
మదర్సాలపై సీఎంకు లేఖ రాసిన బీజేపీ ఎంపీ
ప్రశాంతంగా ఉన్న మండల కేంద్రంలో ఎందుకు ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతున్నట్లు అనుమానాలు ఉన్నాయన్నారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని శివాలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేసిన అంశంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. ఈ ఘటనలో దగ్గర్లో ఉన్న మదర్సా విద్యార్థుల హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఓ బహిరంగ లేఖ కూడా రాశారు. అంతేకాకుండా ఈ ఘటనలో ఉన్న నిందితులను కాపాడటానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘‘జిన్నారంలో శివాలయంలో శివలింగాన్ని కోతులు ధ్వంసం చేశారని పోలీసులు చెబుతున్నారు. సమీపంలో ఉన్న మదర్సా లో ఎవరున్నారు ? అనుమతులు ఉన్నాయా ? మదర్సలో ఉన్న వారు విదేశీయులు. డీజీపీని కలిసి మదర్సా ల వివరాలు చెప్పాలని కోరాను. జిన్నారం మదర్సా లో 70 మంది విద్యార్థులు ఉన్నారు.. వారిలో 65 మంది కిషన్ గంజి బీహార్ కు చెందినవారు. ప్రశాంతంగా ఉన్న మండల కేంద్రంలో ఎందుకు ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ చదువుతున్న వారితో పాటు చదువుచెప్పే వారు కూడా బీహార్ కిషన్ గంజికి చెందిన వారే అని చెబుతున్నారు. పిల్లలు, టీచర్లు ఎక్కడి వారు అని చెప్పడానికి ఆధారాలు కూడా లేవు’’ అని రఘునందన్ రావు పేర్కొన్నారు.
‘‘కిషన్ గంజి బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం. జిన్నారంలో ఉన్న మదర్సా కోదండరాముని ఆలయ స్థలం. రాష్ట్రంలో ఉన్న మదర్సా లో ఎన్ని ? ఎంత మంది చదువుతున్నారు ? ఇంతకుముందు మదర్సలో చదివినవారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ? మదర్స ఇచ్చే సర్గిఫికెట్ ఏంటి ? దానికి ఉన్న విలువ ఏంటి ? సదాశివపేట మున్సిపాలిటీ లో బంగ్లాదేశీయులకు బర్త్ సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న దేశాన్ని కలుషితం చేయడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ఈ విషయాలపై సీఎం రేవంత్ కు లెటర్ రాస్తున్నా. అనుమతిలేని మదర్సా లపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఇస్నాపూర్ లో 247 మంది నేపాల్ వారికి ఆధార్ కార్డ్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. సీఎం వారం రోజుల్లో స్పందించకపోతే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తాం’’ అని పేర్కొన్నారు.
రేవంత్‌కు రాసిన లేఖలో ఏముందంటే..
‘‘తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనల గురించి మీకు తెలియంది కాదు. నాంపల్లిలో దుర్గాదేవి మంటపాన్ని, పాతబస్తీలో అమ్మవారి విగ్రహం, వికారాబాద్ జిల్లాలో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఆ తర్వాత ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఇత్యాది విషయాలు మీడియాపరంగాను పోలీసు నివేదిక ద్వారాను మీ దృష్టికి వచ్చి ఉంటాయని భావిస్తున్నాను.
ఇక ఇటీవలే నా మెదక్ నియోజకవర్గంలోని జిన్నారంలో కొందరు మదర్సాలో చదివే పిల్లలు శివాలయంలోకి వెళ్లి శివుడి విగ్రహం ధ్వంసం చేసిన ఘటన సీసీ కెమెరాల ద్వారా వెలుగులోకి కూడా వచ్చింది. అంతకుముందు మెదక్ పట్టణంలో బక్రీద్ సందర్భంగా ఆవుల వధింపు విషయంలో కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తింది. సదాశివపేటలో అక్రమంగా నివసిస్తున్న అనేకమంది బంగ్లాదేశ్ పౌరులకు ఓటరు కార్డు, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయని స్వయంగా మున్సిపల్ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం మీకూ, తెలంగాణకు ప్రజలకు కూడా విదితమే.
తెలంగాణలో శాంతిభద్రతల సమస్య నివురుగప్పిన నిప్పులా ఉన్నట్టు కనబడుతున్నది. ముఖ్యంగా జిన్నారంలో మదర్సాలో చదువుతున్న 70 మంది విద్యార్థులలో 65 మంది బీహార్ రాష్ట్రంలోని కిషన్ గంజ్ నుంచి వచ్చి చదువుకుంటున్నట్టుగా చెబుతున్నారు, కానీ వారి పూర్తి వివరాలు ఎవరికి అందుబాటులో లేవు. ఆ మదర్సాలో చదువులు చెబుతున్న వాళ్లు కూడా తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదు. అయితే వారు బీహార్, బెంగాల్ ఇతర రాష్ట్రాల వారు అని చెప్పుకుంటున్నా వాళ్లు మాత్రం భారతీయ పౌరులు కాదని స్థానికులు గట్టిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జెన్నారంతో పాటు తెలంగాణలో ఉన్న అనుమతి కలిగిన మదర్సాలు ఎన్ని? అనుమతి లేకుండా నడుస్తున్నవి ఎన్ని? అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఎవరెవరు? వారి యొక్క కుటుంబ వివరాల నమోదు మనకు ఉన్నదా? వారు ఏ దేశానికి సంబంధించిన వారు? ఆ మదర్సాలలో బోధిస్తున్నటువంటి పాఠ్యాంశాలు ఏమిటి? అక్కడ భారతదేశ వ్యతిరేకతను నూరిపోస్తున్నట్టుగా అనేకసార్లు అనుమానాలు కూడా వస్తున్నాయి, అవి నిజం కూడా కావచ్చు.
ఇటీవలే కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన నరమేధం తర్వాత భారత ప్రభుత్వము హోంమంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీలతో పాటు అక్రమంగా నివాసముంటున్న ఇతర దేశస్థులను వెంటనే వారి సొంత దేశాలకు పంపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. ఆ ఆదేశాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఎంతమంది పాకిస్తానీ దేశస్థులను వెనక్కి పంపింది? అక్రమంగా నివాసం ఉంటున్న ఇతర దేశస్థులను ఏం చేసింది అనే విషయం కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకో గోరుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మరియు హోమ్ శాఖ రెండు మీరే నిర్వహిస్తున్నారు, కాబట్టి వెనువెంటనే తెలంగాణలో ఉన్న మదర్సాలు అందులో ఉన్న విద్యార్థులు పాఠాలు బోధించే వాళ్ళు, వాళ్ళ వివరాలు, వాళ్ళ నేపథ్యం, వారి చరిత్ర తెలుసుకొని ఇటు విద్యా విదానం, అటు శాంతిభద్రతలు కాపాడే విషయంలో వెంటనే సమీక్ష చేసి తెలంగాణ ప్రజలకు అట్టి విషయాలను వెల్లడిస్తారని ఒక పార్లమెంటు సభ్యుడుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ఆయన తన లేఖలో రాసుకొచ్చారు.