ఎన్నడూలేని తరహాలో ఎమ్మెల్సీపై బీజేపీ ఫోకస్
x

ఎన్నడూలేని తరహాలో 'ఎమ్మెల్సీ'పై బీజేపీ ఫోకస్

ఎమ్మెల్సీ ఎన్నికపై గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ దృష్టి సారించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.


అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో మరింత జోష్ పెంచాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీయే అనే టాక్ రావడంతో నేతల్లో ఉత్సాహం ఊపందుకుంది. దీనికితోడు రాష్ట్రమంతా బీజేపీకి పేరున్న నాయకులు ఉన్నారు. ఒకప్పుడు బీజేపీకి రూరల్ లో నాయకత్వ లోపం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అర్బన్ లోనే కాదు రూరల్ నియోజకవర్గాల్లోనూ బలమైన నాయకత్వం ఏర్పడింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక పై గతంలో ఎన్నడూ లేని విధంగా కమలదళం దృష్టి సారించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.

డబుల్ ధమాకా జోష్...

2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మార్పును తెచ్చాయనడంలో అతిశయోక్తి లేదు. హ్యాట్రిక్ కొడతామనుకున్న బీఆర్ఎస్ రెండో స్థానానికి పడిపోయింది. ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కి విజయాన్ని అందించింది. 2018 ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే సాధించిన బీజేపీ 2023 కి వచ్చేసరికి 8 సీట్లకు ఎగబాకింది. ఓట్ పర్శంట్జ్ కూడా పెరిగింది. 2018 లో 6.98% ఉండగా 2023 లో డబుల్ అయ్యి 13.90% ఓట్లు బీజేపీ ఖాతాలో చేరాయి. ఇక లోక్ సభ ఎన్నికల్లోనూ డబుల్ డిజిట్ సాధిస్తామని కాషాయ నేతలు ధీమాగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికలతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయిందని, ప్రత్యమ్నాయ పార్టీగా బీజేపీ ఎదిగిందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను సైతం ఛాలెంజ్ గా తీసుకున్న రాష్ట్ర బీజేపీ పెద్దలు అందుకు తగ్గట్టుగా కార్యాచరణను మొదలుపెట్టారు.

టార్గెట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక...

వరంగల్ -ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును గెలవడమే లక్ష్యంగా చేసుకున్న బీజేపీ రాష్ట్ర అగ్రనాయకత్వాన్ని ఎన్నికల ప్రచారంలోకి దించింది. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితోపాటు సీనియర్ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే. అరుణ, ఎంపీ లక్ష్మణ్ తదితరులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధి లోని మూడు జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా పట్టభద్రుల సమ్మేళనాలు, మరోవైపు మార్నింగ్ వాక్ లు, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను తమవైపుకి తిప్పుకుని అత్యధికంగా మొదటి ప్రాధాన్యత ఓట్లను దక్కించుకునేందుకు చురుగ్గా ప్రచారం చేస్తున్నారు.

రంగంలోకి ముఖ్య నేతలు

వరంగల్, యాదాద్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం డీకే అరుణ నల్గొండలో, ఎంపీ లక్ష్మణ్ భువనగిరిలో, ఈటల రాజేందర్ జనగామలో పట్టభద్రుల సమ్మేళనాలు నిర్వహించి వారితో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్ధించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నిక ప్రచారానికి ఇంకా మూడు రోజులే గడువు ఉండడంతో మరింత మంది బీజేపీ కీలకనేతలు ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

రెండు పార్టీలు ఒక్కటేనంటూ ప్రచారం...

కాంగ్రెస్, బీఆర్ఎస్ ల వైఫల్యాలను ఎండగడుతూ, ఆ రెండు పార్టీలు ఒకటేనని, బీజేపీ గెలిస్తేనే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కాషాయ నేతలు. జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయక నిరుద్యోగులను కాంగ్రెస్ దగా చేసిందని ఆరోపిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న జటిలమైన సమస్యలను కూడా సున్నితంగా పరిష్కరించిందంటూ ప్రచారం చేస్తున్నారు.

భువనగిరిలో బుధవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ... ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బునంతా గ్యారెంటీలు, ఉచితాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వృథా చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన కుంభకోణం, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు? ఇక్కడే, ఆ రెండు పార్టీల మధ్య ఉన్న బంధం ఏమిటో ప్రజలకు తెలిసింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు వంటి జఠిలమైన సమస్యలను కూడా ఎంతో సమయస్ఫూర్తితో క్లియర్ చేసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. కేవలం బీజేపీ వల్లే రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. ఆలోచించి పట్టభద్రులు బీజేపీ అభ్యర్థికి ఓటేయాలి" అంటూ పట్టభద్రులకు పిలుపునిచ్చారు.

అందుకే ఎమ్మెల్సీ ఉపఎన్నిక...

వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానానికి 2021లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆయన గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో పల్లా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా... ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల బరిలో నిలుచున్నారు.

Read More
Next Story