![Caste Census | సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య స్ట్రాంగ్ వార్నింగ్.. Caste Census | సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య స్ట్రాంగ్ వార్నింగ్..](https://telangana.thefederal.com/h-upload/2025/02/07/511190-revanth-reddy.webp)
Caste Census | సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య స్ట్రాంగ్ వార్నింగ్..
బీసీలకు అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటే దానిని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తుడిచేయాలని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు.
బీసీలకు అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటే దానిని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తుడిచేయాలని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలకు అన్యాయం చేయడం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉందని, ఆది నుంచి కూడా అనేక సందర్భాల్లో బీసీలకు అన్యాయం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో కుల గణన చేపట్టి.. బీసీలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారని, అలాంటప్పుడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బీసీ రిజర్వేషన్‌పై ఎందుకు బిల్లు పెట్టలేదని ప్రశ్నించారు. బీసీ వ్యతిరేకిగా సీఎం రేవంత్ మారారని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో నిర్వహించిన సభలో బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు చెప్పినట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని, లేనిపక్షంలో రేవంత్ రెడ్డి చిట్టా అంతా బయటపెడతానని హెచ్చరించారు.
‘‘రాష్ట్రంలో బీసీలను అణచివేయడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించడం ద్వారా అన్ని రంగాల్లో, రిజర్వేషన్లలో అవకాశాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ చేసిన కులగణన తప్పుల తడక. కులగణనలో బీసీల జనాభా శాతాన్ని తక్కువ చేసి చూపించారు. ఈ పరిణామం రాష్ట్రంలో బీసీలను రాజకీయంగా అణచివేసే కుట్రే. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే వ్యూహాత్మకంగా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.
దేశమంతా కులగణన జరగాలి
బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని, అదే విధంగా జాతీయ స్థాయిలో కుల గణన చేపట్టాలని కృష్ణయ్య కోరారు. అదే విధంగా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను కేటాయించాలని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.51వేల కోట్లు ఇవ్వాలన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని, బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో బీసీలకు మద్దతుగా చేపట్టే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. బీసీల జనాభాను తగ్గించి చూపింది కాక.. అనేక కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదంటూ కాకమ్మ కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు కృష్ణయ్య.