![AK Aruna | ‘విద్యార్థుల మరణాలకు ప్రభుత్వానికి పట్టవా’ AK Aruna | ‘విద్యార్థుల మరణాలకు ప్రభుత్వానికి పట్టవా’](https://telangana.thefederal.com/h-upload/2024/11/12/490027-dk-aruna.webp)
AK Aruna | ‘విద్యార్థుల మరణాలకు ప్రభుత్వానికి పట్టవా’
విద్యార్థులపై మానసిక ఒత్తిడి కూడా పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రోజుకో విద్యార్థి మరణిస్తున్నారు. ఏదో ఒక కారణంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల వరుస మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందోంటూ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు అనేవారు రాష్ట్ర, దేశ భవితకు బాటలు వేసేవారని, అటువంటి వారు ప్రాణాలు తీసుకుంటుంటే ప్రభుత్వం పట్టనట్లు ఎందుకు వ్యవహరిస్తోందని ఆమె ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల ఇంతటి నిర్లక్షధోరణి వహించడం ఏమాత్రం సబబు కాదని అన్నారు.
ఇటీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది తీవ్ర విషాదకరమైన విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం షాద్‌నగర్‌లో నీరజ్ అనే విద్యార్థి పాఠశాలపై నుంచి దూకి మృతి చెందాడని, గురువారం బాలానగర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆరాధ్య అనే విద్యార్థిని ఉరివేసుకుని అసువులు ఆత్మహత్య చేసుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరుగా ప్రాణాలు కోల్పోతుంటే ఈ అంశంపై ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదని కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీశారు బీజేపీ ఎంపీ.
విద్యార్థుల మరణాలపై స్పందించిన డీకే అరుణ.. అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించారు. ప్రభుత్వ వసతు గృహాల్లో ఇటువంటి పరిస్థితులు ఏర్పడటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, సమస్యలు వెలుగులోకి రావాలని, వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. విద్యార్థుల ఆత్మహత్యల వెనక ఉన్న అసలు కారణాలు తేలాలని, ఈ అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు డీకే అరుణ.
విద్యార్థుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవలంబిస్తోన్న నిర్లక్షధోరణిని డీకే అరుణ ఎండట్టారు. విద్యార్థుల జీవితాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందని మండిపడ్డారు. విద్యా వ్యవస్థల్లో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని, వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకు అధికమవుతున్నాయని, విద్యార్థులపై మానసిక ఒత్తిడి కూడా పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు సరైన మానసిక మద్దతు అందించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, వసతి గృహాల్లో పర్యవేక్షణను పటిష్టం చేయాలని కోరారు. విద్యార్థుల భద్రతను పెంచడం కోసం ప్రభుత్వం తక్షణమే సమగ్ర ప్రణాళికలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండటం తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేస్తోంది. తమ పిల్లలను బడికి పంపించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు వచ్చాయని, చదువు లేకపోయినా తమకు తమ పిల్లలు ఉంటే చాలన్న ధోరణి తల్లిదండ్రుల్లో కనిపిస్తోందని డీకే అరుణ పేర్కొన్నారు. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.