
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చివరి ‘అస్త్రాన్ని’ ప్రయోగిస్తున్న బండి
ప్రచారంలో పెద్దగా ప్రభావం చూపలేక, స్టార్ క్యాంపెయినర్ల ప్రభావం కూడా కనబడకపోయేసరికి చివరికి రంగంలోకి దిగిన బండి మతాన్ని తమ చివరిఅస్త్రంగా ప్రయోగిస్తున్నారు
ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ప్రచారం కూడా ముగింపుదశకు వచ్చేస్తోంది. క్షేత్రస్ధాయిలో పార్టీకి ఇంకా ఊపురావటంలేదు. అభ్యర్ధి ప్రచారం, సీనియర్ నేతల వ్యూహాలు అంతగా వర్కవుట్ కావటంలేదు. మరోవైపు ప్రత్యర్ధిపార్టీలు ప్రచారంలో హోరెత్తించేస్తున్నాయి. ఈ దశలో ఏమిచేయాలి ? అందుకనే సడెన్ గా మతం అస్త్రాన్ని ప్రయోగం మొదలుపెట్టింది. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా ? బీజేపీ(Telangana BJP) గురించే. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్(Jubilee Hills by poll) అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్. 48 గంటల ముందు అంటే 9వ తేదీ సాయంత్రంతో ప్రచార ఘట్టం ముగిసిపోతుంది. కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత తో పాటు అభ్యర్ధుల తరపున పార్టీలు రోడ్డుషోలతో హోరెత్తించేస్తున్నాయి.
ఇదేసమయంలో బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి ప్రచారంకాని పార్టీతరపున జరుగుతున్న ప్రచారంకాని ప్రత్యర్ధిపార్టీలంత జోరుగాలేదన్నది వాస్తవం. అందుకనే చివరినిముషంలో కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు. ప్రత్యర్ధుల విషయంలో బండి విరుచుకుపడినట్లుగా సహచరమంత్రి జీ కిషన్ రెడ్డి లేదా పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు విరుచుకుపడలేరు. కిషన్, రామచంద్రరావుతో పాటు పోల్చితే బండిది బాగా నాటుభాష. బండిమాటలు ఎంతసేపు ఓల్డ్ సిటి, చార్మినార్, భాగ్యలక్ష్మీ దేవాలయం, పూజలు, ప్రమాణాలు, ఒట్ల చుట్టూనే తిరుగుతుంటాయి. ఇపుడు కూడా తనకు అలవాటైన పద్దతిలోనే ప్రత్యర్ధులకు సవాళ్ళు మొదలుపెట్టారు.
ప్రచారంలో పెద్దగా ప్రభావం చూపలేక, స్టార్ క్యాంపెయినర్ల ప్రభావం కూడా కనబడకపోయేసరికి చివరికి రంగంలోకి దిగిన బండి మతాన్ని తమ చివరిఅస్త్రంగా ప్రయోగిస్తున్నారు. మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ గురించి మాట్లాడుతు ‘‘విఘ్నేశ్వరుడి పూజ అనిచెప్పి ‘వక్రతుండ మహాకాయ’ చదవగలడా’’ ? అని నిలదీశాడు. ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గురించి మాట్లాడుతు ‘‘భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చేసి బొట్టుపెట్టుకోగలడా’’ ? అంటు చాలెంజ్ చేశారు. పై రెండు సవాళ్ళను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేశారు. ‘‘అజహర్ తో వక్రతుండ మహాకాయ చెప్పిచగలవా ? ఓవైసీతో భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చేయించి బొట్టు పెట్టుకునేట్లు చేయగలవా’’ ? అంటూ బోరుబండలో జరిగిన రోడ్డుషోలో రేవంత్ రెడ్డిని చాలెంజ్ చేశారు. ఇలాంటి అజహర్, ఓవైసీ ప్రచారంచేస్తున్న నవీన్ కు హిందువులు ఎందుకు ఓట్లేయాలన్నది బండి భావనగా కనబడుతోంది.
నియోజకవర్గంలోని మొత్తం 4.01 లక్షల ఓట్లలో మూడులక్షల ఓట్లు హిందువులవే. ముస్లింల ఓట్లు 1.20 లక్షలున్నాయి. ఇంతసడెన్ గా బండి మహమ్మద్ అజహరుద్దీన్, ఓవైసీలకు గణపతి పూజ, భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజల గురించి ఎందుకు సవాళ్ళు విసిరారు ? ఎందుకంటే ముస్లింల ఓట్లు ఎలాగూ పడవని డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే హిందువుల ఓట్లలో మెజారిటి అయినా వేయించుకోవాలని వ్యూహం పన్నినట్లు అనుమానంగా ఉంది. హిందువుల ఓట్లు పడాలంటే బీజేపీకి ఊరికే పడతాయా ? ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు నవీన్, సునీత కూడా హిందువులే. అలాగే స్ధానికంగా చాలా బలమైన నేపధ్యం ఉన్నవాళ్ళు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న డెవలప్మెంట్లను గమనిస్తే బీజేపీకి మూడోస్ధానం గ్యారెంటీ అనేప్రచారం బాగా జరుగుతోంది. ఇదేవిషయమై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతు ‘‘బీజేపీ 10 వేల ఓట్లు తెచ్చుకుంటే అదే గెలిచినంత’’ అని ఎద్దేవాచేశారు.
ఎన్నికలో హిందువుల ఓట్లు వేయించుకోవాలంటే అలవాటైన మతం అస్త్రాన్నే ప్రయోగించాలి. అందుకనే బండి హఠాత్తుగా వినాయకుడు, భాగ్యలక్ష్మి అమ్మవారి పూజలంటు రోడ్డుషో ప్రచారం మొదలుపెట్టారు. హిందు సెంటిమెంటును ప్రయోగిస్తే ఓట్లు పడతాయేమో అన్న ఆలోచన బండి సవాళ్ళల్లో కనబడుతోంది. మతం అనే అస్త్రాన్ని ప్రయోగించి ఓట్లను రాబట్టుకోవాలన్న ఆలోచన తప్ప బండి సవాలులో మరో ఆలోచన కనబడటంలేదు. బండి సవాళ్ళకు రేవంత్ లేదా అజహర్ సమాధానం ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. బండి ఏనాడైనా మసీదుకు వెళ్ళి ప్రార్ధనలు చేశారా ? ముస్లింలు సంప్రదాయంగా పెట్టుకునే టోపీని ధరించారా అనే సందేహాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బండి ప్రయోగిస్తున్న హిందు అస్త్రం ఓటర్లపై ఎంతవరకు పనిచేస్తుందో చూడాల్సిందే.

