హిందువులను రెచ్చగొడుతున్న బీజేపీ ఎంఎల్ఏ రాకేష్ రెడ్డి
జంటనగరాల్లోని హిందూ పిచ్చోళ్ళకు సిగ్గు, శరం, చీము, నెత్తురు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి హిందువులను రెచ్చగొడుతున్నారు. జంటనగరాల్లోని హిందూ పిచ్చోళ్ళకు సిగ్గు, శరం, చీము, నెత్తురు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంఎల్ఏ ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయటానికి కారణం ఏమిటంటే నగరంలోని దేవాలయాలపైన కొందరు గుర్తుతెలీని వ్యక్తులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పెట్టిన అమ్మవారి విగ్రహంపై దాడిచేసి చేతులు, కాళ్ళు విరిచేశారు. సికింద్రాబాద్, రెజిమెంటల్ బజారులోని మరో దేవాలయంపైన దాడిచేసి విగ్రహాన్ని పగులగొట్టారు. మోండా మార్కెట్ లోని ముత్యాలమ్మ దేవాలయంపైన దాడిచేసి ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
మరికొన్ని చోట్ల కూడా హిందు ప్రార్ధనామందిరాలపైన దాడులకు ప్రయత్నాలు జరిగాయి. ఇన్నిరకాలుగా దాడులు చేసి విగ్రహాలను ధ్వంసంచేస్తున్నా పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఎవరినీ పట్టుకోలేదు. దాంతో ఎంఎల్ఏ రాకేష్ రెడ్డికి బాగా మండినట్లుంది. అందుకనే పోలీసులపైన నిరసన తెలుపుతునే హిందువులను రెచ్చగొట్టేట్లుగా మాట్లాడారు. హిందువులకు నిజంగా సిగ్గు, శరం, చీము, నెత్తురుంటే ఇలాగే పట్టనట్లుంటారా అని నిలదీశారు. హైదరాబాద్ లో హిందువులంటే సిగ్గు, శరం లేని జాతి అన్నారు.
ఒకవైపు ప్రార్ధనామందిరాలపై దాడులుచేసి విగ్రహాలను ధ్వంసంచేస్తుంటే హిందువులకు రక్తం ఇంకా ఎప్పుడు మరుగుతుందని నిలదీశారు. పనిలోపనిగా ఎంఐఎం అధినేతలు, ఓవైసీ సోదరులు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీకి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. హిందువుల్లో మగతనం చచ్చిపోయింది కబట్టే మశీదులపైన దాడిచేయటానికి ఒక్కడు కూడా ధైర్యం చేయటంలేదన్నారు. ఒక దేవాలయంపైన దాడిచేసింది పిచ్చోడని పోలీసులు చేసిన ప్రకటనను మీడియా గుర్తుచేయగా ఏ హిందు పిచ్చోడు మశీదులపైకి ఎందుకు వెళ్ళటంలేదని ప్రశ్నించారు. జంటనగరాల్లోని సుమారు లక్షమంది హిందుపిచ్చోళ్ళల్లో ఒక్కడు కూడా ఎందుకని మశీదుపైన దాడిచేయలేదని ఎంఎల్ఏ నగర కమీషనర్ సీవీ ఆనంద్ ను సూటిగా ప్రశ్నించారు.
ఒకవైపు దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం, పోలీసులు హిందువులపైనే ఆంక్షలు విధించటం విచిత్రంగా ఉందన్నారు. జరుగుతున్నది చూస్తుంటే దేవాలయాలపైన దాడుల వెనుక ప్రభుత్వ ప్రోత్సాహం ఉందేమో అన్న అనుమానాన్ని కూడా ఎంఎల్ఏ వ్యక్తంచేశారు. నిజానికి ప్రార్ధనా మందిరాలపైన దాడులు జరగటం అన్నది నూరుశాతం తప్పే. ఒక మతం మనోభావాలను మిగిలిన వాళ్ళు గౌరవించినపుడు ఇలాంటి ఘటనలు జరగవు. జంటనగరాల్లో చాలాకాలం క్రితమే మతకలహాలన్నవి ఆగిపోయాయి. అలాంటిది ఇంతకాలానికి సడెన్ గా దేవాలయాలపైన దాడులు జరగటం, దేవీ విగ్రహాలను ధ్వంసం చేయటం అన్నది ఆశ్చర్యంగా ఉంది. జరుగుతున్న విధ్వంసాల విషయంలో పోలీసులు గనుక వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ముందు ముందు చాల సమస్యలు తప్పేలా లేవు.