గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతోందా ? కాంగ్రెస్ కు వార్నింగేనా ?
x

గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతోందా ? కాంగ్రెస్ కు వార్నింగేనా ?

తాజాగా వెల్లడైన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టంచేసింది. అదేమిటంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రమాదం పొంచుందని.


తాజాగా వెల్లడైన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టంచేసింది. అదేమిటంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రమాదం పొంచుందని. కారణం ఏమిటంటే బీజేపీ బలం పుంజుకుంటోందని అర్ధమవుతోంది. ముఖ్యంగా తనబలాన్ని గ్రామీణ ప్రాంతాల్లో పెంచుకుంటోందన్న విషయం ఓట్ల సరళిని చూస్తే అర్ధమైపోతోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో మూడుపార్టీలకు పోలైన ఓట్లను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

వెల్లడైన ఫలితాల ప్రకారం సుమారు 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ మొదటిస్ధానంలో నిలబడింది. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కమలంపార్టీ 8 నియోజకవర్గాల్లో గెలిచిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో నాలుగు చోట్ల గెలిచిన బీజేపీ తాజా ఎన్నికల్లో నూరుశాతం సక్సెస్ రేటు అంటే అదనంగా మరో నాలుగు సీట్లు గెలుచుకుని మొత్తం 8 చోట్ల జెండా ఎగరేసింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. దీన్ని ఆధారంగా చేసుకుంటే బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు సీట్ల పరిధిలోని 45 నియోజకవర్గాల్లో మొదటిస్ధానంలో నిలిచింది. ఈ నియోజకవర్గాల్లో అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లో ఉండటమే గమనార్హం. అందుకనే బీజేపీ బలం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే పెరిగిందన్న విషయం అర్ధమవుతోంది.

చేవెళ్ళ పార్లమెంటు పరిధిలోని పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారంచేయటానికి పార్టీకి గట్టి నేతలు కూడా లేరు. ఇలాంటి పరిగిలో కూడా బీజేపీ పెద్దఎత్తున ఓట్లు రావటం ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడినుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డిపైన గెలిచారు. పరిగిలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 16,653 ఓట్లు వస్తే తాజా ఎన్నికల్లో ఇదే పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో 74,800 ఓట్లు వచ్చాయి. ఇలాంటి ఉదాహరణలను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. అదేమిటంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన 39 నియోజకవర్గాల్లో ఇపుడు 30 చోట్ల బీజేపీ పాగావేసిందని. ఎందుకంటే 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కేవలం మూడంటే మూడు చోట్ల మాత్రమే మెజారిటి ఓట్లు సాధించింది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని గజ్వేలు, సిద్ధిపేట, దుబ్బాక అసెంబ్లీల్లో మాత్రమే కారుపార్టీకి మెజారిటి వచ్చింది. మెజారిటి వచ్చింది కాని ఇక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఓట్లు తగ్గిపోయాయి.

మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీనియోజకవర్గాల్లోను బీజేపీ హవాచూపించింది. అందుకనే బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కు సుమారు 3.5 లక్షల మెజారిటి వచ్చింది. చేవెళ్ళ, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆరు అసెంబ్లీల్లో, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున, మెదక్, జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని రెండు అసెంబ్లీల్లోను మెజారిటి వచ్చింది. అలాగే పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు, హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ మెజారిటి ఓట్లు తెచ్చుకుంది. బీజేపీ 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటిస్ధానంలో నిలబడటం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. కమలంపార్టీ మొదటిస్ధానంలో నిలబడటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే రెండు కారణాలు కనబడుతున్నాయి. మొదటి కారణం నరేంద్రమోడి గాలి అయితే రెండోకారణం కేసీయార్ వైఖరి. కేసీయార్ వైఖరి ఏమిటంటే తన ఓట్లను బీజేపీ కోసం త్యాగం చేసినట్లుగా ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

ఇదే విషయమై రేవంత్ రెడ్డి మాట్లాడుతు బీఆర్ఎస్ ఓట్లను కేసీయార్ బీజేపీకి అనుకూలంగా క్రాస్ చేయించినట్లుగా ఆరోపించారు. కేసీయార్ బీఆర్ఎస్ అభ్యర్ధులను బలిపెట్టి మరీ బీజేపీకి ఓట్లేయించి 8 సీట్లలో గెలవటానికి కారణమయ్యారని రేవంత్ ఆరోపించిన విషయం తెలిసిందే. రేవంత్ ఆరోపణలను గమనిస్తే నిజమేనేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ ను ఎలాగైనా సరే దెబ్బకొట్టాలని, పార్లమెంటు సీట్లు గెలవనీయకూడదని బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి అనుకూలంగా వేయించారనే ప్రచారం పెరిగిపోతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎవరి ఓట్లను వాళ్ళు వేయించుకునుంటే బీజేపీకి 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటి వచ్చే అవకావమే లేదన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి గణనీయంగా క్రాస్ అయ్యాయనేందుకు ఒక ఉదాహరణ కనబడుతోంది.

అదేమిటంటే కేటీయార్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కూడా బీజేపీకి మెజారిటి రావటమే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో బీజేపీకి వచ్చిన ఓట్లు 18,326 మాత్రమే. కాని తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఇదే సిరిసిల్ల అసెంబ్లీలో బీజేపీకి 72,559 ఓట్లు వచ్చాయి. అంటే గడచిన అసెంబ్లీలో వచ్చిన ఓట్లతో పోల్చితే తాజా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 54,231 ఓట్లు పెరిగాయి. ఆరుమాసాల వ్యవధిలో ఇన్నివేల ఓట్లు పెరగటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికలో 89,224 ఓట్లొస్తే తాజా పార్లమెంటు ఎన్నికల్లో 65,811 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దాదాపు ఇలాంటి ఉదాహరణే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీలో కూడా చూడచ్చు. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 3,988 మాత్రమే. అలాంటిది తాజా పార్లమెంటు ఎన్నికల్లో 62, 560 వచ్చాయి. ఇంత గణనీయంగా ఓట్లను పెంచుకున్నా మెజారిటి మాత్రం కాంగ్రెస్ కే వచ్చింది. బీజేపీకి ఓట్లు పెరగటంలో ఎవరు ఆశ్చర్యపోవటంలేదు కాని బీఆర్ఎస్ కు మించి చాలా నియోజకవర్గాల్లో మెజారిటీలు రావటమే ఆశ్చర్యంగా ఉంది. ఓటింగ్ సరళిని గమనిస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాగ్రత్తపడకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జాక్ పాట్ కొట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదని అనిపిస్తోంది.

Read More
Next Story