రిజర్వేషన్ ఏదైనా బీజేపీ వ్యతిరేకమేనా..!
x

రిజర్వేషన్ ఏదైనా బీజేపీ వ్యతిరేకమేనా..!

రిజర్వేషన్లంటే పడదు కాబట్టే బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్.


బీజేపీపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్లు అన్న మాటకు కూడా బీజేపీ వ్యతిరేకమన్నారు. అందుకే బీసీ రిజర్వేషన్లను కూడా బీజేపీ అడ్డుకుంటుందని, కానీ తమ పోరాటం ఇంతటితో ఆగదని అన్నారు. బీసీ రిజర్వేషన్లను అసెంబ్లీలో చట్టబద్ధంగా ఆమోద ముద్ర వేయించుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం తెచ్చిన జీఓకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని చెప్పారు. ఈ సందర్భంగానే బీసీ రిజర్వేషన్లను తమ ప్రభుత్వం సాధించి తీరుతుందన్నారు.

‘‘బీజేపీ అన్ని రకాల రిజర్వేషన్లకు వ్యతిరేకం. బీజీ రిజర్వేషన్లపై చట్ట సవరణ బిల్లు, ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటున్నదే బీజేపీ. రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆ పార్టీ నేతలు ఆమోదించారు. కానీ ఇప్పుడు మాట మారుస్తున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. బీసీ రిజర్వేషన్ బిల్లుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. బీజేపీ అనేది ఓ ఫ్యూడలిస్ట్(రాచరిక) పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీలంటే వారికి పడదు. అందుకే వారి రిజర్వేషన్లకు బీజేపీ వాళ్లు వ్యతిరేకం. అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బీజేపీ నేతలు న్యాయపోరాటంలో కూడా మద్దతుగా నిలవాలి’’ అని పొన్నం ప్రభాకర్ కోరారు.

సుప్రీం నిర్ణయం ఊహించిందే: రామ్‌చందర్ రావు

బీసీ రిజర్వేషన్ల జీఓపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఆశ్చకరం ఏమీ కాదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు అన్నారు. ‘‘సుప్రీంకోర్టు.. పిటిషన్‌ను కొట్టివేస్తుందని ముందే ఊహించాం. హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉండగా అదే అంశంపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించదు. అదే అంశంలో జోక్యం చేసుకోదు. ఈవిషయం చిన్నపిల్లోడిని అడిగినా తెలుస్తుంది. ఇందులో కాంగ్రెస్ మంత్రులు సాధించింది ఏముంది. ఆర్భాటంగా ఢిల్లీకి పోయి ఏదో సాధించినట్లు వాళ్లు ఫీల్ అవుతున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి, తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమే ఇది. దీంట్లో వాళ్లు సాధించింది ఏమీ లేదు. ఇది ఒక టెక్నికల్ అంశం మాత్రమే’’ అని ఆయన వివరించారు.

Read More
Next Story