
కన్ఫ్యూజన్‌లో కాంగ్రెస్.. సెటైర్లు వేసిన బీజేపీ ఎంపీ
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ప్రభుత్వానికి తెలీదన్న రఘనందన్ రావు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు సెటైర్లు వేశారు. ఈ ప్రభుత్వం 20 నెలలుగా ఏం చేయాలో తెలియన్ అయోమయంలో ఉందని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అసమర్థత, కుటుంబ పాలనను ఎండగడతామని కోతలు కోసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదని అన్నారు. ప్రభుత్వానికే క్లారిటీ లేకపోవడం అనే విడ్డూరం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నానంటూ చురకలంటించారు. ఎన్నికల సమయంలో ఆకాశమే హద్దుగా హామీలు, భరోసాలు ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబం తిన్న రూ.లక్ష కోట్లను కక్కించి పేదలకు పంచుతానని కాంగ్రెస్ చెప్పలేదా? అని ప్రశ్నించారు. కానీ ఇప్పటి వరకు నయాపైసా కూడా కక్కించలేదని ఎద్దేవా చేశారు. పైగా ప్రకటించిన సంక్షేమ పథకాలను కూడా సరిగా అమలు చేయడానికి డబ్బులు లేవని చెప్పుకునే దుస్థితికి రేవంత్ ప్రభుత్వం చేరిందని విమర్శించారు.
కొందరి బుద్ది మారాలని కోరుకున్నాం..
‘‘వర్షాలు బాగా కురుస్తున్నాయి. కానీ ఒకదశలో అవి ఆగకుండా అన్నదాత ఆగమవుతాడు. ఇదే విషయాన్ని రైతులూ చెప్తున్నారు. కానీ ప్రకృతి, పర్యావరణం ప్రకోపిస్తోంది. మనుషుల ప్రవర్తన, బుద్ది మారాలని నవరాత్రుల సందర్భంగా కనకదుర్గను కోరుకున్నాను. రాష్ట్రంలో రహదారుల దుస్థితి అగమ్యగోచారంగా ఉంది. జాతీయ రహదారులు తప్ప మిగిలిన రహదారులపై ప్రయాణించే పరిస్థితి లేదు. భారీగా పడుతున్న వర్షాలతో రోడ్లు గుంతలమయం అయ్యాయి. ఈ రోడ్లపై ప్రయాణించాలంటూ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సివస్తోంది. కానీ ఈ ప్రభుత్వానికి ఇవేమీ పట్టవు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.