోయింది. వివిధ కారణాలతో తాజా లెక్కల ప్రకారం బీఆర్ఎస్ బలం 42, బీజేపీ బలం 40, ఎంఐఎం బలం 41కి పడిపోగా కాంగ్రెస్ బలం 24కి పెరిగింది. లెక్కల్లో కాస్త తేడాలున్నా బీజేపీ కలిసొస్తే కాంగ్రెస్ ను ఈజీగా దెబ్బకొట్టచ్చని బీఆర్ఎస్ నేతలు అనుకున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చేతులు కలపటంలో బీఆర్ఎస్-బీజేపీ మధ్య లోపాయికారి చర్చలు కూడా జరిగాయని సమాచారం. బీజేపీ నుండి పాజిటివ్ సంకేతాలు అందిన కారణంగానే స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక(Standing council election) విషయమై బీఆర్ఎస్ నుండి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్లు కూడా వేశారు.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్-బీజేపీలు చేతులు కలిపాయి కాబట్టి కచ్చితంగా స్టాండింగ్ కమిటీకి ఎన్నిక తప్పదనే అందరు అనుకున్నారు. చాలాకాలం తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మంచి రసవత్తరంగా ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. నామినేషన్ల దాఖలకు సోమవారమే ఆఖరిరోజు. అయితే తాజా పరిస్ధితి ఏమిటంటే ఎన్నిక నుండి బీజేపీ వెనక్కుతగ్గింది. తమకు తగినంత సంఖ్యాబలం లేనికారణంగా స్టాండింగ్ కమిటి ఎన్నికల్లో పోటీచేయకూడదని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ చివరినిముషంలో వెనక్కుపోవటానికి కారణం ఏమిటంటే కాంగ్రెస్-ఎంఐఎం చేతులు కలపటమే. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతుదారుగా మారిన విషయం తెలిసిందే. 15 పోస్టులకు గాను కాంగ్రెస్ 7 నామినేషన్లు, ఎంఐఎం 8 నామినేషన్లు వేశాయి. 41 మంది కార్పొరేటర్లున్నా పోటీలో నుండి బీజేపీ ఎందుకు వెనకడుగువేసింది ?
ఎందుకంటే, ఎంఐఎం+కాంగ్రెస్ కలిస్తే బలం 65కి పెరిగింది. ఇదేసమయంలో బీఆర్ఎస్ బలం 42గానే ఉంటుందనే నమ్మకం బీజేపీ నేతల్లో కలగలేదు. ఎప్పుడైనా 20 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో కలవటానికి సిద్దంగా ఉన్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. జరుగుతున్న ప్రచారాన్ని నమ్మిన బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందం చేసుకుంటే దెబ్బతినేస్తామని ఆలోచించారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీజేపీలు కలిస్తే కాంగ్రెస్ నేతలు ఊరికే ఉంటారా ? ఇప్పటికే బీఆర్ఎస్-బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ విషయాన్ని జాతీయస్ధాయికి తీసుకెళ్ళి బీజేపీని ఇరుకునపెట్టేందుకు రేవంత్(Revanth), మంత్రులు రెడీగా ఉన్నారు.
ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా ఆలోచించిన కమలంపార్టీ నేతలు స్టాండింగ్ కమిటి ఎన్నికల్లో గెలిచినా తమకు ఒరిగేదేమీ ఉండదని ఆలోచించి చివరినిముషంలో ఎన్నికల నుండి వెనక్కుతగ్గినట్లు తెలుస్తోంది. లాభంకన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని కమలంపార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. అందుకనే చివరినిముషంలో బీజేపీ వెనక్కు జరుకున్నది. బీజేపీని నమ్ముకుని నామినేషన్లు వేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇద్దరు చేసేదిలేక చివరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకుని పరువు దక్కించుకోవాలని డిసైడ్ అయ్యారు. విత్ డ్రా చేసుకోకపోయినా కాంగ్రెస్-ఎంఐఎంకు వచ్చే నష్టమేమీలేదు. బీజేపీ వెనకడుగు వేసిన కారణంగా కాంగ్రెస్-ఎంఐఎం సభ్యులు స్టాండింగ్ కమిటీకి ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇపుడు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికనే కాదు తొందరలోనే మేయర్, డిప్యుటి మేయర్ పై బీఆర్ఎస్ అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాలని చేస్తున్న ప్లాన్ కూడా ఇదేపద్దతిలో బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. మొత్తానికి బీజేపీని నమ్ముకుని బీఆర్ఎస్ పూర్తిగా ముణిగిపోయిందని మాత్రం అర్ధమవుతోంది.