
జూబ్లీహిల్స్ అభ్యర్థిపై బీజీసీ కసరత్తు.. ఆ ఇద్దరిలోనే..
బుధవారం బీజేపీ అభ్యర్థి ప్రకటన.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేయడానికి ఎన్నికల సంఘం రెడీ అయింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థి విషయంలో వేగం పెంచాయి. కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీకి పంపింది. కాగా బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపికపై కసరత్తులను మంగళవారం నుంచి స్టార్ట్ చేయనుంది. మంగళవారం బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో ఉపఎన్నికలో నిలబడే అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ముగ్గురు పేర్లను ఫైనల్ చేసి ఆ జాబితాను పార్టీ అధిష్టానానికి పంపనున్నారు. దాదాపు బుధవారం బీజేపీ అభ్యర్థి ప్రకటన జరగొచ్చని సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ టికెట్ రేసులో జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, లంకల దీపక్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో అతను మూడో స్థానానికే పరిమితం అయ్యారు. ప్రస్తుతం బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఒకసారి అవకాశం ఇచ్చినా గెలుచుకోలేకపోయిన లంకల దీపక్‌కు మరోసారి బీజేపీ అవకాశం ఇస్తుందా? లేదా? అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. ఆయన తర్వాత ఈ రేసులో జూటూరి కీర్తి రెడ్డి ఫేవరెట్ అభ్యర్థిగా ఉన్నారు. దీపక్‌కు కాకపోతే కీర్తిరెడ్డికే అవకాశమన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా లంకల దీపక్, జూటూరి కీర్తి రెడ్డి ఇద్దరూ కూడా కిషన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారని, కాబట్టి వారిలో ఒకరికే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అవకాశం దక్కుతుందన్న చర్చ బలంగా కొనసాగుతోంది.