
HILT Policy: ‘పరిశ్రమల పాలిట యమపాశం’
రైతుల భూములను ఫోర్త్ సిటీ కోసం వినియోగిస్తున్నారన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌మిషన్(HILT) పాలసీపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పాలసీ పరిశ్రమల పాలిట యమపాశమన్నారు. హిల్ట్ పాలసీ కింద జారీ చేసిన జీవో 27 తీవ్ర వివాదాలకు కారణమవుతోందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై జరిగిన చర్చలో ఆయన ప్రభుత్వ నిర్ణయాలపై ఘాటుగా స్పందించారు. జీవో 27 లీక్ కావడం ప్రభుత్వంలోనే కలవరం సృష్టిస్తోందని ఏలేటి వ్యాఖ్యానించారు.
ఆ జీవోలో టౌన్‌షిప్‌లు అపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేయాలనే అంశాలు ఉండటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. విలువైన భూములను అతి తక్కువ ధరలకు కేటాయించారని విమర్శించారు. హిల్ట్ పాలసీపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందుకు తీసుకురాకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. 22 మంది పారిశ్రామికవేత్తలను అన్యాయంగా పక్కన పెడుతున్నారని ఆరోపించారు.
ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి సేకరించిన భూములను ఇప్పుడు ఫోర్త్ సిటీ అవసరాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ భూములపై హైకోర్టు ఇప్పటికే ఆఫిడవిట్ కోరిందని గుర్తుచేశారు. ప్రస్తుత పారిశ్రామిక విధానం పరిశ్రమలు మూతపడేలా తయారైందని ఏలేటి విమర్శించారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలలో తప్పులు ఉంటే వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అవసరమైతే పాత జీవోలను రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉందని చెప్పారు.
పరిశ్రమల కోసం కేటాయించిన భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని ఏలేటి ఆరోపించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేల సంఖ్యలో జీవోలను దాచిపెట్టిందని విమర్శించిన ఆయన ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసిన జీవోలలో కూడా చాలా తక్కువ సంఖ్య మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయని ఆరోపించారు. జీవో 27 చుట్టూ ఏర్పడిన అనుమానాలకు సమాధానం చెప్పాలంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాల్సిందేనని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

